బంజారా భగవద్గీత

18 Oct, 2014 00:48 IST|Sakshi
బంజారా భగవద్గీత

హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత.. ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమైంది. అయితే బంజారాలకు మాత్రం ఇది చేరలేదు. వారికి గీతాసారాన్ని అందించాలనుకున్నారు కేతావత్ సోమ్లాల్. తన జాతి జాగృతి కోసం మొక్కవోని సంకల్పంతో పదహారు నెలల పాటు అవిశ్రాంత కృషితో భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలచి వారికి ‘గీతోపదేశం’ చేశారు.
 
 నల్లగొండ జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన సోమ్లాల్ నంద్యాలలోని ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఈయన బంజారా జాతి జాగృతం కోసం కంకణం కట్టుకున్నారు. వారిని చైతన్యపరుస్తూ 200కు పైగా పాటలు రాశారు. తండా తండాకు తిరిగి ఆ పాటలు పాడుతూ బంజారాలను ఉత్తేజితుల్ని చేశారు.
 
 రాత మార్చింది...
 జీవితంలోని మంచి చెడుల్ని భగవద్గీత బోధించింది. ఆ బోధనల్ని బంజారాల దరి చేర్చాలన్న ఆశయంతో గీత రచన చేశానంటారు సోమ్లాల్. అనువాదానికి ముందు ఎన్నో పరిశోధనలు చేశారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి ఔపోసన పట్టారు. 8-8-1988 రోజు భగవద్గీత అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలల కృషితో పూర్తి చేశారు. పండిత రంజకంగా ఉన్న గీతను అందరి దరి చేర్చడానికి సోమ్లాల్ అవిశ్రాంతంగా పని చేశారు. మల్లెమొగ్గ అనే పదాన్ని అనువదించడం కోసం తిరగని తండా లేదు. చివరకు మల్లెమొగ్గను బంజారా భాషలో ‘పుముడా’ అంటారని తెలుసుకుని.. ఆ పదాన్ని గీతలో చేర్చారు. ఇలా ఎన్నో పదాల్ని జనపదంగా మార్చి.. వాక్యంలో కూర్చి బంజారా గీతను తీర్చిదిద్దారు.
 
ప్రేరణ...
 సోమ్లాల్‌కు ఆరుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. పేదరికం కమ్మేసినా.. తాత, మేనమామ ప్రోత్సాహంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగించారు. ‘నేను పదో తరగతి చదివే సమయంలో జనగాంలోని హాస్టల్‌లో ఉండేవాణ్ని. పక్కనే గీతామందిరం ఉండేది. అక్కడి నుంచి రోజూ ఉదయం లౌడ్‌స్పీకర్‌లో వినిపించే గీతను వినేవాణ్ని. అప్పటి నుంచే గీతపై అభిమానం ఏర్పడింది. అన్నివిధాలా వెనుకబడిన తన జాతి ప్రజలకూ గీతాసారాన్ని అందజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నా’నని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు సోమ్లాల్.
 
 పాతికేళ్ల తర్వాత...
 భగవద్గీత అనువాదం 1989 నాటికే పూర్తయినా అది అచ్చవ్వడానికి సోమ్లాల్ 25 ఏళ్లు నిరీక్షించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత బంజారా భగవద్గీతను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ ద త్తు, జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్ ఆవిష్కరించారు. ద హిస్టరీ ఆఫ్ బంజారా, భారత్ బంజారా గీతమాల, తొలి వెలుగు వంటి రచనలు చేసిన సోమ్లాల్.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెబుతున్నారు.
 - కంచుకట్ల శ్రీనివాస్

మరిన్ని వార్తలు