సంచలనం సృష్టిస్తోన్న సెల్ఫీ!

6 Aug, 2014 15:29 IST|Sakshi
తనను తాను ఫొటో తీసుకుంటున్న ప్రియాంక చోప్రా

ఫేస్బుక్, ట్విట్టర్‍, గూగుల్‍ ప్లస్, ఇన్స్టాగ్రామ్... ఇవన్నీ సోషల్‍ నెట్వర్కింగ్లో ఒకటిపై మరొకటి పోటీపడి సేవలందిస్తున్నాయి. వీటి రుచిమరిగిన కుర్రకారు కూడా మరింత కొత్తదనం కోసం తెగ ఆలోచించేస్తున్నారు. కొత్త ఆలోచన రావడమే తరువాయి వెంటనే ఆచరణలో పెట్టేస్తున్నారు. ఆచరణలో పెట్టడానికి కొత్తకొత్త మార్గాలు కూడా వచ్చేశాయి.  సోషల్‍ నెట్ సైట్ ద్వారా అందరితో తమ అభిరుచులు పంచుకుని ప్రత్యేకం అనిపించుకోవాలనుకునే యువత ఇప్పుడు ఎంచుకున్న దారి - సెల్ఫీ. అతి తక్కువ సమయంలో ఈ సెల్ఫీ పెద్ద న్యూస్గా మారిపోయింది. ప్రస్తుతం పెనుసంచలనం సృష్టిస్తోంది.

సెల్ఫీ.. ఈ పదం కొత్తగా  అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చిన్నా,పెద్ద, యువత సెల్ఫీ మోజులో మునిగి తేలుతోంది. ఇదేదో మనకు తెలియని విషయం అనుకోవద్దు. మనందరికి తెలిసిన విషయమే. చాలా మంది యువత, పిల్లలు చేసే పనే ఇది.  సింపుల్‍గా మన ఫోటోలను మనమే తీసుకోవడాన్నే సెల్ఫీ అంటారు. వాటిని  సోషల్ సైట్స్లో లేదా వాట్స్ప్లలో అప్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది తొలుత ఎక్కడో పాశ్యాత్య దేశాలలో, హాలీవుడ్లో మొదలైంది.  గత ఏడాది బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సెల్ఫీ పిక్చర్‍ ట్విట్టర్‍, ఫేస్బుక్లలో అప్లోడ్ చేసింది. అది మొదలు అ ఈ సెల్ఫీ శైలి మనదేశంలోకి జుర్రున పాకేసింది. సినీ, స్పోర్ట్స్, ఇతర సెలెబ్రిటీ స్టార్లు తమ సెల్ఫీ ఫోటోలను పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళను చూసి మన కుర్రకారు అదే దారిలో దూసుకుపోతోంది. ఇది ఇప్పుడు ఓ పెద్ద క్రేజీ.

ఈ సెల్ఫీ కల్చర్‍ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని మరింత శరవేగంగా పుంజుకుంటోంది. తమ సంతోష సమయాలు - ఆనందంగా గడపిన క్షణాలు- మిత్రులను కలిసిన సందర్భాలు-ప్రకృతితో మమేకమైన గడియలు.....ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో ఇతరులతో పంచుకోవలనుకున్నప్పుడు క్షణాల్లో స్మార్ట్ఫోన్ సహాయంతో సెల్ఫీ క్లిక్ చేసి సోషల్ సైట్స్లో అప్లోడ్ చేయడం అలవాటైపోయింది. సాధారణంగా ఇంతకు ముందు మన ఫొటోలను ఎవరైనా తీస్తే, వాటిలో మంచివాటిని, మనకు నచ్చినవాటిని ఎంపిక చేసి అప్లోడ్ చేసేవారం.  సెల్ఫీ వచ్చిన తర్వాత ఎవరికి నచ్చిన రీతిలో వారు తమన ఫొటోలను తీసుకొని అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. తమ ఫొటోలు తామే తీసుకొని, తామే అప్లోడ్ చేసుకోవడమే సెల్ఫీ.

సోషల్‍ మీడియాలో యూత్ను ఆకట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని నెట్వర్క్లో  సెల్ఫీ పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అక్షరాలను మాత్రమే ఎంటర్ చేసి తమ భావాలను పంచుకునేవారు. ఇప్పుడు ఈ సెల్ఫీ ద్వారా తమ ఆనంద క్షణాలను, హావభావాలను..... ఇలా మన మొఖ కవళికలలోని ఎన్నో మార్పులను ఆ క్షణాన ఉన్నదిఉన్నట్లుగా వెంటనే  చూపించగలుగుతున్నారు.


ఒకరి మొఖంలోని ఆనందాన్ని, విషాదాన్ని వెనువెంటనే మరొరికి చూపించడానికి అందరూ  సెల్ఫీని సులభ మార్గంగా ఎన్నుకున్నారు. ఇంతకాలం  ఫొటోషూట్స్లా కనిపించిన సోషల్‍ వెబ్‍సైట్లు ఇప్పుడు సెల్ఫీ ఫోటోలతో వింతవింతగా దర్శనమిస్తున్నాయి. వింతవింత అనుభూతులను కలిగిస్తున్నాయి.  బైక్పై వెళ్లేటప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, విహార యాత్రలకెళ్ళేటప్పుడు....ఇలా ఎవరి స్టైల్లో వారు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ నుంచైనా  సెల్ఫీ ఫోటోలు తీసి తమవాళ్ళకు ఫోటోగ్రాఫిక్ సమాచారాన్ని చేరవేస్తున్నారు.


గతంలో ఫొటోలు ఎంతో జాగ్రత్తగా తీసేవారు. అంతే జాగ్రత్తగా భద్రపరుచుకునేవారు. అదంతా గతం. ఇప్పుడు కాలం మారిపోయింది. కాలంతో ఫొటోలు తీయడంతో, పంపడంలో మార్పులు వచ్చేశాయి. శరవేగంగా జరిగే సాంకేతిక మార్పులతో మన జీవన శైలి కూడా మారిపోయింది.

- శిసూర్య

మరిన్ని వార్తలు