వృద్ధులకు చాన్స్!

25 Jun, 2014 14:24 IST|Sakshi
వృద్ధులకు చాన్స్!

బీజేపీకి చెందిన కొందరు వృద్ధనేతలు త్వరలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులు కాబోతున్నారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగానే వారి స్థానంలో బీజేపీ వృద్ధనేతలను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి.  కేంద్రం ఆదేశాలమేరకు చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు ఇప్పటికే తప్పుకున్నారు. ఇక మిగిలిన వారిలో పలువురిచేత రాజీనామా చేయించే అవకాశాలున్నాయని పాలకపక్ష వర్గాలు తెలిపాయి.

గవర్నర్లుగా నియమించేందుకు, పాలకపక్షానికి చెందిన నేతల జాబితా ఖరారు కాగానే, మిగిలిన గవర్నర్ల రాజీనామాలను కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.  పార్లమెంటు సమావేశాలకు ముందుగానే కొత్త గవర్నర్ల నియామకం జరగవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. పది మందికిపైగా గవర్నర్లను మార్చే అవకాశం ఉందంటున్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఛూ లక్ష్యంగా గోవా బీజేపీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, వాంఛూ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

 హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా కూడా రాజనాథ్‌ను కలుసుకున్నారు. నాగాలాండ్ గవర్నర్ అశ్వినీ కుమార్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ కూడా పదవి నుంచి తప్పుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, గవర్నర్‌గా నియమితుడు కావచ్చని భావిస్తున్న బీజేపీ సీనియర్ నేత లాల్జీటాండన్ నిన్న రాజనాథ్‌తో భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు