లడ్డూ కావాలా నాయనా...?

18 Sep, 2013 15:05 IST|Sakshi
లడ్డూ కావాలా నాయనా...?

బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ఈ ఏడాది కూడా దుమ్ము దులిపింది. ఏకంగా  తొమ్మిదిన్నర లక్షల రూపాయల వరకూ ధర పలికిన గణేశ్‌ లడ్డూ.. గత రికార్డులను బద్దలు చేసింది. బాలాపూర్ అంటే చాలు వినాయకుడు, లడ్డు ప్రసాదం గుర్తుకు వస్తాయి. బాలాపూర్ లడ్డూ వేలం రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈసారి రూ.9.26 లక్షల రూపాయల ధర పలికిన గణేశ్‌ లడ్డూ.. గత రికార్డులు తిరగరాసింది.  గత ఏడాది  రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం.

బుధవారం ఉదయం హోరాహోరీగా సాగిన వేలంపాటలో టీకేఆర్ విద్యాసంస్థలు రూ.9 లక్షల 26వేలకు గణనాధుని లడ్డూని సొంతం చేసుకుంది. ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లడ్డూ లక్షల రూపాయలకు చేరుకుంది. లడ్డూను సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది కొలను బాల్రెడ్డి 21వేల రూపాయలతో వేలం ప్రారంభించారు. 1994లో తొలిసారి నిర్వహించిన వేలంలో బాలాపూర్‌ లడ్డూ 450 రూపాయలు పలికింది. అప్పటి నుంచి ఏటా లడ్డూ డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాటలో దూసుకుపోయింది. లంబోదరుడి లడ్డూ వేలం ఈసారి మొత్తం రికార్డులు బ్రేక్ అయ్యాయి.

లంబోదరుడి లడ్డూ ప్రసాదం సొంతం చేసుకోవడం సంతోషకరంగా ఉందని టీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా 1994లో లడ్డూ వేలం వేయగా స్థానికుడైన రైతు కొలను మోహన్ రెడ్డి రూ.450లకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి కొలను కుటుంబ సభ్యులు ఆరుసార్లు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రాముఖ్యత పెరుగటంతో బాలాపుర్ గణేషుడి లడ్డూకు పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలో లడ్డూ ధర ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ పోయింది. ఈ లడ్డూ వేలంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా వేలంపాటలో పాల్గొంటారు. అయితే 33 ఏళ్ల నుంచి బాలాపూర్‌లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించినప్పటికీ ఇంత స్థాయిలో ధర పలకడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బాలాపూర్‌ లడ్డూను గెల్చుకోవడాన్ని స్థానికులు శుభప్రదంగా భావిస్తారు. లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం వల్ల బాధలు పోతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లడ్డూను పొలంలో చల్లుకుంటే అధిక దిగుబడులు వస్తాయని, బావిలో వేస్తే నీళ్ళు ఎండిపోకుండా ఉంటాయని, వ్యాపారాలు సాఫీగా సాగుతాయని నమ్మకం. గణేష్‌ విగ్రహం గ్రామంలో ఉన్నంతవరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసం ముట్టరు. అంతే కాకుండా లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు. ప్రతి ఏడాది లడ్డూ వేలం ధర పెరుగుతున్నా... లడ్డూ ధర కాస్ట్లీగా మారినా ... సొంతం చేసుకునేందుకు భక్తులు  వెనకాడకపోవటం విశేషం.
 

>
మరిన్ని వార్తలు