ఖరము పాలు

6 Jan, 2015 01:16 IST|Sakshi
ఖరము పాలు

 జంతువులన్నింటిలో గాడిద అంటే మనుషులకు చాలా తక్కువ అభిప్రాయం. తరతరాలుగా ఆ మూగ జీవి చేత గాడిద చాకిరీ చేయించుకొని దాన్నే అనేక విధాలుగా ఆడిపోసుకొనే ఆనవాయితీ అన్ని దేశా ల్లోనూ, భాషలలోనూ కనిపిస్తుంది.

 ‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అన్నారు వేమన. ఆయనకు గోవు మీద భక్తి ఉంటే ఉండవచ్చుగాక. మధ్యలో గాడిదను తెచ్చి నిందించటం ఎందుకు? ఈ రోజు ఆధునిక శాస్త్ర జ్ఞులు గాడిద పాలకు విశిష్టత ఉంది అంటున్నారు. ప్రాచీన కాలంలోనే, గాడిద పాల గొప్పతనాన్ని పాశ్చా త్య వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రాటిస్ గుర్తించాడు. జ్వరాలకు, కాలేయ జబ్బులకూ, విషాహారానికీ, ఆఖరికి కీళ్ల నొప్పు లకూ అవి దివ్యౌషధమని ఆయన ఆనాడే చెప్పాడు. అతిలోక సుం దరి క్లియోపాత్రా రోజూ గాడిద పాలతో స్నానం చేసేదట. ఆమె అందం వెనక రహస్యాలలో అదొకటని వేమన గారికి తెలియకపోతే పాపం గాడిద ఏం చేస్తుంది?

 వేమన  అంతగా ఈసడించుకొన్న గాడిద పాలు, తల్లి పాలు లభించని పసిపిల్లలకు అమృతప్రాయం.  మనుషులలో తల్లి పాలకు ఉండే సుగుణాలన్నిటికీ గాడిద పాల లక్షణాలు సన్నిహితంగా ఉంటాయి. ఆవు పాల కంటే గాడిద పాలలో క్యాలరీలు తక్కువ, కొవ్వు తక్కువ,  కొలెస్టరాల్ తక్కువ. ఇన్ని సద్గుణాలు ఉండ బట్టే, ప్రస్తుతం కొన్ని దేశాలలో గాడిద పాల వాడకం, అమ్మకం పెంచేందుకు వ్యాపార సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

 ఎటొచ్చీ గాడిద పాల ఖరీదు చాలా ఎక్కువ. లీటరు యాభై డాలర్లపై మాటే. అంటే మూడు వేల రూపాయల పైచిలుకు. అందుకే అందరికీ అందుబాటు లో ఉండేలా, పాశ్చాత్య దేశాల్లో కొన్ని కంపెనీలు వాటి ని ఉగ్గుగిన్నెడు రెండు డాలర్ల చొప్పున అమ్ముతున్నాయి.  అవును మరి, మంచి పోషణ ఉన్న జెర్సీ ఆవు రోజుకు ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది. గాడిదలు తలకు రోజుకు ఒక్క లీటరు పాలు మించి ఇవ్వవు, అదీ పిల్ల గాడిదను దగ్గర ఉంచి జాగ్రత్తగా స్వహస్తాలతో పిండుకొంటేనే. మరి ఇంకా అంటారా ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అని?

 గాడిదలో కొంచెం ఇబ్బందికరమైన గుణం ఒకటే. మొండితనం! అది యజమాని పట్ల ఎంతో విశ్వా సంగా ఉంటుంది, ఎన్నో రకాల అడ్డమైన చాకిరీ చేస్తుం ది, కానీ తను చెయ్యగూడదనుకొన్న పని మాత్రం నయానా భయానా ఎంత చెప్పినా చెయ్యదు.
 ఈ మొండితనం మనకు నచ్చితే దాన్ని స్వేచ్ఛా ప్రీతీ, పట్టుదలా, దృఢనిశ్చయం అని మెచ్చుకొంటాం. నచ్చకపోతే, శఠం, హఠం, రెటమతం అని గాడిదను ఈసడించుకొన్నట్టే ఈసడించుకొంటాం. లోకం పోకడ!
 ఎం. మారుతి శాస్త్రి

మరిన్ని వార్తలు