గణపతి భక్త

28 Aug, 2014 22:57 IST|Sakshi
గణపతి భక్త

ముప్పయ్‌రెండు వేల సంకీర్తనలతో అన్నమయ్య వేంకటేశ్వరుడ్ని కీర్తిస్తే.. అష్టపదులతో భక్తజయదేవుడు కన్నయ్యను ఆరాధించాడు. ఆ భక్తాగ్రేసరుల బాటలోనే నడుస్తున్నాడు బాలభక్తరాజు. తాను నమ్మిన దైవానికి బహు రూపాలనిస్తూ కొలుస్తున్నాడు. ఆ వికటరూపుని విచిత్ర రూపాలను 15 వేలకు పైగా గీశాడు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బుధవారం ప్రారంభమైన ‘108 గణేశా’ ఎగ్జిబిషన్‌లో ‘డోలాక్ గణేశ్’ను ప్రదర్శనకు ఉంచిన బాలభక్తరాజుతో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.

చిన్నప్పటి నుంచి బొమ్మలేయడం అలవాటు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే మహాత్మాగాంధీ, నెహ్రూ ఇలా ఎందరో దేశనాయకుల బొమ్మలు గీశాను. మా నాన్న సత్యమూర్తి కూడా పెయింటర్ కావడంతో ఈ కళ నాకు సహజంగానే అబ్బిందేమో! పదేళ్ల వయసులో  నాన్నతో  ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లాను. అప్పుడు అక్కడ ఉన్న వినాయక పెయింటింగ్స్ చూసి నేను కూడా అలాంటి చిత్రాలు గీయాలనుకున్నాను. బొజ్జ గణపయ్య భక్తుడిని కావడంతో ఎక్కువ ఆసక్తితో వినాయకుడి బొమ్మలు వేశాను.
 
లక్ష్యం లక్ష రూపాలు..
జీవనోపాధి కోసం శ్రీ కృష్ణ జ్యువెలర్స్, కీర్తిలాల్ జ్యువెలర్స్‌లో ఫినిషర్ పెయింటర్‌గా పనిచేసేవాణ్ని. వినాయకుడి పెయింటింగ్స్‌కు పూర్తి సమయం కేటాయించాలన్న ఆలోచనతో ఉద్యోగం వదులుకున్నాను. ఇప్పుడు గణనాథుడి రూపాలను గీయడమే పనిగా పెట్టుకున్నాను. వివిధ భంగిమలతో లక్ష వినాయక పెయింటింగ్స్ గీయాలన్నదే నా ల క్ష్యం. ఇప్పటి వరకు 15 వేల పెయింటింగ్స్ వేశాను. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నా.
 
బీఎఫ్‌ఏ కూడా చేశా...
పదో తరగతితోనే నా చదువు ఆగిపోయింది. నేను వేసిన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌లో ఉంచినపుడు నాకు ఓ ప్రశ్న ఎదురైంది. చాలామంది ఏ యూనివర్సిటీలో ఆర్ట్ కోర్స్ చేశావని అడిగేవారు. డిగ్రీ లేకపోవడంతో ఎంత అందమైన చిత్రాలు వేసినా డిమాండ్ ఉండేది కాదు. అందుకే మైసూర్ లలితకళ  మహాసంస్థాన్ నుంచి దూరవిద్యలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను.
 
తొలి పూజ తర్వాతే..
రోజూ ఉదయాన్నే గుడికి వెళ్లి, వినాయకుడిని దర్శించుకున్నాకే పెయింటింగ్ పని ప్రారంభిస్తాను. వాటర్, ఆయిల్ కలర్స్, ఏక్రిలిక్ కలర్స్, చార్కోల్ డ్రాయింగ్, ఇంక్ డ్రాయింగ్, పెన్ డ్రాయింగ్ చేస్తుంటా. ఎక్కువగా ఎరుపు, నీలం రంగులు వాడుతుంటాను. దేశవ్యాప్తంగా 15 సోలో ఎగ్జిబిషన్‌లు నిర్వహించాను. 30 గ్రూప్ ఎగ్జిబిషన్‌లలో పాల్గొన్నా. 100 ఫీట్ల కాన్వాస్‌పై వినాయకుడి పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు