బుక్ ఆర్‌‌ట

29 May, 2015 01:06 IST|Sakshi
బుక్ ఆర్‌‌ట

రబ్బర్ స్టాంప్, ప్రింట్, టెక్ట్స్ బుక్స్ వంటివి ఆమె చేతిలో పడితే కళా రూపాలుగా మారిపోతాయి. ఇండియాలో అంతగా ప్రాచుర్యంలో లేని ఈ సరికొత్త కళల్లో ఆమె అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె పేరు మాలిని గుప్తా. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా.. ఉండేది మాత్రం అమెరికాలో. తన కళారూపాలను ‘ఎక్స్‌పోజ్ యువర్ సెల్ఫ్ టు ఆర్ట్’ పేరుతో కళాకృతి గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారామె. ఈ సందర్భంగా మాలిని గుప్తాతో ‘సాక్షి’ చిట్‌చాట...
 
ఇక్కడి ఏర్పాట్లు..
మన దేశంలో కళలంటే ఆదరణ చాలా తక్కువ. టైం, డబ్బు వృథా అనే ఆలోచన ఉంది. ఇందుకు భిన్నంగా గ్యాలరీలు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే వీలు, మీడియాలో కథనాలు రావటం చూస్తుంటే కళాకారులకు సంబంధించినంత వరకు చాలా మార్పులు వచ్చాయని అనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు చాలా మారింది. అప్పట్లో కళాకారుల కోసం గ్యాలరీలు లేవు.
 
మై హోమ్‌టౌన్..

నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. 2002లో యూఎస్‌కి వెళ్లాను. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను. అక్కడికి వెళ్లాక బీఎఫ్‌ఏ చేశాను. నా సొంత సిటీ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. యూఎస్, యూకే దేశాల్లోని ఎన్ని సిటీల్లో ప్రదర్శనలు ఇచ్చినా హోమ్‌టౌన్‌లో ప్రదర్శన ఇవ్వటం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సిటీలో మళ్లీ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను.
 
అమెరికా నుంచి సిటీకి..
అమెరికాలోని నార్త్ పసిఫిక్ ఆర్ట్ కాలేజ్‌లో నేర్చుకున్నా. నా థీసిస్ సబ్జెక్ట్ ఆర్టిస్ట్ పుస్తకం. బైండ్ చేయడం, ప్రింట్ చేయడం అందులో భాగం. ఇక అప్పటి నుంచి పుస్తకం, అక్షరాలతో నా చెలిమి మరింత ఎక్కువైంది. నా థీసిస్‌కి అక్కడ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత నేను ఒరెగన్ ఆర్ట్ కాలేజ్‌లో బుక్ ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక కళాకారిణిని. గ్రాఫిక్ డిజైనర్‌ని. నాకు సంబంధించి ఇవన్నీ కలిసింది బుక్ ఆర్ట్. దీంట్లో గ్రాఫిక్ డిజైన్, క్రాఫ్ట్, ఆర్ట్ అన్నీ ఉంటాయి. న్యూయార్క్, జర్మనీలో నిర్వహించిన పోటీల్లో నేను చేసిన పోస్టర్‌కి అంతర్జాతీయ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ నా థీసిస్‌కి వచ్చిన అవార్డ్ నాకు చాలా స్పెషల్.

మరిన్ని వార్తలు