దేవయాని తప్పేంటి.. పనిమనిషి జీతం 2.80 లక్షలా?

18 Dec, 2013 17:38 IST|Sakshi
దేవయానీ ఖోబ్రగాదే

దేవయానీ ఖోబ్రగాదే నిజంగా తప్పు చేశారా? వీసా పత్రాలలో పనిమనిషికి ఒక జీతం ఇస్తున్నట్లు చూపించి వాస్తవంగా ఆమెకు అంతకంటే తక్కువ ఇచ్చారా? సరిగ్గా ఇవే ఆరోపణలతో అమెరికన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కానీ వాస్తవానికి జరిగిందేంటో తెలుసా? ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్లో సహాయ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.80 లక్షల రూపాయలు!! అంటే దాదాపు మూడొంతుల జీతాన్ని ఆమె తన పనిమనిషికే ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ఇక ఆమె దైనందిన జీవితానికి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే దాదాపుగా అమెరికాలో ఉండేవాళ్లు ఎవరైనా సరే పనిమనుషుల విషయంలో అగ్రిమెంటులో చూపించే అంకె ఒకటైతే వాస్తవంగా ఇచ్చేది వేరే ఉంటుంది. ఇది అక్కడ సర్వ సాధారణం కూడా. కానీ, దేవయాని ఇంట్లో పనిమనిషిగా వెళ్లిన మహిళ తనకు డబ్బులు సరిపోవడం లేదని, వారాంతపు సెలవుల్లో వేరే ఉద్యోగం చేసుకుంటానని చెప్పింది. అందుకు వీసా నిబంధనలు అంగీకరించవని, ఇబ్బంది అవుతుందని దేవయాని చెప్పగా, ఆమె చెప్పా పెట్టకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, నేరుగా న్యాయవాదులను సంప్రదించి కేసు పెట్టింది. అయితే అప్పటికే ఆమె వ్యవహార శైలితో విసిగిపోయిన దేవయాని, ఢిల్లీలో ఆమెపై కేసు పెట్టగా.. అధికారులు సదరు పనిమనిషిని వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీ వెళ్తే తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆమె అమెరికాలోనే ఉండిపోయింది. దాంతో దేవయానికి చిక్కులు వచ్చిపడ్డాయి.

అయితే.. భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్‌దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం.

మరిన్ని వార్తలు