కేన్సర్ విస్తరిస్తోంది.. బహుపరాక్!!

4 Feb, 2014 13:50 IST|Sakshi
కేన్సర్ విస్తరిస్తోంది.. బహుపరాక్!!

జంట నగరాల్లో రోడ్ల మీద ఎలాంటి మాస్కులు లేకుండా, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంటసేపు తిరగండి.. తర్వాత కూడా మీరు ప్రశాంతంగానే ఉండగలుగుతున్నారా? హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా? రెండూ కష్టమే. ఎందుకంటే మన గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) ఉండొచ్చని ప్రమాణాలు చెబుతుంటే, ఇప్పుడు ఉన్నది మాత్రం 95 మైక్రో గ్రాములు! వీటివల్ల ఏమవుతుందో తెలుసా? మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్ వరకు, గుండెపోటుతో సహా అనేక రకాల వ్యాధులు వస్తాయి!! ఇదంతా కేవలం పీఎం వల్ల మాత్రమే. అదే ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న పొగలో ఉండే కాలుష్యం వల్ల పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఊపిరితిత్తులు ఈ కాలుష్యం వల్ల బాగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఇటీవలి కాలంలో లంగ్ కేన్సర్ కేసులు ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు రకాల కారణాలతో కేన్సర్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదలట్లేదు. దీని బారిన పడిన కుటుంబాలు ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా దారుణంగా చితికిపోతున్నాయి. చాలావరకు కేన్సర్లు మూడు, నాలుగో దశలలో తప్ప బయట పడకపోవడం, అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్సకు కూడా ఒక పట్టాన లొంగదు.

ఒకటిన్నర ఏళ్ల వయసున్న హర్షిత్ చాలా చురుగ్గా ఉండేవాడు. చకచకా అటూ ఇటూ ఇంట్లో పరుగులు తీస్తూ అమ్మానాన్నలను ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంచేవాడు. అలాంటిది ఉన్నట్టుండి నడవడం మానేశాడు. భయం భయంగా చూసేవాడు. దాంతో కలవరపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ తీయించారు. మెదడుకు సంబంధించిన హైడ్రోకెఫాలస్ అనే వ్యాధి వచ్చిందని, దాంతోపాటు మెదడులో ట్యూమర్లు కూడా ఉన్నాయని వైద్యులు తేల్చారు. ఆ రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. కానీ, ఆ చిన్నారి కోలుకోలేదు. కోమాలోనే ఉండిపోయాడు!!

78 ఏళ్ల గోపాలకృష్ణ రిటైర్డ్ హెడ్మాస్టారు. ఒక్క దురలవాటు కూడా లేదు. నిత్యం పూజా పునస్కారాలతో నిష్ఠగా జీవితం గడిపేవారు. ఉన్నట్టుండి గొంతు మింగుడు పడటం తగ్గింది. ఏం తినాలన్నా, చివరకు మంచినీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. కొన్నాళ్లు చూసి, డాక్టర్ల దగ్గరకు వెళ్తే, అనుమానం వచ్చి ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించారు. చూస్తే.. అన్నవాహిక వద్ద కేన్సర్ వచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు.

చక్కగా తిరుగుతూ ఉండేవాళ్లను కూడా కబళిస్తున్న ఈ కేన్సర్ విస్తృతి వెనుక బహుళజాతి సంస్థల కుట్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పంటలపై విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పురుగు మందులు, రసాయనాలు కూడా నేరుగా శరీరంలోకి వెళ్లిపోయి కేన్సర్ను కలగజేస్తున్నాయని అంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి మరి!!

మరిన్ని వార్తలు