డబుల్ కిక్

11 Oct, 2014 00:49 IST|Sakshi
డబుల్ కిక్

 "There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage"
 
 ఈ మాటలను మార్టిన్ లూథర్ వీళ్ల కోసమే అన్నాడేమో అనిపిస్తుంది ఈ జంటను చూస్తే!  శ్యామ్‌కపూర్, వసూశ్రీ.. అతను సింధీ.. ఆమె అచ్చతెలుగు ఆడపడుచు. శ్యామ్.. నాన్‌వెజిటేరియన్. వసూశ్రీ.. ప్యూర్‌వెజిటేరియన్! ఆయన చదువు .. తొమ్మిదో తరగతి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఏంబీఏతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్, మల్టీమీడియా, ఫొటోగ్రఫీ వంటి కళల్లోనూ సర్టిఫికెట్ ప్లస్ నైపుణ్యం రెండూ సాధించింది. బాస్కెట్‌బాల్ ప్లేయర్ అనే ప్రత్యేకతా ఉంది. పుస్తక ప్రియురాలు కూడా! ఇన్ని వ్యత్యాసాలను ఒక్కటి చేసిన సామ్యం బైక్ రైడింగ్! ఎలా అని అడిగితే ఇలా చెప్తారు..
- శ్యామ్‌కపూర్, వసూశ్రీ
 
 ‘వసూని నేను ఫస్ట్‌టైమ్ 1994... కామన్‌వెల్త్ టోర్నమెంట్‌లో చూశాను లాల్‌బహదూర్ స్టేడియంలో’ చెప్పాడు శ్యామ్. ‘నేనప్పుడు డిగ్రీ సెకండియర్‌లో ఉన్నా. మా కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వాలంటీర్‌గా వెళ్లాను. హాంకాంగ్ టేబుల్ టెన్నిస్ టీమ్‌ని చూసుకునేదాన్ని. శ్యామ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా ఆ టోర్నీకి వచ్చాడు. ఆయనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ నవ్వుతూ వసూశ్రీ. ‘అవును మేడమ్‌ని కన్విన్స్ చేయడానికి ఆర్నెల్లు పట్టింది’ అని శ్యామ్ చెప్తుండగానే ‘నాకు శ్యామ్ కన్నా ఆయన బైక్ నచ్చింది. నా ప్యాషన్ అంతా బైక్ రైడింగ్ మీదే!’ అని చెప్పింది వసూశ్రీ. రైడింగ్ అభిరుచి ఎలా స్టార్ట్ అయింది?‘నాకు 15 ఏళ్లున్నప్పుడనుకుంటా.. ఫస్ట్‌టైమ్ బైక్ నడిపా. అదీ మా పెద్దన్నయ్య హీరోహోండా. పెద్దన్నయ్య చాలా ఎంకరేజ్ చేసేవాడు’ అని వసూశ్రీ గుర్తుచేసుకుంటే ‘మా తాత జమునాదాస్ కపూర్ డాక్టర్. నిజామ్‌కి పర్సనల్ ఫిజీషియన్‌గా ఉండేవాడు. మా నాన్నకు రామ్‌కోఠిలో యూనివర్సల్ ఆటోమొబైల్ స్టోర్ ఉండేది. రైడింగ్ ఆసక్తి బహుశా మా షాప్ వల్లే కలిగిందనుకుంటా! నాకు ఊహ తెలిసినప్పటి నుంచే బైక్స్ రైడ్ చేయడం మొదలుపెట్టా’నంటూ అతనూ తన స్టార్టింగ్ పాయింట్‌ను గుర్తు చేసుకున్నాడు.
 
 పెళ్లి ప్రయాణం..
 ‘పరిచయమైన ఏడాదిన్నరకు పెళ్లి చేసుకున్నాం’ అన్నారిద్దరూ!. ‘పెళ్లాయ్యాకే ఏంబీఏ చేశాను. నిజానికి అసలు జర్నీ అంతా అప్పటినుంచే మొదలైంది. శ్యామ్ వెరీ ప్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్. వెనకాల ఉన్నాను అనే భరోసా ఇస్తాడు కానీ అన్నీ నేనే చేసుకునేలా చూస్తాడు. మాకు ఫార్చ్యూన్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ ఉంది. దానికి ఆయన ఫౌండర్ అయితే నేను మేనేజింగ్ పార్టనర్‌ని. కొన్ని వెంచర్స్‌ని కంప్లీట్‌గా నాకే వదిలేస్తాడు. ఎంతకష్టమైనా సరే వాటిని నేనే పూర్తిచేయాలి. దాని వల్ల నేనెంతో నేర్చుకున్నాను. మా వర్కర్స్‌కి  మేడం డమ్మీ అనే అపోహ రాకుండా మేడం యాక్టివ్ అనే భయమూ ఏర్పడింది. ఇలా తన దగ్గర నేర్చుకున్నవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్’ అని శ్యామ్‌కి కితాబిచ్చింది. ‘తన దగ్గరా చాలా నేర్చుకున్నాను మల్టీటాస్క్ ఎలా చేయొచ్చో’ అని భార్యకూ కితాబిచ్చాడు శ్యామ్.
                          
 మెరిట్స్ అండ్ డీమెరిట్స్..
 ‘ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అన్నిట్లో పర్‌ఫెక్ట్ అనే భావనలో మేమిద్దరం లేం’ అంటారు ముక్తకంఠంతో.  ‘అసలు నెగటివ్ షేడ్స్  గురించి ఆలోచించం. తనకు కొంచెం కోపమెక్కువ. శ్యామ్ కోపంగా ఉన్నప్పుడు నేను సెలైంట్ అయిపోతాను. అయితే మా ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నా సారీ చెప్పేది నేనే. మా పందొమ్మిదేళ్ల మ్యారీడ్ లైఫ్‌లో ఆయన ఇప్పటిదాకా సారీ చెప్పలేదు’ అని వసూశ్రీ అంటుంటే ‘ఆమె నేను చెప్పేదాకా ఆగకుండా తనే ముందు చెప్పేస్తుంది’ అన్నాడు శ్యామ్.
 
‘ఎనీ వే మై వైఫ్ ఈజ్ పర్‌ఫెక్ట్. కూల్‌గా ఉండడం తన దగ్గరే నేర్చుకున్నాను’ చెప్పాడు. ‘ తనలో నాకు నచ్చే గుణం అదే. అందరిముందు నాకు కాంప్లిమెంట్ ఇస్తాడు. ఈ రోజు నేనిలా ఉన్నానంటే తనవల్లే అని!’అంది భర్త సుగుణాన్ని ఆస్వాదిస్తూ.‘మా దగ్గర రెండువందల రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాం’ అని శ్యామ్ అంటుంటే ‘అప్పుడే మా పెళ్లయి పందొమ్మిదేళ్లయిందా అనిపిస్తుంది.. మా సహజీవనం నిన్నమొన్న మొదలైనట్టే ఉంటుంది’ అంటుంది వసూశ్రీ. ఈ అనుబంధానికి ‘నమ్మకం, గౌరవం, స్పేస్..’ అనే మూడు మంత్రాలే కారణం అంటారిద్దరూ!
 
 హ్యాపీ రైడ్..
 ఈ రైడర్స్ జంట హార్లీ ఓనర్స్ గ్రూప్ (హాగ్) సభ్యులు. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై దేశమంతా చుట్టొచ్చిన ఈ జంట గత జూలైలో ఖజరహో ట్రిప్ వెళ్లొచ్చింది. హాగ్ ఓనర్స్ గ్రూప్ బంజారా చాప్టర్‌లో శ్యామ్‌కపూర్ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. వీరి బైక్ థీమ్ దక్కనీ ఒడిస్సీ థీమ్. బెస్ట్ బైక్ కేటగిరీ కింద జోనల్, నేషనల్ బెస్ట్ కస్టమైజ్డ్ అవార్డును అందుకున్నారు. ఇంటర్ చదివే కూతురు, ఎయిత్ చదివే కొడుకూ ఉన్నారు వీళ్లకు. ఇప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా బైక్‌రైడింగ్‌కు వెళ్లిపోతుందీ జంట. రొటీన్ లైఫ్‌లోని అలకలు, కినుకలు, వృత్తిజీవితంలోని ఒత్తిళ్లను బ్రేక్ చేసేది ఈ జర్నీయే’ అని చెప్తారు. ఈ జంట ప్రయాణం ఇలాగే హ్యాపీగా సాగాలని కోరుకుందాం!.
 -  సరస్వతి రమ

>
మరిన్ని వార్తలు