దావత్‌ల దరహాసాలు!

18 Aug, 2014 00:47 IST|Sakshi
దావత్‌ల దరహాసాలు!

ఆరో కుతుబ్‌షాహీ భార్య హయత్ బక్షీబేగంను ‘మా సాహెబా (అమ్మగారు)’ అని నగర ప్రజలు పిలుచుకునేవారు. ఆమె పేరుతో తవ్వించిన చెరువును మా సాహెబా తలాబ్ అనేవారు. చెరువు కనుమరుగై ‘మాసాబ్ ట్యాంక్’ మిగిలింది! మాసాబ్‌ట్యాంక్‌లో మా సమీప బంధువు నివసించేవారు. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో కజిన్ ఇంట్లో కొన్నాళ్లున్నాం. మా పొరుగు ఇల్లు ఓ నవాబుగారిది. నిజాం పాలనలో ఉన్నతాధికారులను, వారి బంధువులను, సామాజికంగా ఉన్నత కుటుంబీకులను నవాబులుగా వ్యవహరించేవారు. నిజాం హయాం గతించినా, ఓడలు బండ్లు అయినా.. నవాబులు తమ సోషల్ స్టేటస్‌ను
 కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చేవారు.
 
narendrayan - 4
డేట్ దేఖో.. వఖ్త్ నహీ!

నగరం డిన్నర్ పార్టీలకు పెట్టింది పేరు.  నిజాం హయాంలో అధికారిక విందు కార్యక్రమాలను గుర్తు చేస్తూ ‘దావత్ -ఎ-నిజాం’ పార్టీలు నిర్వహించేవారు.  తిరస్కరించకూడని గౌరవనీయుల నుంచి ఆహ్వానాలొచ్చేవి. దావత్‌కు కారణాలు ఏమిటి? అని
 లోతుల్లోకి పోకూడదు. ‘బహానా(సాకు)’లు ఒకోసారి చిత్రంగా ఉంటాయి.  మిమ్మల్ని ఎవరైనా దావత్‌కు పిలిచారనుకోండి. ఏ రోజు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ సమయం అని గుర్తుంచుకోకూడదు. ఫలానా సమయం అన్నారు కదా అని ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్లారా? ‘తప్పు’లో కాలేసినట్లే! నగరానికి వచ్చిన తొలిరోజుల్లో అమాయకంగా ఓ పార్టీకి వెళ్లా, చెప్పిన టైంకు! దావత్ తాలూకూ అలికిడి కన్పించలేదు. ఆహ్వానించిన పెద్దమనిషి కన్పించలేదు.

ఆదుర్దాతో పనిమనిషిని వెన్యూ గురించి అడిగాను. ‘రావాల్సిన చోటికే వచ్చారు. డిన్నర్‌కు రావాల్సిన వారు, సాయంత్రం టీ వేళకు వ చ్చారు’ అని జాలిపడ్డాడు. ఓ గంట తర్వాత మధువులొలకడం మొదలైంది. రాత్రి 11 గంటలైంది. నా కడుపులో సెకనుకో ఆకలి గంట మోగుతోంది.చివరికి తెగించి అడిగేశాను. అయ్యా భోజనం పెట్టించండి అని! హోస్ట్ ఆశ్చర్యపోయారు. ‘అదేంటి..అప్పుడే భోజనమా? ఆహ్వానించిన వారిలో చాలామంది రానే లేదు’ అన్నారు. ఆయన దయాశీలి! నా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను తెలివి తెచ్చుకున్నాను. ఏ పార్టీకి వెళ్లినా చెప్పిన టైంకు కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను.
 
‘బేగం’ దావత్!
త్వరగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలనుకున్నా, లేదా పార్టీ ముగిసేంతవరకూ ఉండి రావాలనుకున్నా.. హైద్రాబాద్ పార్టీలకు భోంచేసి వెళ్లడం మంచిది. నిజాంకు అత్యంత సన్నిహిత కుటుంబీకులు పైగాలు. ఆ వంశానికి చెందిన వలీ ఉద్ దౌలా నిజాంకు ప్రధానిగా పనిచేశారు. ఆయన శ్రీమతి(బేగం) ఓసారి తమ స్వగృహం విలాయత్ మంజిల్ (బేగంపేటలోని ఇప్పటి కంట్రీ క్లబ్)లో డిన్నర్‌కు పలిచారు. టైంకు వెళితే బావుండదు కదా! కొంచె ఆలస్యంగానే వెళ్లాను! ఇదిస్వీకరించండి, అది స్వీకరించండి అనే మర్యాదల నేపథ్యంలో తేలిన విషయం ఏమిటయ్యా అంటే, అందరిలో నేనొక్కడినే శాకాహారిని! మళ్లీ కడుపు కాలింది. బేగంగారు ఇతర ముఖ్యులు శ్రద్ధతో వాకబు చేశారు. యురేకా! ‘పుడ్డింగ్’!
 ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి

మరిన్ని వార్తలు