రిక్టర్‌ స్కేలూ తట్టుకోలేని హృదయ ప్రకంపనలివి..

19 Nov, 2018 00:04 IST|Sakshi
∙ పాపాయిని రక్షించే ప్రయత్నంలో జవాన్లు , పాపాయిని తల్లిచేతిలో పెట్టిన క్షణాలు

లాతూర్‌ భూకంపంలో నాలుగు రోజుల పాటు శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న పాపాయిని ప్రాణాలతో కాపాడి, తల్లిదండ్రుల ఒడికి చే ర్చి, వారి అభ్యర్థనపై ఆ పాపాయికి పేరు పెట్టిన జవాను.. ఇరవై ఐదేళ్ల తర్వాత తిరిగి ఆ పాపాయిని కలిసిన ఉద్విగ్న క్షణాలివి. రిక్టర్‌ స్కేలు కూడా తట్టుకోలేని హృదయ ప్రకంపనలివి.

‘‘నిన్ను రోజూ తలుచుకుంటాం, నువ్వెక్కడున్నావో తెలియక..’’ అంది ఆ ‘కూతురు’.. ఫోన్‌లో. ‘‘నువ్వక్కడే ఉంటావని తెలుసు, కానీ రెండేళ్లకో బదిలీతో నా వస్తువులు కకావికలమై పోయా యి. నేను దాచుకున్న నీ ఫొటోలు మాత్రం నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఓ నెల్లాళ్ల ముందు ప్రయత్నించి ఉంటే నీ పెళ్లి చూసేవాడిని’’ అంటూ ఆ ‘తండ్రి’ కదిలిపోయాడు. ‘‘నిన్ను చూడటానికి వస్తున్నా’’ అని చెప్పి ఆనందంతో కళ్లు తడుచుకున్నాడు. చెప్పినట్లుగానే మరుసటి రోజే పుణె నుంచి లాతూర్‌లోని మన్‌గ్రుల్‌ గ్రామం చేరుకున్నాడు. సహోద్యోగి సహాయంతో ప్రియ ఇంటికి వెళ్లాడు. ప్రియ తల్లి చేతులెత్తి అతడికి మొక్కింది. అతడి కళ్లు మరెవరి కోసమో వెతుకుతున్నాయి. ఆ వ్యక్తి గోడ మీద ఫొటోలో కనిపించాడు.  ‘‘నాన్న పోయి నాలుగు నెలలైంది’’ అని చెప్పింది ప్రియ.

‘‘మీరు బతికించిన బిడ్డ’’ అంటూ ప్రియను చూపించింది ప్రియ తల్లి. ‘‘ఎంత పెద్దయిపోయావు’’ అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడామెని. ఆ ఇంట్లో దేవుడి పటాల పక్కన తన ఫొటో ఉండడం చూసి ఉద్వేగానికి లోనయ్యాడతడు. ఆ రోజు... రాళ్ల గుట్టల మధ్య నుంచి పాకుతూ ఆ పాపాయిని ఛాతీమీద ఉంచుకుని పైకి వచ్చిన సంఘటన కళ్ల ముందు మెదిలింది అతడికి. 1993, సెప్టెంబర్‌ 30 తెల్లవారు జామున నాలుగవుతోంది. మహారాష్ట్ర, లాతూర్‌ జిల్లా, మన్‌గ్రుల్‌ గ్రామం. మరీ పొద్దున్నే నిద్రలేచే అలవాటున్న కొందరు తప్ప మిగిలిన అందరూ కదలిక లేకుండా పడుకుని ఉన్నారు. అప్పుడు వచ్చింది భారీ భూకంపం.

దాదాపు పది  వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముప్పై వేల మంది గాయపడ్డారు. దేశం ఉలిక్కిపడింది. సహాయక చర్యల కోసం మిలటరీ బలగాలు దిగాయి. ఆ బలగాల్లోని ఒక బృందంలో అప్పటికి ఎనిమిది నెలల కిందట లెఫ్టినెంట్‌గా ఉద్యోగంలో చేరిన బిహార్‌ కుర్రాడు సుమీత్‌ బాక్సి కూడా ఉన్నాడు.  హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. ఎటు చూసినా కూలిన గోడలు, శిథిలాల మధ్య చిక్కుకున్న ప్రాణం లేని మనుషులు, పశువుల దేహాలు! మనుషుల్ని, పశువుల్ని వేరు చేస్తున్నారు సుమీత్‌ బాక్సి, అతడి బృందం. పశువులను గొయ్యి తీసి పూడ్చేస్తున్నారు. మనుషులను వెంటనే పూడ్చకుండా, వాళ్ల వాళ్లెవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తారేమోనని ఒక చోట పడుకోబెడుతున్నారు. రోజులు గడుస్తున్నాయి.

కుళ్లి పోతున్న శవాలను ఫొటోలు తీసి, దహనం చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన సుమీత్‌కి మనసు కలచి వేస్తోంది. ఐదవ రోజు ఒక భార్యాభర్త అక్కడికి వచ్చారు. ‘మా బిడ్డ దేహాన్ని వెతికి ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటాం’ అని అడిగాడతడు కన్నీళ్లు తుడుచుకుంటూ. అతడి భార్య  మౌనంగా రోదిస్తూ ఉంది. కన్నీళ్లు చెంపల మీద కారిపోతున్నాయి. అప్పుడే భోజనానికి కూర్చున్న సుమీత్‌ వెంటనే లేచాడు. ‘నాలుగు రోజులుగా సరిగ్గా తినకుండా పని చేస్తున్నావు, భోజనం పూర్తి చేసి వెళ్దాం’ అని తోటి జవాన్లు అతడిని ఆపడానికి ప్రయత్నించారు. సుమీత్‌ కూర్చోలేక పోయాడు.

పాపాయి దేహం కోసం
ఆ దంపతులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వాళ్ల ఇల్లు ఉండాల్సిన చోటుకెళ్లాడు. అక్కడ వరుసగా ఏడు ఇళ్ల శిథిలాలు పోగుపడి ఉన్నాయి. ఆ శిథిలాలను తొలగిస్తూ పద్దెనిమిది నెలల పాపాయి దేహం కోసం గాలిస్తున్నాడు సుమీత్‌. భూకంపం వచ్చి అప్పటికి ఐదు రోజులు, ప్రాణం ఉన్న పాపాయి దొరుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఒక ఇనుప మంచం ఒక పక్కకి ఒరిగిపోయి ఉంది. ‘ఆ మంచం మీదే పాపాయి పడుకుంది’.. అని పెద్దగా అరిచాడు తండ్రి. మంచం కోడు ఒకటి భూమిలోకి కూరుకుపోయి ఉంది. మంచం కోడు కూరుకున్న చోట చిన్న సొరంగంలా ఉంది నేల పగులు. సుమీత్‌ ఆ సొరంగంలోకి చేతిని చాచి అందినంత మేర తాకి చూశాడు.

చేతికి చల్లగా తగిలింది. అది పాపాయి దేహమే. నాలుగు రోజులు జరిగిపోయాయి. దేహ భాగాలు ఊడి రాకుండా ఉండాలంటే అందిన భాగాన్ని పట్టుకుని లాగకూడదు, జాగ్రత్తగా వెలికి తీయాలి. ఇరవై ఏళ్ల సుమీత్‌ సన్నగా ఉన్నాడు, కాబట్టి సొరంగంలోకి దూరిపోయాడు. అప్పుడు మెల్లగా వినిపించింది పాపాయి దగ్గు. ఒక్కసారిగా భయకంపితుడయ్యాడతడు. నిజమేనా అని ఆశ్చర్యం. నిజం కాకపోతే అనుమానం. పాపాయిని చేతుల్లోకి తీసుకున్నాడు. దేహం చల్లగా ఉంది కానీ ప్రాణం ఉంది. తన గుండెల మీద పడుకోబెట్టుకుని దేహానికి వెచ్చదనం కోసం పాదాలు రుద్దాడు.

ఇప్పుడు బిడ్డతో పాటు బయటకు రావాలి. తానొక్కడైతే సొరంగంలో దూరగలిగాడు, కానీ పాపాయికి ఇబ్బంది కలగకుండా బయటకు రావాలంటే సాధ్యమయ్యేలా లేదు. పక్కనే మరొక సొరంగం తవ్వమని జవాన్లకు చెప్పి, పాపాయికి ప్రథమ చికిత్స చేస్తున్నాడు. పెద్ద సొరంగం తవ్వే లోపే చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది గుమిగూడిపోయారు.. మిరకిల్‌ బేబీని చూడడానికి. పాపాయిని ఛాతీకి ఆనించుకుని పైనున్న జవాన్లు అందించిన తాడు సాయంతో బయటకు వచ్చాడు సుమీత్‌. పాపాయిని తల్లికివ్వడానికి చేతుల్లోకి తీసుకునే లోపే ఆ దంపతులిద్దరూ అతడి పాదాల మీద పడిపోయారు.

డ్యూటీ అయిపోయింది
లాతూర్‌లో పరిస్థితులు మామూలయ్యాయి. శిథిలాల నుంచి పనికొచ్చే వస్తువులతో గుడిసెలు, పాకలు వేసుకుని జీవనం మొదలు పెట్టారంతా.  సుమీత్‌ బృందం కూడా ఆ ఊరు విడిచి వెళ్లి పోయింది. ఆ వెళ్లేటప్పుడు... పాపాయిని అతడి చేతుల్లో పెట్టి పేరు పెట్టమని అడిగారు ఆమె తల్లిదండ్రులు. ‘ప్రియ’ అన్నాడు సుమీత్‌ పాపాయిని ముద్దుపెట్టుకుంటూ. సుమీత్‌ అడ్రసు తీసుకున్నారు ప్రియ అమ్మానాన్న.

తర్వాత కొన్నేళ్ల పాటు ప్రియ క్షేమ సమాచారాలు ఉత్తరాలు రాసేవారు, ఫొటోలు కూడా పంపించేవారు. సుమీత్‌కి పెళ్లి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతల్లో రెండేళ్లకోసారి ట్రాన్స్‌ఫర్‌లతో ప్రియ అమ్మానాన్నలకు తన కొత్త అడ్రస్‌ ఇవ్వడం మర్చిపోయాడు. అలా ఉత్తరాలు ఆగిపోయాయి.  ప్రియ తరచూ గుర్తుకు వస్తోంది కానీ, అనేక పరిసర గ్రామాల్లో పనిచేయడంతో మన్‌గ్రుల్‌ పేరు మర్చిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్ల వరుసలో 2016లో పుణేకు వచ్చాడు సుమీత్‌ బాక్సి. ‘ప్రియది ఇదే రాష్ట్రం కదా! వాళ్ల కోసం ఓసారి ట్రయ్‌ చేయకూడదూ’ అని భార్య నీరా అనడంతో ఇప్పుడీ బంధం వెలుగులోకి వచ్చింది.

ఎలా దొరికింది?
ప్రియ వివరాల కోసం ప్రయత్నాలు ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నప్పుడు క్లర్క్‌ దయానంద్‌ గుర్తుకొచ్చాడు. అతడు మాటల మధ్య ఒకసారి తన సొంతూరు లాతూర్‌ దగ్గర ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పాడు. అతడిని పిలిచి ‘ప్రియ’ అని పేరు చెప్పగానే ‘భూకంపం నుంచి బతికి బయట పడిన అమ్మాయి కదా, మిరకిల్‌ బేబీ తెలియకపోవడం ఏమిటి’ అంటూ వెంటనే ఊళ్లో వాళ్లకు ఫోన్‌లు చేసి ప్రియ ఫోన్‌ నంబరు సంపాదించాడు. మొదట తాను ప్రియతో మాట్లాడి సుమీత్‌ బాక్సి మాట్లాడతాడని చెప్పగానే ప్రియ ఉద్వేగానికి లోనయింది. ఆ ‘తండ్రీకూతుళ్లు’ ఉద్వేగంతో మాట్లాడుకున్న ఫోన్‌ కాల్‌ అదే.

ప్రియ ఆచూకీ అంత సులభంగా దొరుకుతుందని ఊహించనేలేదంటాడు సుమీత్‌. ఆమె ఇప్పుడా గ్రామంలో స్కూల్‌ టీచర్‌. ‘దేశం కోసం డ్యూటీ చేసిన జవాను నాకు పునర్జన్మ ఇచ్చాడు. నా పునర్జన్మ ఊరికి సేవ చేయడానికే. ఊరందరినీ విద్యావంతుల్ని చేయడమే నా లక్ష్యం. అందుకే పుట్టిన ఊర్లోనే టీచర్‌గా చేస్తున్నాను’ అని ప్రియ చెప్పడంతో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు సుమీత్‌.

బంధం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఆత్మీయతను పంచుతూనే ఉంటుంది. మనుషులు దూరంగా ఉన్నా, మనసులను దగ్గరగా ఉంచుతుంది. సుమీత్‌ బాక్సి – ప్రియలది అలాంటి బంధమే. ఈ తండ్రీబిడ్డల బంధానికి కదిలిపోయిన ఓ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రొఫెసర్‌ ఈ సంఘటనలను రంగుల కుంచెలతో చిత్రించాడు.

– మంజీర

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా