‘మధు’రోక్తి (cocktail.com)

18 Jul, 2014 03:01 IST|Sakshi
‘మధు’రోక్తి (cocktail.com)

కాసింతగా రమ్ము కోలాను కలిపిమ్ము వదిలిపోవును నెమ్ము ఓ వైనుతేయా!
 ‘తీస్కో కోకాకోలా... ఏస్కో రమ్ముసారా...’ అంటూ ఎల్లారీశ్వరి పాడిన పాటకు ఒకనాటి తరంలోని ‘రమ్’బాబులంతా ఉర్రూతలూగి తూగారు. ‘రమ్మని ఆహ్వానించినచో పొమ్మనుట పాడిగాద’ని మహాకవి ‘సిరిసిరిమువ్వ’ శతకంలో సెలవిచ్చాడు. మధువుల్లో రమ్ రూటే సెపరేటు. ఇది కాసింత నాటు కూడా. పండ్లతోనో లేదా చిరుధాన్యాలతోనో దీనిని తయారు చేయరు. నాటుసారా మాదిరిగానే దీనికి కూడా చెరుకే ముడిసరుకు. సాధారణంగా చెరుకు నుంచి వచ్చే మొలాసిస్‌తో రమ్ తయారు చేస్తారు. కొన్నిచోట్ల దీని తయారీకి నేరుగా చెరుకు రసాన్ని ఉపయోగిస్తారు.
 
  కొందరు ‘బుడ్డి’మంతులు రమ్‌తో నాటువైద్యం చేయడమూ కద్దు. వాతావరణం మారి, పడిశం పట్టుకునే లక్షణాలు కనిపిస్తే, గోరువెచ్చని నీటితో గుక్కెడు రమ్ము సేవిస్తారు. ‘అశ్వహృదయం’ ఎరిగిన అశ్వికులు పందెంలో పరుగులు తీసే గుర్రాలకు కూడా రమ్ము పట్టిస్తారు. రమ్ము ‘హార్స్‌పవర్’ పెంచుతుందనే నమ్మకం లేకపోలేదు. మన దేశం సహా నానా దేశాల్లో రమ్ తయారవుతున్నా, రమ్ తయారీకి కరీబియన్ దీవులు పేరుపొందాయి. ఎక్కువగా దొరికేది ఎర్రగా మెరిసే డార్క్ రమ్మే అయినా, మంచినీళ్లలా కనిపించే వైట్ రమ్, గోల్డ్ రమ్ వంటి వివిధ వర్ణాలూ ఇందులో ఉన్నాయి. ‘రమ్’ అనగానే కిమ్మనకుండా గ్లాసులు పుచ్చుకునే ‘రమ్’బాబుల కోసం ఈ వారం కాక్‌టెయిల్...
 
 డార్క్ డెవిల్
 డార్క్మ్    :    30 మి.లీ.
 బ్రాందీ    :    30 మి.లీ.
 కోకాకోలా    :    90 మి.లీ.
 సోడా    :    50 మి.లీ.
 గార్నిష్    :    ఐస్ తురుము, పొడ    వాటి దాల్చినచెక్క
 -  వైన్‌తేయుడు

మరిన్ని వార్తలు