కళయిక

2 Apr, 2015 01:35 IST|Sakshi
కళయిక

ఒకరిది ఇరాన్. ఇంకొకరిది లక్నో. మరొకరిది మహారాష్ట్ర. పుట్టి పెరిగిన ప్రాంతాలు వేర్వేరు... కాన్వాస్ మీద కనువిందు రేసే శైలి వేర్వేరు... వృత్తులూ వేర్వేరు. అయితేనేం... ఆ ముగ్గురూ కన్నది ఒకే కల. ఆ ముగ్గురినీ కలిపిందీ ‘కళ’. తమ కల నెరవేర్చుకునేందుకు తమ కలయికను ఒక మార్గంగా మలచుకుంటూ... దేశ విదేశాలను చుట్టేస్తామంటున్న వీరు బంజారాహిల్స్‌లోని గ్యాలరీస్పేస్ ఆర్ట్‌గ్యాలరీ గ్రూప్ షోలో పాల్గొనేందుకు కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పలకరించినప్పుడు వారు పంచుకున్న ముచ్చట్లు...
 
‘ఫస్ట్‌టైమ్ ఇక్కడికి రావడం. ఈ సిటీలోనే నా బర్త్‌డే జరుపుకున్నా’ అని సంతోషంగా చెప్పారు బహార్. ఇరాన్‌కు చెందిన ఈ చిత్రకారిణి... గత పదేళ్లుగా పూనెలో ఉంటున్నారు. ఆర్కియాలజీ చేస్తున్న ఈమె హాబీగా కుంచె పట్టారు. ఈ నగరం మా దేశాన్ని తలపిస్తోంది అని చెప్పిన బహార్... ‘స్టిల్ లైఫ్’ తన ఫేవరెట్ స్టైల్ వర్క్ అన్నారు. భారత దేశం చాలా బాగా నచ్చిందని, ఇక్కడ గొప్ప గొప్ప ఆర్టిస్టులను కలుసుకోవడం సంతోషాన్నిచ్చిందంటున్న ఆమె... రాత్రి పూట పెయింటింగ్ వేయడం అంటే తనకు చాలా ఇష్టమని, తను సింగిల్ కావడంతో ఈ విషయంలో తనను అభ్యంతర పెట్టేవాళ్లూ లేరంటూ నవ్వేశారు.
 
కమర్షియల్ కాదు...
‘ఒక్కతే అమ్మాయిని. భర్త పెద్ద బిజినెస్‌మ్యాన్. హాబీగా కుంచె పట్టా. ఈ ప్రొఫెషన్ ఇస్తున్న తృప్తిని ఎంజాయ్ చేస్తున్నానే తప్ప కమర్షియల్‌గా లాభనష్టాలు ఆలోచించడం లేదు’ అని చెబుతున్న ముంబయికి చెందిన సైకాలజిస్ట్ అంబరీన్... నగరానికి రావడం ఇది మూడవసారి. పలు నగరాల్లో 14కు పైగా గ్రూప్ షోస్‌లో పార్టిసిపేట్ చేశానంటున్న ఆమె... ‘ఇక్కడ ఆర్ట్ లవర్స్ మిగిలిన నగరాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్. అయితే ఆర్ట్ ఫీల్డ్ విషయంలో ఇక్కడ స్పీడ్ గ్రోత్ కనిపిస్తోంది’ అని అభిప్రాయపడ్డారు.
 
సముద్రుని ‘సాక్షి’గా...
‘మా ఇంటి దగ్గర నుంచి చూస్తే సముద్రం కనపడుతుంది. పొద్దున్నే దాన్ని చూస్తూంటే కుంచె కదులుతూనే ఉంటుంది’ అని చెప్పారు రష్మి త్యాగి. జన్మతః లక్నోకు చెందిన రష్మి ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. చేసింది సైకాలజీ అయినా... గత మూడేళ్లుగా చిత్రాలు గీయడంలో మునిగి తేలుతున్నారామె. యువకులైన ఇద్దరు కుమారులు వారి వారి రంగాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంటే... దానితోనే సంతోష పడిపోకుండా... తన ఐడెంటిటీని కోల్పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్న రష్మి... ‘నా ఫ్యామిలీ నన్ను బాగా ప్రోత్సహిస్తుంది’ అని చెప్పారు. అబ్‌స్ట్రాక్ట్ వర్క్స్‌తో ఆకట్టుకునే రష్మి... హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్‌టైమ్.
 
కలివిడిగా... కళే ముడిగా...
‘మా ముగ్గురికి రెండేళ్ల నుంచి పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ షో అయినా కలిసే పార్టిసిపేట్ చేస్తున్నాం’ అని చెప్పారీ చిత్రకారిణుల ‘త్రయం’. ఒకరంటే ఒకరికి ఏర్పడిన అభిమానంతో కలిసి ప్రయాణం చేస్తున్న ఈ మధ్య వయసు మహిళలు... భవిష్యత్తులోనూ మరిన్ని షోస్‌లో పాల్గొనాలని, తమ ‘కళ’యిక ఫలితాలను విస్తృతం చేయాలని ఆశిస్తున్నామన్నారు.

ఆర్ట్ టాలెంట్... ఇగోలను రాజేసే అవకాశం ఉంది కదా అంటే ‘మా మధ్య ఆ అవకాశమే లేదు. మా ముగ్గురివీ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్. అలాగే ఆర్ట్ వర్క్‌లో కూడా ఎవరి శైలి వారిది. ఒకరి పెయింటింగ్‌లకు ఆదరణ బాగా లభించినా మరొకరిది నిరాశ పరిచినా... ఈర్ష్యాసూయలు మా ఛాయలకు కూడా రావు. ఎందుకంటే... ఈ రంగాన్ని మేం ఎంచుకున్నదీ, కలిసి ప్రయాణిస్తున్నదీ ఆత్మసంతృప్తి కోసమే తప్ప ఆడంబరాల కోసం కాదు’ అంటూ వివరించారీ కళా‘త్రయం’. వీరి ప్రయాణం ‘కళ’వంతమగుగాక.

మరిన్ని వార్తలు