బౌద్ధంపై సదా యుద్ధమే!

10 Jul, 2013 16:12 IST|Sakshi
బౌద్ధంపై సదా యుద్ధమే!
విశ్లేషణ
 
 ‘‘బుద్ధ దేవుని భూమిలో పుట్టి నావు / సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? / అందము ను హత్యచేసెడి హంతకుండ / మైలపడిపోయెనోయి, నీ మనుజ జన్మ’’!
 - కరుణశ్రీ
 
 మన దేశంలో ఒకడు మసీదు ను కూల్చడం కోసం ‘రథయా త్ర’ తలపెడతాడు; మరొకడు గుడినో దేవళాన్నో ధ్వంసం చేయడం కోసం రహస్య ‘పథయాత్ర’ మొదలుపెడతాడు, ఇంకొకడు మరో మతంవారి చర్చిని పడగొట్టడానికి ఇంకో యాత్రకు తెరలేపుతాడు! ప్రతిచోటా ఒక్కో దుష్టశక్తి! అయితే ఈ పెడబుద్ధులన్నింటికీ మూలాలు మనిషిని మరి చిపోయి అతని పేరిట ‘ధర్మం’ అనే మాటను మార్చి ‘మతం’ అనే పదాన్ని చేర్చి అతని చుట్టూ కొన్ని రాజకీయ పక్షాలు ఓటు బ్యాంకును సృష్టించుకునే తపనలో గూడు కట్టుకుని ఉన్నాయి. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత, ఆ పిమ్మట 2002లో గుజరాత్‌లో 2 వేల మంది మైనారిటీల ఊచకోత, ఆ పిమ్మట ముంబై ఘటనలు, హైదరాబాద్‌లో మసీదు దుర్ఘటనలు, ఆ వెనక దిల్‌సుఖ్‌నగర్‌లో అరాచక సంఘటనలు... పర్యవసానంగా అనేక మంది అమాయ కుల నిండు ప్రాణాలు బలి! 
 
 ఈ అన్ని ఘట్టాలలోనూ దొరికితే పట్టుకుని,  విచారిం చి శిక్షిస్తామని గూఢచార, నిఘా సంస్థలు, పోలీసు వర్గాలు చెప్పడమో, లేదా ఫలానా మత సంస్థకు ఇందులో పాత్ర ఉందని భావిస్తున్నామనో, లేదా ఆ ఫలానా సంస్థ ఉగ్ర వాద చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నెల రోజుల నాడు తాము హెచ్చరించినా స్థానిక అధికార వర్గాలు అప్రమత్తం కాలేదనో ప్రకటించి కాలక్షేపం చేయడం మన అధికార గణానికి అలవాటైన దుర్లక్షణం. ఇది నిజం కాక పోతే, శాంతి సందేశం ద్వారా ప్రపంచమతాలన్నింటినీ అమితంగా ప్రభావితంచేసి కీర్తిగడించిన గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బుద్ధ గయలోని బౌద్ధాలయాన్ని ధ్వంసం చేయడానికి నడుంకట్టిన దుర్మార్గులెవరో కని పెట్టడం కష్టమైన పనికాదు. ఎందుకంటే, బుద్ధగయలో బౌద్ధ ఆలయంపై దాడి జరిగే ప్రమాదం ఉందని, ఆ దాడికి ‘ఇండియన్ ముజాహిదీన్’ సంస్థ సన్నాహాలు చేస్తోందని ఇంతకుముందే తాము తెలిపామని నిఘా సంస్థలు చెప్పినప్పుడు ఆ సంస్థ తాలూకు ఉగ్రవాదులను మందుగానే ఎందుకు పట్టుకోలేకపోయారు? 
 
 కానీ అలాంటి హెచ్చరిక ఏదీ తమకు అందలేదని బీహార్ ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ ప్రకటించడం మరొక విచిత్ర సన్నివేశం! బుద్ధగయ రక్షణ కోసం తాను లేఖ రాసినా కేంద్రం బలగాలను పంపలేదని నితీష్ అంటు న్నారు. ‘ఇండియన్ ముజాహిదీన్’ పేరు గల సంస్థ ఇండి యాలో లేదని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముస్లిం పెద్దలు కొందరు పత్రికాముఖంగా చెప్పడం గమనార్హం. అంతేకాదు, అడుగడుగునా ప్రతీ సంఘటనను ఎన్నిక లకు, ఓట్లకు, సీట్లకూ ముడిపెట్టి పదవీ రాజకీయ ప్రయో జనాలు నెరవేర్చుకోజూస్తున్న కొన్ని రాజకీయపక్షాలు, మత రాజకీయపక్షాలూ ప్రజల మధ్య అశాంతికి కారణమ వుతున్నందునే నిఘా సంస్థలు దోషిని పట్టుకోలేకపో తున్నాయి. ఎన్నికలు సమీపించే ప్రతిసారీ ఏదో ఒక రూపంలో మత ప్రయోజనాలకు నారు పోసి నీరు పెట్టడం ఆనవాయితీగా మారింది. 
 
 బుద్ధగయలో సంభవించిన దుర్ఘటనలో ‘రాజకీ యాలు’ చోటు చేసుకోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ బీజేపీతో ఇటీవల తెగతెంపులు చేసుకున్న కారణంగా, గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ బుద్ధగయ సంఘటనకు నితీష్‌ను బాధ్యుడిని చేయాలని చూస్తున్నాడు. నితీష్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్‌ను బీజేపీ వర్గాల ద్వారా ముందుకు తెస్తున్నాడు. అఫ్ఘానిస్థాన్‌లోని బుమియాన్ లోని భారీ బుద్ధవిగ్రహాన్ని తాలిబన్లు ధ్వంసం చేసినట్టుగా ఇండియాలో ధ్వంసం చేస్తే ఒప్పుకునేది లేదని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చెప్పడం శుభపరిణామం. 
 
 ‘భారతదేశం బుద్ధభూమి, కనుక ఇక్కడ బుమియాన్ దుర్ఘటన పునరావృతం కానివ్వ’మని సుష్మా చెప్పనైతే చెప్పారు గాని, బౌద్ధ ధర్మాన్ని దేశ సరిహద్దులు దాటించి మనదేశం ఆత్మహత్య చేసుకోవడానికి కారకులెవరో కూడా చెప్పి ఉంటే అసలు సంగతి ప్రజలకు బాగా బోధపడి ఉండేది! బౌద్ధంపైన, బుద్ధుడిపైన దాడిచేసిన వారు ఒక్క బుమియాన్ అన్యమత ఉగ్రవాదులే కాదు, నేడు ఏ ‘హిం దూత్వ’ నినాదం చాటున అయోధ్య అల్లర్లకు, గుజరాత్ ఊచకోతలకు కారకులయ్యారో వారి తాలూకూ మత రాజ కీయాలే గతంలో బౌద్ధం దేశ సరిహద్దులు దాటిపోవడా నికి కారణమయ్యాయి. యజ్ఞయాగాదులను, హింసనూ బౌద్ధం ఏ నాడు నిరసించి అడ్డు నిలిచిందో, ఆ జంతుబ లుల ద్వారా తమ కుల ఉపాధిని కాపాడుకోజూసిన వర్గా లు బౌద్ధంపైన, బుద్ధబోధలపైన విరుచుకుపడ్డాయి. విధ్వంసం సృష్టించాయి. అందుకనే ఆది హైందవమే అసలు బౌద్ధ ధర్మం.
 
 బుద్ధుడు వృత్తుల మీద, కాయకష్టం మీద ఆధార పడిన సమాజాన్ని నిర్మించాడే తప్ప, కులవ్యవస్థను నిర్మిం చి వృత్తులను కులాల కింద దిగజార్చలేదు. ఈ ధర్మచిం తన నచ్చని వర్గాలు బౌద్ధంపై కత్తికట్టాయి. అదేమంటే, బుద్ధుడిని హైందవ దేవుళ్లలో పదో అవతారంగా మార్చి ఏ విగ్రహారాధనను బుద్ధుడు నిరసించి, నిషేధించాడో ఆ విగ్రహారాధనకే తెరలేపారు! ఎవరికి వారు తమ బుద్దిని నమ్ముకోవాలనీ, ధర్మాన్ని మాత్రమే ఆరాధించాలని, చివ రికి తాను చెప్పినా సరే ప్రశ్నించకుండా ఆమోదించరాదనే ఆయన బోధలకు క్రమంగా చెదలు పట్టించారు! ఈ చెదలు ఎంతవరకు వ్యాపించిందంటే క్రమంగా అనేక సంవత్సరాల తర్వాత అనంతర హైందవ ప్రభావంతో ధేరవాదులని, మహా సాంఘికులనీ రెండు పక్షాలుగా చీలిపోయారు! 
 
 ప్రపంచమూ, సమాజమూ పరిణామశీలమైనదనే బుద్ధుని ప్రబోధం చీలికల మూలంగా చివికిపోయింది. కాని ఆది హైందవమైన ఆది బౌద్ధం మానవాళికి శాశ్వత ధర్మాలైన ‘పంచశీల’ సూత్రాలకు ఈ నాటికీ కట్టుబడే ఉంది. హీనయానమే ఆది బౌద్ధం. వికృతరూపం తొడిగిం ది మహాయానం. ధేరవాదులు కుల, ఆచార సంప్రదా యాలకు కట్టుబడిపోగా, మహా సాంఘికులు లోకోపకార చర్యలకు ప్రాధాన్యమిచ్చారు. యావత్తు భారతంలో బౌద్ధ ధర్మానికి మన రాష్ట్రం ఆ నాడు కేంద్రస్థానమై ఏడుగడగా నిలిచింది! ఒకానొక దశలో వీరశైవం, వీరవైష్ణవ మతాలు బౌద్ధంపై వీరంగం వేయడమే గాదు, ఆర్య నాగార్జునిడిపై హత్యకు పాల్పడ్డాయి. యజ్ఞయాగాదులపై ఆధారపడి హింసను నమ్ముకున్న వర్గానికి బౌద్ధ విజ్ఞానవాదం నచ్చ లేదు. కనుకనే సుప్రసిద్ధ పండితుడు తిరుమల రామ చంద్ర అన్నట్టు బౌద్ధారామాలను, చైత్యాలను ‘లంజల దిబ్బలు’గా చిత్రించిన వాళ్లు బౌద్ధ, జైన సాహిత్యాన్ని కూడా హెచ్చు భాగం ధ్వంసం చేయకుండా ఉంటారని ఎలా నమ్మగలమని ప్రశ్నించాడు! 
 
 అలాగే, మౌర్యుల తరువాత మగధను ఏలిన  శుంగ వంశీయులు, కణ్వ వంశీయులు బౌద్ధులను హింసించడం వల్ల ధేరవాద బౌద్ధులు సింహళం, గాంధారాలకు వలస పోగా, మహాసాంఘికులు తెలుగుదేశానికి వచ్చి స్థిరపడాల్సివచ్చింది. మహాయానం వచ్చి బుద్ధుడిని భగవంతుడిని చేసి, అతనికి లోకోత్తరశక్తుల్ని ఆపాదిం చడంతో ‘బుద్ధపురాణం’ వెలసి ఉండవచ్చుగాని, మహా యానం కారణంగా బౌద్ధంలో కళలకు చోటు దొరికింది. మల్లంపల్లి వారన్నట్టు బౌద్ధం తెలుగుజాతిని కాంతివం తం చేసింది, తెలుగు శిల్పకృతులలో అమృతం చిలికింది! ఏది ఏమైనప్పటికీ, మౌలికంగా ఇటు ఆది హైందవానిది, అటు ఇస్లామ్ ధర్మానిది, బౌద్ధ ధర్మానిదీ అమూర్త (విగ్ర హరూపంలో లేని) సంప్రదాయమేగాని ‘మూర్త’ సంప్రదా యం కాదని పండితుల నిర్ధారణ. అయితే మరి మధ్యలో మనకు నడమంత్రపు బుద్ధులు ఎలా వచ్చాయనే ప్రశ్నకు రాహుల్ సాంకృత్యాయన్ ఇలా సమాధానం చెప్పాడు.
 
 ‘‘మానవుడి మానసిక క్షేత్రంలో అజ్ఞాన రాజ్యమూ ఉంది, జ్ఞాన రాజ్యమూ ఉంది. అజ్ఞాన రాజ్యం అధికమై నప్పుడు... మతానికీ దేవుడికీ ఎక్కువ స్థానం లభిస్తుంది. అజ్ఞానరాజ్య ప్రాంతాలను జ్ఞానం లాగేసుకుని తనవిగా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు... దేవుడూ, మత మూ గొప్ప ప్రమాదానికి గురికావలసి వస్తుంది. ఆ ప్రమా దం నుంచి దేవుడిని, మతాన్నీ కాపాడటానికే ప్రధానంగా ‘దర్శనం’ అనేది పుట్టుకు వచ్చింది! ఈ ‘దర్శనం’ చేసే ముఖ్యమైన పనేమిటి? కండ్లల్లో దుమ్ముకొట్టి ప్రజల్ని గుడ్డివాళ్లను చేయడం... అర్థానికీ (డబ్బుకీ), ప్రాణానికీ... రెండింటికీ ప్రమాదం సంభవించినప్పుడు, బుద్ధిగలవాళ్లు అర్థాన్ని వదులుకుని ప్రాణాన్ని రక్షించుకుంటారు! మాన వుడి బుద్ధికి అందని మాటలు చెప్పి, దేవుణ్ణి, మతాన్ని, ఆచారాలను దొడ్దిదారిన తెచ్చి ప్రజలనెత్తికి చుట్టారు. ఇలా ప్రతి ఒక్కడూ మానవ బుద్ధిని భ్రమింపజేసి, దేవుడికీ, మతానికీ, ఆత్మకూ పట్టం కట్టి... ఆర్థిక దోపిడీ, సామాజిక అసమానతలూ సజావుగా సాగిపోవటానికి రాచబాట వేశారు’’! అందుకే అన్ని వైపుల నుంచీ ఈ పిదపబుద్ధులు తలెత్తడం!
 
 -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
 
Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా