క్యాన్సర్‌తో బాధపడుతున్నా..

15 Mar, 2018 15:02 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : బోర్డు పరీక్షలంటేనే విద్యార్థులు, తల్లితం‍డ్రులకు విషమ పరీక్షగా మారాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న పదోతరగతి విద్యార్థి తనకు సహకరించేందుకు మరొకరిని అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని సీబీఎస్‌ఈ నిర్థయగా తోసిపుచ్చినట్టు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడు ఎక్కువసేపు కూర్చోలేనందున అతని తరపున పరీక్ష రాసేందుకు సహకరించేలా వేరొకరినీ అనుమతించాలని బాధిత విద్యార్థి తల్లితండ్రులు సీబీఎస్‌ఈకి లేఖ రాశారు. పరీక్ష కేంద్రంలోకి బాలుడి మందులు, ఆహారాన్ని అందుబాటులో ఉంచడానికి అనుమతించాలని కూడా లేఖలో వారు కోరారు.

బెంగళూర్‌కు చెందిన మణిపాల్‌ హాస్పిటల్‌లో అక్యూట్‌ లింపోబ్లాస్టిక్‌ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడికి కీమోథెరఫీ చికిత్స అందచేస్తున్నామని వారు బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తమ వినతిని బోర్డు తిరస్కరించిందని బాధిత విద్యార్థి మామ పనున్‌ కాశ్మీర్‌ కార్యకర్త పవన్‌ దురాని ట్వీట్‌ చేశారు. బోర్డు నిర్ణయం తనకు కన్నీళ్లు తెప్పించిందని, ఇంక మానవత్వం ఎక్కడ మిగిలుందని ప్రశ్నించారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేలా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి, మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌లకు ఆయన ట్వీట్‌ చేశారు. తమ వద్ద అన్ని మెడికల్‌ రిపోర్టులున్నాయని చెబుతూ ఆస్పత్రి సిఫార్సు లేఖనూ ఆయన జత చేశారు.

మరిన్ని వార్తలు