తమిళనాట కరోడ్‌పతి..యూపీలో బెగ్గర్‌

21 Dec, 2017 14:18 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డుపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంటే అదే ఆధార్‌ ద్వారా తమిళనాడులో కోటీశ్వరుడైన ఓ వ్యక్తి యూపీలో యాచకుడిగా దీనస్థితిలో ఉన్న విషయం వెల్లడైంది.యూపీలోని రాయ్‌బరేలి జిల్లా రాల్పూర్‌ పట్టణంలో వృద్ధుడి వద్ద ఆధార్‌ కార్డు, కోటి రూపాయల పైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలున్నట్టు కనుగొన్నారు. స్వామి భాస్కర్‌ స్వరూప్‌జీ ఆశ్రమ పాఠశాల వద్ద యాచకుడిగా తిరుగుతున్న వ్యక్తిని స్వామి చేరదీసిన క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యాచకుడికి స్నానం చేయిస్తుండగా ఆయన దుస్తుల్లో ఆధార్‌ కార్డు, రూ కోటికి పైగా ఎఫ్‌డీ పత్రాలు లభించాయి.

ఆధార్‌లో పొందుపరిచిన వివరాలతో ఆరా తీయగా ఆ యాచకుడు తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంపన్న వ్యాపారవేత్త ముత్తయ్యనాడార్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.తండ్రిని తీసుకునివెళ్లేందుకు తమిళనాడు నుంచి ఆయన కుమార్తె గీత రాల్పూర్‌కు వచ్చారు.

తన తండ్రికి ఆశ్రయమిచ్చిన స్వామీజీకి, ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఓ రైలు ప్రయాణంలో తప్పిపోయిన తమ తం‍డ్రి కోసం ఆరు నెలలుగా గాలిస్తున్నామని ఆమె చెప్పారు. తమ తండ్రికి బలవంతంగా మత్తుపదార్ధాలు ఎక్కించడంతో ఆయన దారితప్పి ఉంటారని భావిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు