బేబీ షవర్!

20 Jul, 2014 23:43 IST|Sakshi
బేబీ షవర్!

సృష్టిలో ప్రాణికి మూలం అమ్మ. ఆ అమ్మతనానికి పండుగ.. సీమంతం. చేతి నిండా గోరింట పూసి.. గాజులు వేసి.. కడుపులో ఉన్న బిడ్డకు సంగీతాన్ని పరిచయం చేసి.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ అతిథులు మనసారా దీవించే వేడుక. ఆ సంప్రదాయ సీమంతం కాస్తా నగరంలో ‘బేబీ షవర్’ అయ్యింది. ప్రపంచంలోకి అడుగిడబోయే బేబీకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఆత్మీయులు మోడరన్‌గా చేస్తున్న సెలబ్రేషన్.. బేబీ షవర్!
 
సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆడంబరంగా జరిపే ఈ వేడుకను గ్రాండ్‌గా కాబోయే తల్లి ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తున్నారిప్పుడు. సీమంతానికయితే బొట్టు పెట్టి పిలుస్తారు. కానీ ఇన్విటేషన్ కార్డ్‌తోనే ఈ ఈవెంట్ కొత్తదనం మొదలవుతుంది. ఓ పెళ్లి పత్రికలా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయిస్తున్నారు. తొలిసారి అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నవారు మాత్రం ఆత్మీయులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి చాలా ప్లాన్లు వేసుకుంటున్నారు.
 
డిఫరెంట్ థీమ్స్

ఇప్పుడు బేబీ షవర్ కోసం రకరకాల థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన థీమ్‌ను ఎంచుకుని చెబితే సరి.. పెళ్లికి పందిరి డెకరేట్ చేసినట్టుగా ఇంటిని లేదా బంకిట్ హాల్‌ను పూర్తిగా డెకరేట్ చే సేవాళ్లున్నారు. వేడుకలో టేస్ట్‌ను బట్టి థీమ్ ఉంటుండగా.. ఆ డెకరేషన్స్‌లో అధికశాతం రంగులు మాత్రం రెండే ఉంటున్నాయి. అవి నీలం... గులాబీ! అవును ప్లజెంట్‌గా కనిపించే బ్లూ, పింక్‌కే ఓటేస్తున్నారు కాబోయే తల్లిదండ్రులు. ఇక కాబోయే తల్లిని ఊహల్లో తేలియాడించే బెలూన్స్ అయితే కంపల్సరీ.
 
అట్రాక్టివ్ కేక్స్
ఈ బేబీ షవర్స్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ కేక్స్. మీకు అభిరుచి ఉండాలే కానీ, ఐడియా చెబితే చాలు.. మీ ఆలోచనలకు తగ్గ కేక్ అందంగాతయారవుతుంది. ప్రెగ్నెంట్ లేడీ బొమ్మతో ఉన్న కేక్ ఒకటయితే..పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో? అని ఊహిస్తూ ఉండే కేక్ మరొకటి. ఇక ట్విన్స్ కోసం ప్రత్యేక కేక్. బేబీ బోయ్, బేబీ గర్ల్ కోసం డిఫరెంట్ కేక్స్. ఇలా అన్నీ ఇన్నోవేటివ్. ఈ బేబీ షవర్‌లో ఫుడ్ అయితే ఉంటుంది కానీ.. ఇది పూర్తి స్థాయి విందులా ఉండదు.
 
స్పెషల్ గేమ్స్
కాబోయే తల్లిని బిడ్డతో ఆడేందుకు సంసిద్ధం చేసేందుకు గేమ్స్ కూడా ఉంటాయి బేబీ షవర్‌లో. అయితే అవి బేబీ పుట్టుకకు సంబంధించినవి మాత్రమే. ఉదాహరణకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా? టమ్మీ సైజ్ ఎంత? డైపర్ చేతికిచ్చి బేబీ అని పలకకుండా ఆ డైపర్‌ను ఎలా ఉపయోగిస్తారో చెప్పడం. ఒక నోట్ బుక్ తీసుకుని వచ్చిన అతిథులందరూ డెలివరీ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు రాయమని అడగడం. వేడుకకు వచ్చిన అతిథులందరూ కూర్చుని మధ్యలో బాల్‌తో మ్యూజిక్ అండ్ డ్యాన్స్, మ్యూజికల్ చైర్, పుట్టబోయే బిడ్డకు పది సెకన్లలో పేరు సూచించడంలాంటి ఆటలన్నమాట.

ఇన్నోవేటివ్ గిఫ్ట్స్
బేబీ షవర్‌కు వెళ్లేవాళ్లు ఏ కానుక తీసుకెళ్లాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో రకరకాల గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. బేబీకి ఉపయోగపడే డైపర్స్ నుంచి బ్లాంకెట్స్, బేబీ బాటిల్స్, క్లాత్స్, బొమ్మలు, బుక్స్, మొక్కలు, డెలివరీ కిట్, బేబీ బాత్‌కి అవసరమయ్యే రకరకాల వస్తువులు.. ఇలా కానుకలకు కొదవే లేదు. అయితే ఆయా వస్తువులు పార్టీలోనే ఓపెన్ చేయాలన్న రూల్ ఉంది. ఆహ్వానం మహిళలకు మాత్రమే అనే రూల్ ఉన్నా.. ఇంతమందితో, ఇలాంటి చోట, ఈ సమయంలోనే చేయాలన్న నిబంధన
 మాత్రం లేదు.
 ..:: ప్రత్యూష

మరిన్ని వార్తలు