ఉందిలే మంచి కాలమ్..

2 Jan, 2015 00:01 IST|Sakshi
ఉందిలే మంచి కాలమ్..

Jhansi ki వాణి: గడచిన సంవత్సరం ఎలా గడచినా కొత్త సంవత్సరం మాత్రం కొత్తగా ఉండాలని కోరుకుంటాం. కొత్త ఆశలను, కొత్త అవకాశాలను మోసుకొచ్చిన 2015కు స్వాగతం.  ఫార్ములా వన్ ట్రాక్‌పై దూసుకెళ్లిన రేసుకారులా 2014 రివ్వున వెళ్లిపోయింది. కానీ, జ్ఞాపకాల పొరల్లో దాని తాలూకు గుర్తులు మంచీ, చెడు రెండూ చరిత్రలో నిలిచిపోతాయి.
 
 కలంతో స్నేహం..
 2014లో ఏం చేశాను, రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాను. వెనక్కి తిరిగి చూసుకుంటే 2014 నా కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తించుకునే సంవత్సరం అవుతుందని అనిపించింది. ‘చెఫ్ నంబర్ 1’ కార్యక్రమంతో మొదటిసారి దర్శకురాలిని అయ్యాను. ఈ సంవత్సరమే నా మొదటి పూర్తి పొలిటికల్ డిబేట్ షోతో రాజకీయాలనూ టచ్ చేశాను. ఈ సంవత్సరంలోనే ఎప్పట్నుంచో అనుకుంటున్న మీడియా లా చదవడానికి కాలేజీలో చేరాను. ఎప్పుడూ అనుకోనట్టు ఈ సంవత్సరమే మొదటిసారి కలం పట్టి కాలమిస్ట్ అవతారం ఎత్తాను. నాలో ఇన్ని కొత్త కోణాలను చూపించిన 2014 మరిన్ని అవకాశాలకు దారి చూపిస్తున్నట్టు 2015కు ద్వారం తెరిచింది.
 
 వారందరికీ వందనాలు..
 2015 ఇంకా ఏం ప్రారంభం కాకుండానే ఈ సంవత్సరం నాకు ప్రత్యేకం. బుల్లితెరపై ఇది నాకు ఇరవయ్యో సంవత్సరం. రెండు దశాబ్దాల కెరీర్ ఇచ్చినందుకు ఈ రంగానికీ, ఇన్నేళ్లూ మెచ్చి ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు కొత్త కోణంలో నన్ను చూపించేందుకు ఈ ప్రయాణంలో ఎందరో నాకు సహకరించారు. వారందరికీ నమః! ఈ క్రమంలో మోకాలడ్డిన వారికీ మనస్ఫూర్తిగా నమః! తిరిగి లేవడం నేర్పింది వారే మరి. పడి లేవడమే కాదు, ఎగిసే అలలా, ఎగిరే పక్షిలా దూసుకెళ్లేందుకు నా రెక్కల కింద కనిపించని గాలిలా నిరంతరం ప్రోత్సహించే నా వారందరికీ ఈ సంవత్సరం నేనివ్వగలిగింది నా విజయాలు మాత్రమే.
 
 థింక్ పాజిటివ్..
 మన మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఏదో ఒక విధంగా కార్యరూపం దాలుస్తుందని ‘ద సీక్రెట్’ అనే పుస్తకంలో చదివాను. అప్పటినుంచి అంతా పాజిటివ్‌గానే ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాను. 2015 గురించి ఆలోచించేటప్పుడు నాకెందుకో చాలా పాజిటివ్‌గా అనిపిస్తోంది. మనకు జరగబోయే మంచి గురించి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు ఓ క్రమంలో కన్‌స్పైర్ అవుతాయని పాలోకొల్హో పుస్తకాల్లో చదవడమే కానీ, ఎప్పుడూ అనుభూతి చెందలేదు. కానీ మొదటిసారి అలాంటి అనుభవం కలిగింది.
 
 గగనంలో శుభశకునం..
 హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ ఫ్లైట్‌లో ఈ ఆర్టికల్ రాస్తున్నాను. సరిగ్గా మొదటి రెండు పేరాలు రాశానో లేదో వెనుక సీట్లో నుంచి ఓ పెద్దాయన నా దగ్గరకు వచ్చి, నా చేతిలో చాక్లెట్ బాక్స్ పెట్టి నన్ను మెచ్చుకుని వెళ్లిపోయారు. ఇందులో కొత్తేముంది , చాలా మంది నాకిలా చెప్పి ఉంటారనుకుంటున్నారా..! ఎంత మంది చెప్పినా, ఎలా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా.. మా అమ్మగారు చెప్పినట్టు అవన్నీ ఆశీఃకవచమై రక్షిస్తాయని నా నమ్మకం. అలా ఆశీర్వదించిన ఈ పెద్దాయన నాకు ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్‌లో నాకు పాజిటివ్ సిగ్నల్ కనిపించింది. 2015కు అది నాకు కిక్ స్టార్ట్. ఆ చాక్లెట్ బాక్స్ స్టార్ ఆకారంలో ఉంది. అది నాకు అంతర్లీనంగా పాజిటివ్ శకునంలా తోచింది. తేరుకుని వెనక్కి వెళ్లి ఆ పెద్దాయనను ‘ఒక ఫొటో దిగొచ్చా..’ అని అడిగాను. ఎప్పుడూ ఫొటోలు మేమడిగి దిగుతాం కానీ, మీరు మాతో తీయించుకోవడమేంటని ఆశ్చర్యపోయింది వాళ్లావిడ. ఆ మూమెంట్ ప్రత్యేకత, ఆ గిఫ్ట్ విలువ వారికి అర్థం అయినా, కాపోయినా ఆ క్షణాలు నన్నెప్పుడూ రీచార్జ్ చేయడానికి ఈ ఫొటో ఉపయోగపడుతుంది. 2015 సంవత్సరంలో పరిగెత్తేందుకు కావాల్సిన ఉత్సాహాన్నిచ్చిన శర్మ, విజయలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు.
 
మార్పు మన మంచికే..
 డేటు మారుతుంది, రుతువులు మారతాయి, క్యాలెండర్ మారిపోతుంది. మనం మారకపోతే ఎలా..? సంవత్సరం కొత్తగా ఉండాలంటే మనం కూడా కొత్తదనాన్ని ఆహ్వానించేందుకు మారాలి. ఇక్కడో పిట్టకథ గుర్తొచ్చింది. నిజమో కాదో తెలీదు కానీ, ఒక రకం గద్ద 40 ఏళ్లు వచ్చాక ఎత్తయిన కొండపైకి వెళ్లి, తన ముసలి ఈకలను, కాలి గోళ్లను తానే పీకేసుకుంటుందట. ఆపైన రాతికి  తన మొండిబారిన ముక్కుని ఢీ కొట్టీ కొట్టీ ఊడగొట్టుకుంటుందట. తిరిగి మెల్లగా మొలిచే ఈకలు, గోళ్లు, ముక్కు మరింత పదనుగా ఉంటాయట. తన కొత్తరూపంతో ఆ గద్ద మరో 40 ఏళ్లు బతకగలుగుతుందట. నొప్పికి భయపడి మార్పు వద్దనుకుంటే నువు మరణించినట్టే అని ఈ కథ సారాంశం. మార్పు భయపెడుతుంది, మార్పు బాధ కలిగిస్తుంది. కానీ, మార్పు మన మంచికే. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు 2015లో ప్రయత్నిస్తాను. మనసారా మార్పుని ఆహ్వానిస్తాను. 2015 అందరికీ సంతోషాలను మోసుకురావాలని ఆశిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్.

>
మరిన్ని వార్తలు