వివక్ష ముసుగు తొలగించిన రచయిత్రి

31 Dec, 2014 22:55 IST|Sakshi
వివక్ష ముసుగు తొలగించిన రచయిత్రి

హైదరాబాదీ, అనీస్ జంగ్
వివాదాల జోలికి వెళ్లలేదు కాబట్టి ఆమె పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అలాగని, సమాజంలోని దాష్టీకాల పట్ల మౌనం దాల్చి, ఊహాత్మక కథలు రాసుకునే కాలక్షేపం రచయిత్రేమీ కాదామె. దేశంలోని మహిళల పట్ల వివక్ష ముసుగు తొలగించిన నిర్భీకత అనీస్ జంగ్ సొంతం. ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి ప్రముఖ కవి, పండితుడు నవాబ్ హోషియార్ జంగ్. చివరి నిజాం ప్రభువుకు సలహాదారుగా పనిచేశారు.

అనీస్ జంగ్ తల్లి, సోదరుడు కూడా కవులే. సంపన్న కుటుంబంలో పుట్టిపెరిగినా, అనీస్ సమాజాన్ని నిశితంగా పరిశీలించేది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మిషిగాన్ వర్సిటీ నుంచి సోషియాలజీ, అమెరికన్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీలు చేసింది. భారత్ తిరిగి వచ్చాక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ అయిన ‘యూత్ టైమ్స్’కు ఎడిటర్‌గా 1976-79 కాలంలో పనిచేసింది. తర్వాత క్రిస్టియన్ సైన్స్ మానిటర్, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికల్లో పనిచేసింది. ఢిల్లీలో స్థిరపడిన అనీస్, కొంతకాలానికి పూర్తిస్థాయి రచయితగా మారింది. జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు, కాలమ్స్ రాస్తూనే, స్వతంత్ర రచనల ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించింది.
 
నివురుగప్పిన నిప్పు..
‘అన్‌వీలింగ్ ఇండియా’ అనీస్ జంగ్ అనుభవాల సారాంశం. దేశంలోని పలు నగరాల్లోనే కాదు, మారుమూల గ్రామాల్లోనూ తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి తెచ్చిన ఈ పుస్తకంతోనే ఆమె దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. నిలకడగా, నిశ్శబ్దంగా కనిపించే అనీస్ జంగ్ నిజానికి నివురుగప్పిన నిప్పు. మహిళల హక్కులకు సంబంధించి ఆమెది రాజీలేని మార్గం.

ఆమె రచనల్లోనూ, ప్రసంగాల్లోనూ ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. సంప్రదాయబద్ధమైన సంపన్న ముస్లిం కుటుంబంలో పర్దా మాటున పెరిగిన ఆమె, ఆ ముసుగు తొలగించుకుని బయటకు వచ్చింది. వివాహ బంధంలో చిక్కుకోవడం ఇష్టంలేక ఒంటరిగానే మిగిలిపోయింది. స్వానుభవాల నేపథ్యంలో సమాజాన్ని తనదైన దృష్టితో పరిశీలించిన ఆమె, దేశంలోని వివక్ష ముసుగును నిర్మొహమాటంగా తొలగించింది.

‘అన్‌వీలింగ్ ఇండియా’కు అనీస్ జంగ్ కొనసాగింపు ‘బియాండ్ ద కోర్ట్‌యార్డ్’. ఆడశిశువుల భ్రూణహత్యలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, సంప్రదాయాల పేరిట కొనసాగుతున్న మహిళల అణచివేత వంటి సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేసే అనీస్‌కు, మహిళల సంఘటిత శక్తిపై అపారమైన నమ్మకం ఉంది.
 
ఇతర రచనలు..
వెన్ ఏ ప్లేస్ బికమ్స్ ఏ పర్సన్, నైట్ ఆఫ్ ద న్యూ మూన్: ఎన్‌కౌంటర్స్ విత్ ముస్లిం విమెన్ ఇన్ ఇండియా, సెవెన్ సిస్టర్స్, బ్రేకింగ్ ద సెలైన్స్, ఫ్లాష్ పాయింట్స్: పోయెమ్స్ ఇన్ ప్రోజ్, ద సాంగ్ ఆఫ్ ఇండియా, లాస్ట్ స్ప్రింగ్: స్టోరీస్ ఆఫ్ స్టోలెన్ చైల్డ్‌హుడ్ వంటి రచనల్లో అనీస్ జంగ్ సమాజంలోని అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వాటిపై తనదైన విశ్లేషణను పాఠకుల ముందుంచారు. వెట్టిచాకిరిలో వెతలు పడుతున్న బాలకార్మికుల గురించి, తాగుబోతు తండ్రుల గురించి, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల వల్ల ఛిద్రమైపోతున్న బాలికల బతుకుల గురించి అరమరికలు లేకుండా రాశారు. ‘లాస్ట్ స్ప్రింగ్’లోని కొన్ని కథలు పలు పాఠశాలల సిలబస్‌లోనూ చోటు పొందాయి.
- పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు