పదవులు తప్ప ఏ త్యాగానికైనా సిద్ధమట!

14 Sep, 2013 20:27 IST|Sakshi
పదవులు తప్ప ఏ త్యాగానికైనా సిద్ధమట!

రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలు  సమావేశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం గురించి తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్రం విభజిస్తున్నారన్న సూచనలు రాగానే రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామాలు చేశారు. ఆ తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయ్మ, ఎంపి రాజమోహన రెడ్డి కూడా రాజీనామాలు చేశారు. ఉద్యమానికి ఊతంగా నిలిచారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఒక పక్క  చర్చలతో కాలం వెళ్లదీస్తుంటే, సీమాంధ్రలో మాత్రం రాజకీయ నేతలతో సంబంధంలేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలంటూ  సమైక్య రాష్ట్ర ఉద్యమకారులు  పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. వినూత్న రీతుల్లో ప్రతి రోజూ నిరసనలు తెలుపుతూ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతున్నారు. వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునేందుకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు  హైదరాబాద్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని క్లబ్‌ హౌస్లో ఈరోజు సమావేశమయ్యారు.    ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, జే.డి.శీలం,  కోట్ల సూర్యప్రకాశ రెడ్డి,  ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, కెవిపి రామచంద్రరావు,  మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి,  సాయిప్రతాప్‌, ఎస్‌.పి.వై.రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనడం ఇష్టంలేక మినిస్టర్స్ క్వార్టర్స్లోనే ఉన్న బొత్స ఝాన్సీ బయటకు వెళ్లారు. అయితే ఆ తరువాత సమావేశం ముగియడానికి పది నిమిషాలు ముందు తిరిగి వచ్చారు. మంత్రులు  కిశోర్‌ చంద్రదేవ్‌, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు  రాయపాటి సాంబశివరావు,  చింతా మోహన్‌, హర్షకుమార్‌, సబ్బం హరి,  రత్నాబాయి,  నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి,టి. సుబ్బరామిరెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సమావేశంలో యథావిధిగా దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. చివరకు సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. అయితే పదవులకు మాత్రం రాజీనామాలు చేసేదిలేదని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం వారు చెప్పిన విషయాల సారాంశం: మాకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. ఈ విషయం అధిష్టానానికి చెప్పదలుచుకున్నాం. మరోసారి మేం అధిష్టానం పెద్దలను కలుస్తాం. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని కోరతాం.  మేం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతతో  విభజనపై కేంద్రం పునరాలోచనలో పడింది. సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకే  కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇరుప్రాంతాల్లోనూ ఆంటోని కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తాం. కేసిఆర్‌ చనిపోతాడన్న భయంతో 2009లో కేంద్రం విభజన ప్రకటన చేసింది.  కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్‌ 9 ప్రకటనకు ముందే మేం చెప్పాం. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవు.  జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో ముందే చెప్పాం.  2009లాగే 2013లోనూ కేంద్రం నిర్ణయం వెనక్కువెళ్తుంది.

సమావేశంలో వారు అనేక విషయాలు చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్టానాన్ని కలవాలని తీర్మానించారు. చర్చించిన అన్ని విషయాలలో ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ రాజీనామాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.   కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాను సమైక్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు  వారు  సమాధానాన్ని దాటవేశారు. పదవులకు రాజీనామాలు చేయడం తప్ప వారు ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అదీ వారి చిత్తశుద్ధి.

మరిన్ని వార్తలు