నాకు నువ్వు.. నీకు నేను..

3 Oct, 2014 01:16 IST|Sakshi
నాకు నువ్వు.. నీకు నేను..

 "Marriage is not a noun,
 it's a verb..
 it isn't something you get..
 it's something you do!
 it's the way you love
 your partner every day"

 అంటుంది బార్బరా డి ఏంజిఏంజిల్స్! పెళ్లి గురించి ఈ జంట అభిప్రాయం కూడా ఇంచుమించు ఇదే. ‘నాకు నువ్వు.. నీకు నేను అంటూ కలసి సాగడమే జీవితం’ అని అంటున్నారు. భర్త పేరు వెంకట్ సిద్ధారెడ్డి.. రైటర్, సినిమా ఎడిటర్, ఫిల్మ్‌మేకర్. కేస్ నంబర్ 666 ఆయనకు మంచి పేరు తెచ్చింది. ‘దృశ్యం’ సినిమాకూ వెంకట్  ఓ అదృశ్యశక్తి. ఆయన భార్య పేరు రంజనీ శివకుమార్.. శాస్త్రీయ సంగీతరాజ్ఞి. మంచి రైటర్ కూడా అని కితాబిస్తాడు వాళ్లాయన వెంకట్. ‘కళ’ అనే ఒక్క కామన్ హాబీ తప్ప ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధ్రువాలే! పాషన్ ఫర్ ఆర్ట్ అనే ఆ ఒక్క పోలీకే ఈ ఇద్దరికీ నూరేళ్ల బంధాన్ని ముడి వేసింది!
- వెంకట్ సిద్ధారెడ్డి, రంజనీ శివకుమార్
 
వ్యత్యాసాలు.. సామ్యాలు..
‘ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరి ఫీల్డ్సే ఏమాత్రం సంబంధం లేనివి. అదే పెద్ద డిఫరెన్స్. నేను ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయను. కానీ తను ఎక్స్‌ప్రెసివ్. పెర్‌ఫార్మెన్స్ కంటే పర్‌ఫెక్షన్ ముఖ్యమనే తపన తనది. కళ కామన్‌మ్యాన్‌కి అర్థమయ్యేలా ఉండాలంటాను నేను’ అని వెంకట్ తమ మధ్య ఉన్న బేధాలను చెప్తుంటే ‘నేను పాడే శాస్త్రీయ సంగీతం సామాన్యులకు కూడా అర్థం కావాలి అంటాడాయన. మోహనం లాంటి రాగాలంటే ఇష్టపడతాడు. అందుకే ఇది పాపులారిటీ వర్సెస్ ప్రిన్స్‌పుల్స్ అంటాన్నేను’ అని వ్యత్యాసాలకు ముగింపు పలికింది రంజని
 
 గోల్ కన్నా జర్నీ ముఖ్యం..
 ‘రంజనీ మ్యూజిక్ కెరీర్‌కి చెన్నై బెస్ట్ ప్లేస్. అక్కడున్నంత స్కోప్ ఇక్కడ ఉండదు. అందుకే తను దాదాపు ఆర్నెల్లు చెన్నైలో ఉంటే ఆర్నెల్లు ఇక్కడుంటుంది. అయితే ఆ డిస్టెన్స్ నన్నెప్పుడూ హర్ట్ చేయదు’ అని వెంకట్ అంటుంటే ‘ఆ దూరాన్ని నేనూ ఫీలవ్వనివ్వను’ అని కాన్ఫిడెంట్‌గా సమర్థించుకుంది రంజని. ‘భౌతికంగా దూరంగా ఉన్నా మా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఇద్దరిని కలిపే ఉంచుతుంది. ఆ దూరాన్ని ఇద్దరం ఆస్వాదిస్తాం. తన గురించి ఆలోచన వచ్చిన మరుక్షణంలో మెసేజ్ పెట్టేస్తాను. ఆయన చెప్పినట్టు.. మా ఇద్దరి దారులు వేరైనా.. కలసి నడవడానికి ఒక్కటయ్యాం. ఆ నడకలో మా అడుగులెన్నడూ తడబడలేవు. మాకు మా లక్ష్యం కన్నా మేమిద్దరం కలసి నడిచే జర్నీయే ముఖ్యమని’ చెబుతుంది రంజని.
 
 చిన్న చిన్న ఆనందాలు..
 ‘మాకు పెద్ద కలలు.. ఆశయాలు లేవు. చిన్నచిన్న ఆనందాలకే మా ఇంపార్టెన్స్ అంతా. కలసి మార్నింగ్ వాక్ చేయడం..కాఫీ తాగడం.. ఓ సినిమా చూడటం..! అంతే’ అంటారు రంజని. ‘సినిమా కథకు రంజని ఓ మంచి ఐడియా ఇవ్వడం నాకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. అరే ఈ ఆలోచన నాకెందుకు రాలేదని ఓ క్షణం అపించినా.. ఆ ఐడియానిచ్చింది నా జీవిత భాగస్వామి అయినందుకు గర్వంగా అనిపిస్తుంది. నా సినిమాలో తనతో పాడించుకోవాలి.. మ్యూజిక్ చేయించుకోవాలి.. ఇవీ నాకు అమూల్యమైన ఆనందాలే’ అంటాడు  వెంకట్.
 
 కొసమెరుపు
 ఏ టీసీఎస్ ఇద్దరినీ పరిచయం చేసిందో పెళ్లయిన వెంటనే ఆ టీసీఎస్‌కు గుడ్ బై చెప్పి ఎవరి కళను వాళ్లు ఆస్వాదించడంలో బిజీ అయిపోయారు వెంకట్, రంజని. ‘మేము ఎంచుకున్న ఈ రెండు కళలు అంత సర్టెనిటీ ఉన్నవి కావు. విజయం సాధించనూ వచ్చు లేకపోనూ వచ్చు అయినా కలిసే ఉంటాం. చెప్పాంగా మేమిద్దరం కలసి ప్రయాణించడమే మాక్కావాలి. ఈ ప్రయాణంలో ఎవరి స్పేస్ వారిదే.. ఎవరి ప్రాధాన్యం వారిదే. ఒకరిలో ఒకరం పాజిటివే చూస్తాం.. నెగటివ్‌ని ఇగ్నోర్ చేస్తాం. అదే మా అనుబంధం సీక్రెట్’ అంటారిద్దరూ!
 
 కలిపిన కళ
వెంకట్, రంజనీలు ఒకప్పుడు టీసీఎస్ ఉద్యోగులు. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేసినా ఆయనదో ఫ్లోర్.. ఆమెదో ఫ్లోర్. ఇద్దరికీ ముఖపరిచయం మాత్రమే ఉంది. రంజనీ మ్యూజిక్‌కి సంబంధించి ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకొని ప్రొఫెషనల్స్ కోసం వెదుకుతున్న సమయంలో దిలీప్ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వెంకట్ గురించి తెలుసుకుంది. అపార్ట్ ఫ్రమ్ జాబ్ ఆయనకు సినిమా ప్రాణం. సినిమాకు సంబంధించిన చాలా క్రాఫ్ట్స్‌లో అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ఈ మెరిట్స్ అన్నీ  రంజనీని మురిపించాయి.
 
 రంజనీ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకోవడం, సంగీతం అంటే ఆమె గొంతు సవరించుకోవడం.. ఇవన్నీ వెంకట్‌ను కూడా ఆమె గురించి ఆలోచించేలా చేశాయి. అందుకే షార్ట్‌ఫిల్మ్ సైడ్ అయిపోయి ఇద్దరూ ఒక్కటయ్యారు. తమ బంధం కళాబంధమవుతుందని కలలుకన్నారు. అనుకున్నట్టుగానే పెళ్లీ అయింది కళాబంధంగా, ముడిపడి తీయని అనుబంధంగా దృఢపడింది.
 -  శరాది

మరిన్ని వార్తలు