బస్ స్టాప్ -సీనియర్ సిటిజన్స్ అడ్డా

17 Mar, 2015 23:19 IST|Sakshi
బస్ స్టాప్ -సీనియర్ సిటిజన్స్ అడ్డా

ఇక్కడ బస్టాపు దగ్గర కూర్చుని ఉన్న పెద్దల్ని చూస్తే... అందరూ ఏదో ఊరికి పయనమయ్యారనిపిస్తుంది కదా! అయితే మీరుపొరబడ్డట్టే! ఇంట్లో టీ, టిఫిన్స్ ముగించుకుని మనవళ్లు, మనవరాళ్లను స్కూళ్ల బస్సులెక్కించి... అంతే వీరు కూడా నాలుగడుగులేసి వీధిలోకి వచ్చేస్తారు. ఇలా బస్టాపులో ఓ రెండు మూడు గంటలు కూర్చుని మళ్లీ ఇంటికి పయనమవుతారు. సాయంత్రం నాలుగింటికి మళ్లీ ఇదే బస్టాప్‌కి చేరుకుంటారు. మళ్లీ భోజనాల వేళకు ఇళ్లకు మళ్లుతారు. ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీగా అందిరికీ తెలిసిన వసంతనగర్ కాలనీ బస్టాపునే అడ్డాగా చేసుకున్న ఈ సీనియర్ సిటిజన్స్‌ని పలకరిస్తే... మీకూ అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది.
 ..:: భువనేశ్వరి
 
 సమయం... ఉదయం 11 గంటలు. ఓ నలుగురు పెద్దవాళ్లు ‘మాకు తినే వేళయింది’ అంటూ లేచారు. మిగతావాళ్లు ఎవరి కబుర్లలో వారు మునిగిపోయారు. ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘తాత సికింద్రాబాద్ బస్సు వెళ్లిపోయిందా?’ అని అడిగింది. ‘అయ్యో... ఇప్పుడు పోయింది తల్లీ...’ అన్నాడు నిట్టూర్పుగా ఓ పెద్దాయన. ‘ఉండు తల్లీ... రెండో బస్సు వచ్చే వేళయింది...ఆడ కూసో’ అన్నాడు ఆప్యాయంగా. కొందరు రాష్ట్ర రాజకీయాల గురించి.. ఇంకొందరు రాబోయే ఎండలపై మాట్లాడుతున్నారు.

అందరికన్నా వయసులో పెద్దగా అనిపించినవ్యక్తి దగ్గరికి వెళ్లి... ‘మీరు రోజూ ఇక్కడే కూర్చుంటారా?’ అని అడిగితే... ‘ఈ రోజు... ఆ రోజు అని ఏముండదు. ఒక్క ఆదివారం తప్ప.. అన్ని రోజుల్లో మాకు ఈ బస్టాపే కాలక్షేపం. ఓ యాభైమందిమి ఉంటాం. ఉదయం తొమ్మిది, పది దాటిందంటే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. తోచిన కబుర్లు, కాలనీ విశేషాలు, రాబోయే పండుగలు, ఇంట్లో చేసుకునే వేడుకలు, రోడ్డుపైన జరిగే గొడవలు... ఇలా ఒకటేమిటీ.. అన్నీ మాట్లాడుకుంటాం. రెండు, మూడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి’అని చెప్పారు విశ్రాంత ఉద్యోగి అయిన సూర్యదేవర కృష్ణమూర్తి.
 
ఇక్కడే ఎందుకు...
వసంతనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఒక భవనం ఉంది. అది వదిలి ఇలా బస్టాప్‌ను అడ్డాగా మార్చుకున్నారెందుకంటే... ‘ఒక భవనంలో కూర్చుని కాలక్షేపం చేసేదేముంటుంది, పైగా కాలనీ సంక్షేమం గురించి తెలియాలంటే నలుగురి మధ్యలో తిరగాలి. కొత్తవారితో మాట్లాడాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నాయి? ఎలాంటి అవసరాలున్నాయి? అన్నది ఎలా తెలుస్తుంది. బస్టాపంటే దుమ్ము, ధూళితో రద్దీగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడైనా అంతే. కానీ మా బస్టాపు అలా కాదు. చుట్టూ చెట్లతో ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటుంది.

దాంతో మాకు ఇక్కడికి ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తుంటుంది’ అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చిన రాజారావ్‌తో మాటకలిపారు కోటేశ్వరరావు. ‘మా బస్టాపు అంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉండడానికి మా కాలనీవాసులే కారణం. ముఖ్యంగా పండుగల సమయంలో మా హడావిడి అంతాఇంతా కాదు. పేరుకే వృద్ధులం కానీ.. అందరం చిన్న పిల్లలుగా మారిపోతాం. ముఖ్యంగా వినాయక చవితి, శ్రీరామనవమి సమయంలో బోలెడంత సందడి. మాకు చేతనైనంత పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారాయన.
 
అమ్మాయిలకు రక్షణ...
వీళ్ల కాలక్షేపం... ఈ బస్‌స్టాప్‌కొచ్చే అమ్మాయిల రక్షణ కవచంగా మారింది. ‘రోజూ బస్టాపుకొచ్చేసరికి అందరూ పెద్దవాళ్లు చక్కగా పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే ముచ్చటేస్తుంది. మాకు చాలా ధైర్యంగా కూడా ఉంటుంది!’ అని ధీమాగా చెబుతోంది బస్టాప్‌లో ఓ అమ్మాయి. ‘మేం నలుగురం ఉన్నాం కాబట్టి ఏ కుర్రాడైనా ఏదైనా అంటే అడ్డుపడతాం.. బుద్ది చెబుతాం. అదే ఒక్కరం చెబితే... ‘పోరా ముసలోడా... నువ్వేంటి నాకు చెప్పేది’ అంటూ రెండు దెబ్బలేసినా వేస్తారు’ అని నవ్వుతూ చెప్పారు రిటైర్డ్ ఎంప్లాయ్ శివరామ్‌ప్రసాద్. ‘ఈ కాలం పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అనే చెప్పే పరిస్థితి లేదు. మాట మొదలవ్వకముందే నీకెందుకు? నువ్వెవరూ? అని ఎదురుతిరుగుతున్నారు’ అంటూ వాపోయారు రాజారావ్.
 
మహిళలకు వరం...
ఇలా నలుగురు వృద్ధులు ఒకచోట కూడి నాలుగు మంచి విషయాలు మాట్లాడుకోవడంలో వింతేమీ కాకపోవచ్చు... పిచ్చాపాటీ కబుర్లతో వచ్చేదేమీ లేకపోవచ్చు. కానీ... వీళ్లు కూర్చున్న కారణంగా అక్కడ బస్టాపు పరిసరాల్లో చిన్న దొంగతనంగానీ, ఒకరిపై దాడి జరిగిన దాఖలా కానీ లేదు. సాయంత్రం వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లమీద వెళుతున్న మహిళలపై చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని తెలిసి... ఆయా ప్రాంతాల్లో వీరు గుంపులుగా చేస్తున్న వాకింగ్‌లు కూడా అక్కడ మహిళల పాలిట వరంగా మారాయి. ‘ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఎద్దుతలకాయ తెచ్చిపెట్టుకోవాలి’ అని పెద్దలు చెప్పిన సామెత ప్రయోజనం ఏంటో ఈ కాలనీ వీధుల్లో కళకళలాడుతూ తిరిగే వృద్ధుల్ని చూస్తే తెలుస్తుంది.
 
 మీరూ పంపండి..
 యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న అటువంటి వారికి విజ్ఞప్తి.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్‌పీరియన్స్ మరెందరికో ఇన్‌స్పిరేషన్. మెయిల్: sakshicityplus@gmail.com

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు