అపురూపాల నిలయం

23 Jan, 2015 23:05 IST|Sakshi
అపురూపాల నిలయం

అద్భుతమైన కళాఖండాల నిలయం... నిజాం మ్యూజియం. నగర సంసృ్కతిని ప్రతిబింబించే విశిష్టమైన ఈ మ్యూజియం పురానాహవేలీ ప్యాలెస్ వసంత్ మహల్ ప్రాంగణంలో ఉంది. ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను సింహాసనం అధిష్టించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలను 1938లో ఘనంగా జరిపారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు ఎన్నో రకాల బహుమతులు అందజేశారు.

వాటిలో కళ్లు చెదిరే కళాఖండాలున్నాయి. వాటితోపాటు, తాను ఉపయోగించిన వస్తువులతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని నిజాం నవాబు 1950లో ఆలోచించారు. ఇందుకు పురానాహవేలీ ప్యాలెస్‌లోని వసంత్ మహల్‌ను ఎంచుకున్నారు. నాలుగైదు దశాబ్దాల తరువాత 2002లో ఈ మ్యూజియం ప్రారంభమైంది.

 
అరుదైన వార్డ్‌రోబ్
ఆరో నిజాం కాలంలో రూపొందిన అతిపెద్ద వార్డ్‌రోబ్ మ్యూజియంలో తప్పక చూడాల్సిందే. రంగూన్ టేకుతో చేసిన 264 అడుగుల పొడవున్న ఈ వార్డ్‌రోబ్‌లో 140 గదులున్నాయి. దీనిని ప్రపంచంలోనే అరుదైన వార్డ్‌రోబ్‌గా చరిత్రకారులు చెబుతారు. నగిషీ ఇంకా చెక్కు చెదరకుండా ఉన్న ఈ వార్డ్‌రోబ్ రెండు అంతస్తుల్లో ఉంది. పైభాగాన్ని చేరడానికి మెట్లున్నాయి. పై అంతస్తులో నిజాం దుస్తులతో పాటు, ఆయన వాడిన సుగంధ ద్రవ్యాలు, పలు రకాల సెంట్లు, పాదరక్షలు, టోపీలు, బ్యాగులు ఇతరత్రా ఉన్నాయి.
 
అద్భుతమైన కళాఖండాలు...  
ఆ తర్వాత గదుల్లో సుమారు వెయ్యికి పైగా కళాఖండాలు, నిజాం నవాబు వాడిన వస్తువులను గాజు అల్మారాల్లో విద్యుత్ కాంతుల నడుమ ప్రదర్శించారు. సుమారు పన్నెండడుగుల ఎత్తున్న గాజు ఫలకంపై చిత్రీకరించిన ఏడో నిజాం తైలవర్ణ చిత్రం... ఎటునుంచి చూసినా మనల్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. దక్కను సంస్థానం భూభాగాన్ని, సరిహద్దులను తెలియజేస్తూ వెండి రేకుపై చిత్రపటం, నిజాం పాలనలో చేపట్టిన ప్రధానమైన సుమారు 48 అతిపెద్ద అభివృద్ధి పనులను ప్రింట్ చేసిన కలర్ ఫొటో కాపీ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.
 
కానుకల ఖజానా...

ఉస్మానియా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో వాడిన 112 తులాల బరువుగల బంగారు గిన్నె, ఆల్విన్ మెట్ వర్క్స్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వాడిన బంగారు, వెండి తాళం కప్పలను మ్యూజియంలో పదిలపరిచారు. యుద్ధంలో వాడిన అరుదైన ఆయుధాలకు ఇందులో స్థానం కల్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిజామ్‌కు అందజేసిన కిలోల కొద్ది బరువుగల వెండితో చేసిన సిటీ సివిల్ కోర్టు నమూనా, మొజాంజాహీ మార్కెట్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం స్టేట్ రైల్వే, ఉస్మానియా విశ్వవిద్యాలయం భవనాల నమూనాలను కూడా భద్రపరచారు.
 
ఆకట్టుకునే ఆభరణాలు...
బంగారంతో తయారుచేసిన టిఫిన్ బాక్సు, రాణి వాడిన అద్దంతోపాటు నిజాం సేకరించిన పలు అపురూప కళాఖండాలూ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏడో నిజాం కళాతృష్ణకు అద్దం పడతాయి. నిజాం వాడిన జ్యూయలరీ, భద్రాచలం, పాల్వంచ రాజులు నిజామ్‌కు బహూకరించిన గోపికాకృష్ణులతో అలంకరించిన సిల్వర్ అత్తర్‌దాన్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. బంగారం పొదిగిన నిజాం సిల్వర్ జూబ్లీ సింహాసనం, ఇరాన్‌లోని ‘బస్రా పట్టణపు’ అతి పెద్ద సైజు ముత్యంతో చేసిన వాకింగ్ స్టిక్ నాటి రాజఠీవీని గుర్తు చేస్తాయి. అంతేకాదు విందుల్లో విష ప్రయోగాలను సైతం గుర్తించగలిగే ‘పాయిజన్ డిటెక్టివ్ కప్‌లు’, బంగారు పూత కవరుతో కూడిన ఖురాన్ గ్రంథాలు, మేలిమి ముత్యాలు, పగడాలు- రత్న వైఢూర్యాలు పొదిగిన కళాకృతులు నిజాం మ్యూజియంలో చూపరుల మనసును దోచుకుంటాయి. 

శుక్రవారం సెలవు...
విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో వాడిన ‘మాన్యువల్ లిఫ్ట్’ పనితీరు ప్రతి ఒక్కరూ పరిశీలించ దగినది. ఈ మ్యూజియానికి ప్రతి శుక్రవారం సెలవుదినం. మిగిలిన రోజుల్లో ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 దాకా (ఫోన్: 040-24521029) తెరచి ఉంటుంది. ఈ నిజాం మ్యూజియం నగర ప్రజలకు ఏడో నిజాం అందించిన అపురూప కానుకగా చెప్పుకోవచ్చు.
 - మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com

మరిన్ని వార్తలు