మ.. మ..మాస్క్

18 Jul, 2014 01:08 IST|Sakshi
మ.. మ..మాస్క్

health&beauty:  చిన్నప్పుడు చందమామలో ముసుగుదొంగల కథలను ఉత్కంఠభరితంగా చదువుకునే ఉంటాం. ఇతరులు గుర్తుపట్టకుండా ఉండటానికి దొంగలు ముసుగులు ధరించెదరు అనేది అప్పటి మన అవగాహన. అలాగే, జానపద కథల్లో ఎండకన్నెరుగని రాకుమార్తెలు మేలిముసుగులు ధరించిన వైనాన్ని కూడా చదివే ఉంటాం. మేలి‘ముసుగు’చాటు అందగత్తెలను ఊహించుకుని మురిసిపోయే ఉంటాం. వాస్తవంలోకి అడుగుపెడుతున్న వయసులో పెద్దపెద్ద ఆస్పత్రుల్లో అడుగుపెట్టిన సందర్భాల్లో.. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లే డాక్టర్లు, నర్సులు ముసుగులు ధరించి కనిపించినప్పుడు అబ్బురంగా చూసే ఉంటాం. అంతేగానీ, నగరం నడివీధుల్లో జనం ముసుగులు ధరించి తిరుగుతారని అప్పట్లో  ఊహించి ఉండం. అయితే ఇపుడు ముసుగు వేయడమే కాదు.. అది అందంగా కూడా ఉండాలంటున్నారు సిటీజనులు.
 
 భాగ్యనగర వీధుల్లో వాహనాల రద్దీ పెరిగింది. రోడ్లు ఇరుకిరుకుగా మారాయి. ప్రభుత్వాల పుణ్యాన అభివృద్ధి అక్షరాలా ‘దుమ్ము’రేపే రోజులొచ్చేశాయి. గడచిన కొన్నేళ్లలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఇలాంటలాంటిది కాదు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేటంత అభివృద్ధి.. మొత్తానికి ముక్కులకు రక్షణ లేనిదే జనం వీధుల్లోకి రాలేని పరిస్థితి. ఫలితంగా, ఎలాంటి దోపిడీలకూ బయలుదేరకపోయినా, కేవలం విధినిర్వహణ, విద్యార్జన వంటి దైనందిన కార్యక్రమాల కోసం బయటకు వెళ్లేవారంతా చేతికందిన వస్త్రాన్ని ముక్కుకు చుట్టుకోనిదే బయటకు అడుగుపెట్టలేని దుస్థితి.
 
అయినా, మన హైదరాబాదీలు చాలా సహనవంతులు, పైగా సృజశీలురు. కాలుష్యపు కొత్తరోజుల్లో పురుషులు ముఖాలకు కర్ఛీఫ్‌లు చుట్టుకునేవారు. మహిళలు చున్నీలను, పైటచెంగులను కప్పుకునేవారు. కాలుష్యం నుంచి ఎలాగూ బయటపడలేమని జనాలకు త్వరగానే అర్థమైపోయింది. కాలుష్యాన్ని ఎలాగూ మార్చలేం, కనీసం ముసుగుల్లోనైనా కళాపోషణ ప్రదర్శిద్దామనుకున్నారు. అందుకే కొత్తగా సరికొత్త ముసుగులు ధరించి సొగసుపోతున్నారు.
 
 ఒక అనివార్య ఫ్యాషన్
 ముసుగు ఒక ఫ్యాషన్‌గా మారింది. నెక్‌టై వంటి అనవసర వస్త్రవిశేషమే ఫ్యాషన్‌గా లేనిది, అనివార్య వస్త్రవిశేషమైన ముసుగు.. దటీజ్ మాస్క్ ఫ్యాషన్ అయితే తప్పేంటనుకున్నారు ‘సిటీ’జనులు. వారి అభిరుచిని అందిపుచ్చుకున్నారు వస్త్రవ్యాపారులు. రకరకాల రంగులు, డిజైన్లతో మాస్కులు మార్కెట్‌ను ముంచెత్తడం మొదలైంది. వస్త్ర ప్రదర్శనల్లో మాస్కులకూ స్టాళ్లు వెలుస్తున్నాయి. మరోవైపు మెడికల్ షాపులు.. ‘ఆన్‌లైన్’లో ఈ-బే, అమెజాన్, షాప్ క్లూస్ వంటి ఈ-షాపింగ్ వెబ్‌సైట్లు కూడా రకరకాల మాస్కులను అమ్ముతున్నాయి.
 
 నగరవాసుల ఆరోగ్యం కోసమే
 రద్దీ ట్రాఫిక్‌లో వాహనాల నుంచి వెలువడే పొగ, రోడ్లపై రేగే దుమ్ము ధూళి కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. ఎక్కువ మంది అమ్మాయిలు చున్నీలు, స్కార్ఫ్‌లు వంటివి కప్పుకోవడం కనిపిస్తోంది. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రమాదకర పదార్థాలు ఊపిరితిత్తులకు చేరకుండా తగిన రక్షణ కల్పించే మాస్కులను వాడితే కాలుష్య దుష్ర్పభావాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. చిన్నారులు,  బైక్ రెడర్ల కోసం ప్రత్యేకమైన మాస్కులున్నాయి. ఈ మాస్కుల్లో ఓవెన్ ఫిల్టర్‌తో పాటు వెలుపల, బయట కాటన్ ఉండటంతో ధరించేందుకు సౌకర్యంగా ఉంటాయి. అందమైన రంగులు, డిజైన్లతో వీటిని తయారు చేస్తున్నాం. వీటి వల్ల అందం, ఆరోగ్యం లభిస్తుంది.
- శెఫాలీ శ్రీమాలి
సీఈవో , ఆన్ మాస్క్ లైఫ్‌సెనైస్ ప్రైవేట్ లిమిటెడ్

మరిన్ని వార్తలు