సిటీ మస్కటీర్స్

30 Jan, 2015 12:13 IST|Sakshi
సిటీ మస్కటీర్స్

ఝాన్సీ కి వాణీ

హైదరాబాద్ టు విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కాను. పక్క సీట్లో ముంబై నుంచి వస్తున్న ప్రయాణికుడు. నేను వస్తూనే గబగబా ముక్కుకి మాస్క్ తగిలించుకున్నాడు. అసలే సీజన్ బాగోలేదు. ఆ మాస్క్ వీరుడిని చూసి జాలేసింది. జలుబు కానీ ఉందేమోనని ! పలకరింపుగా నవ్వి కూర్చున్నాను. మాస్క్ వెనుక అతని కళ్లు మాత్రమే కనబడుతున్నాయి. తిరిగి నవ్వాడో లేదో అర్థం కాలేదు.
 
అతని కళ్లు నన్ను అనుమానాస్పదంగా చూస్తున్నట్టు అనిపించాయి. ఎందుకొచ్చిన గొడవలే అని మేగజైన్ తిరగేయడం మొదలుపెట్టాను. ప్రయాణంలో కనీసం తోటి ప్రయాణికుడిని పలకరించకుండా ఉండలేని వీక్‌నెస్ నాది. పైగా సారు గారు చూస్తున్న అనుమానపు చూపులు మరింత కుతూహలం రేకెత్తిస్తున్నాయి. ఇక ఉండబట్టలేక మీరు ముంబై నుంచి వస్తున్నారా అని అడిగాను. నేనేదో అడక్కూడనిది ప్రశ్నించినట్టు ఉలిక్కిపడిపోయి ఆయన జేబులు తడిమేసుకున్నాడు. ఊరు మరిచిపోయిన గజిని అయి ఉంటాడా..? లేక విజిటింగ్ కార్డు వెతుక్కుంటున్నాడా అనుకున్నా. ఆయన జేబు నుంచి బయటకు తీసిన వస్తువును చూసి షాకవడం నా వంతు అయింది. నోస్ మాస్క్ !! అది నా చేతికి ఇచ్చి ముఖానికి పెట్టుకోమని సైగ చేసి చేతులను శానిటైజర్‌తో రుద్దుకున్నాడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. ఒకటి మాత్రం అర్థమైంది. అతనప్పటి వరకు నన్ను వైరస్ క్యారియర్‌గా చూశాడని. అది జాగ్రత్త అనాలో, భయం అనాలో తెలీదు. మొత్తానికి మాట పెరిగింది. సారు ముంబై నుంచి వైజాగ్‌కు ఆఫీస్ పని మీద వెళ్తున్నాడట. వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్.. వయా తెలంగాణ. పైగా ఫ్లైట్ హైదరాబాద్‌లో ఆగుతుంది. కాబట్టి ‘తస్మాత్ జాగ్రత్త అని మిత్రులు హెచ్చరించారట. హైదరాబాద్ స్వైన్ ఫ్లూ క్యాపిటల్’ అని అతనిచ్చిన ఈక్వేషన్ విని తెల్లబోయాను.
 
 స్వైనం ఛిందంతి శాస్త్రాని..
 ఇదా హైదరాబాద్‌కు బయటున్న ఇమేజ్..! నిజమే హెచ్1ఎన్1 కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, తగిన సమయంలో గుర్తించి మందులు వాడాలి. వీటి గురించి తెలిసుంటే స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన చెందక్కర్లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఈ కాంపెయిన్ భుజానికెత్తుకుంది. సమాచారంతో పాటు సంచలనం క్రియేట్ చేసి తద్వారా జనం దృష్టిని ఆకర్షించాలనే ప్రణాళిక వేసిన వారూ లేకపోలేదు. ఆ ప్లాన్ వారికి లబ్ధి చేకూర్చిందో లేదో కానీ, మార్కెట్‌లో స్వైన్ ఫ్లూ పేరుతో కాసులు పండించుకునే వ్యాపారానికి తెర తీసింది. అవును మరి సమాచారం కంటే భయం తొందరగా పాకుతుంది. అందుకే జనం కూడా మెడికల్ షాప్‌లకీ, ఆస్పత్రులకూ పరుగులు తీస్తున్నారు.
 
 మాస్క్ మస్కా..
 సూపర్‌మార్కెట్‌లలో హ్యాండ్ శానిటైజర్‌ల కొరత, మెడికల్ ఫార్మసీలలో మాస్క్‌ల రేటు మోత..! ఫ్లూ వ్యాక్సిన్ కోసం  క్యూలు చేంతాడంత ! వ్యాక్సిన్ ధరలు ఎంతున్నా సామాన్యుడికి ఆతృత ! ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పక్కన పెడితే, కార్పొరేట్లతో వైద్యం చుక్కలనంటుతోంది. ఇక సందట్లో సడేమియా ల్యాబ్‌లలో పరీక్షలతో కూడా లాభాలు గడించేసుకోవాలనుకునే వారూ ఉన్నారు. మొత్తానికి స్వైన్ ఫ్లూ పేరుతో వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇది తెలిసి కూడా ఎదురు ప్రశ్నించని తత్వం మనది. రెండు రూపాయల మాస్క్ పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. కానీ, కూరగాయల దగ్గర ఓ రూపాయి తగ్గించుకోమని బేరమాడతాం. భయమేస్తే విలువ పెరుగుతుంది.
 
 లొసుగుల ముసుగు
 ఆరోగ్యంగా ఉన్నవారికి వ్యాక్సిన్ పెద్దగా అవసరం లేదని ఓ పక్కన చెబుతున్నా. ఎంత డబ్బు పోసైనా కొనుక్కుందామనుకునే మన వల్ల నల్లదందాలు మొదలయ్యాయి. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా పాకుతున్న భయానికి, భయాన్ని వ్యాపారంగా మార్చిన వైనానికి, అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా బాధ్యత వహించగలదా..! ఇతర సంచలనాలకీ, భద్రతా సమాచారాలకీ ఇదే విధంగా స్పందించని మన సమాజం మీడియాని, మార్కెట్‌ని నియంత్రించగలదా..! ఎవరి చేతుల్లో ఎవరు ఆడుతున్నట్లో? అవసరమైతే ముసుగు వేస్తాం. లేకపోతే లొసుగు వెతుకుతాం. నా పెదవి విరుపు మీకు కనిపించదు. ప్రస్తుతం నేను మాస్క్ వేసుకున్నా.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు