వీణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన శాస్త్రి

23 Sep, 2013 21:37 IST|Sakshi
వీణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన శాస్త్రి

నేడు ఈమని శంకరశాస్త్రి జయంతి

ఆయన వేళ్లలో ఏదో తెలియని అమృతగుణం ఉంది
 ఆయన ఆలోచనలో ఏదో తెలియని కొత్తదనం ఉంది
 ఆయన వీణలో సాక్షాత్తు సరస్వతి కొలువై ఉంది
 ఆయన వీణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు
 వీణ మీద సాంఘిక అంశాలను సైతం పలికించారు
 వీణను అందరికీ చేరువ చేశారు...
 ఆయనే మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
 
 వేదం... వీణానాదం...


 వీణానాదం శుభానికి ప్రతీక. వాస్తవానికి వీణ ప్రకాశించవలసినంతగా తెలుగునాడులో ప్రకాశించలేదనే చెప్పాలి. అటువంటి వీణకు అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లి, వీణానాదానికి వైభవాన్ని తీసుకువచ్చిన మహనీయుడు ఈమని శంకరశాస్త్రి. వీణ ధ్వని స్థాయి తక్కువగా ఉంటుంది. అందువల్ల... వేయి మంది కూర్చున్న సభలో, దూరంలో కూర్చున్నవారు వీణావాదం వినలేకపోయేవారు. ఆ కారణంగా వీణ కచేరీలకు శ్రోతలు అనుకున్న స్థాయిలో హాజరయ్యేవారు కాదు. వీణకు సరయిన ఆదరణ లేకపోవడం వల్ల, వీణను అభ్యసించేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఈ రెండు కారణాల వల్ల వీణానాదనకు క్షీణదశ ఏర్పడింది. మైకులు అందుబాటులోకి వచ్చాక ఈ ధ్వనిని అందరూ ఇంపుగా వినగలుగుతున్నారు. సంగీత ముత్తుస్వామి దీక్షితార్ వీణ వాయించేవారని ప్రసిద్ధి. మహామహులెందరో వీణానాదం చేశారు. అయితే వారు మాత్రమే కీర్తిని సంపాదించుకున్నారు కాని, వీణకు ఘనత తీసుకురాలేకపోయారు. పరమశివుడు వీణ వాయించాడని ప్రతీతి. అటువంటి వీణకు ప్రఖ్యాతి తెచ్చినవారు ఈమని శంకరశాస్త్రి. శివుడే మళ్లీ జన్మించాడనో, మరే కారణమో కాని, ఆయనకు శంకరశాస్త్రి అని పేరు సార్థకం అయింది. మిగతా వాద్యపరికరాలతో సమానంగా వీణకు స్థాయి తీసుకువచ్చారు శాస్త్రిగారు. గాత్రంలో ఉండే ధర్మాలన్నిటినీ ఇందులో నింపడమే కాకుండా, గాత్రం కన్నా ఎక్కువగా దానిలో మాధుర్యం నింపి సంగీత ప్రపంచాన్ని అమృతపానం చేయించినవారు శ్రీశాస్త్రి. గాయకులైనవారికి గొంతు వారి కంఠంలో ఉంటుంది. కాని శంకరశాస్త్రిగారి గొంతు వీణలో ఉంది.

 శంకరశాస్త్రిగారు గుంటూరులో నాలుగున్నర గంటల పాటు వీణ కచేరీ చేసి, ఆ జ్ఞాపకాలను ఇంకా అందరూ స్మరించుకుంటూండగానే, అదేరోజు రాత్రి రైల్‌లో ప్రయాణిస్తూ ఆయన ప్రాణాలు సంగీతంలో లయమైపోయాయి. విశేషమేమంటే... ఆ సమయంలో ఆయన పక్కన వీణ సజీవంగా ఉంది. ఆయనకు తన వీణతో మాట్లాడుకోవడం అలవాటు. ఆ వీణతో... ‘‘నేనెప్పుడు చెబితే అప్పుడు తీసుకెళ్లు’’ అనేవారట. ఆయన... వీణను సజీవ పదార్థంగా చూసేవారు. ఎవరైనా వీణను చిన్నచూపు చూస్తే సహించేవారు కాదు. శంకరశాస్త్రిగారు వీణ మీద వేగంగా వాయించడం చూసిన కొందరు, ‘‘అయ్యా! మీరు వీణ వదిలేసి వయొలిన్ పట్టుకున్నట్లు ఉందే’ అన్నారట. ఆయన రౌద్రనేత్రులయ్యారట. వీణ మీద వేగంగా వాయించడం చాలా కష్టం. వయొలిన్ మీద స్వరాలు పక్కపక్కనే వేయవచ్చు, అదే వీణ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లాలి. దానిని శాస్త్రిగారు సాధించారు. రవిశంకర్ సితార్, అంజద్ అలీఖాన్ సరోద్... వాటి వేగంతో పోటీ పడ్డారు. వారితో జుగల్‌బందీ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులను అలరించారు.

 1922, సెప్టెంబరు 23న, తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో జన్మించిన శాస్త్రిగారు, వారి తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గ ంభీరంగాను... రెండువిధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరవాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.

 శాస్త్రిగారి ప్రత్యేకత...

 కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రిగారు, ‘ఆదర్శ శిఖరారోహణం’ అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలు, తాము ఎవరెస్టును అధిరోహిస్తున్న అనుభూతిని పొందారు. ఇటువంటిదే ‘భ్రమరవిన్యాసం’ అనే మరొక సంగీత రూపకం. ఈ కార్యక్రమాన్ని విన్నవారు, వారి పక్కనే తుమ్మెద ఝంకారం ఉన్న అనుభూతిని పొందారట. ఈనాడు వాద్యవిద్వాంసులు చేస్తున్న ప్రయోగాలకు ఆద్యులు శంకరశాస్త్రిగారే. గమకాలు వేయడంలో, స్వర కంపనంలో, రాగాలాపనలో, స్వరప్రస్తారంలో, తానం వేయటంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు స్వరాలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దం వచ్చేలా చేయడంలో, స్వరనాదంలో హెచ్చుతగ్గులు ప్రదర్శించడంలో... సంగీతంలోని అన్నివిభాగాలలో ఎన్నో కొత్త మార్గాలను సృష్టించారు. సంగీతంలో ఉన్న గమకరీతులకు తోడు, మరో ఏడు రీతులను సృష్టించిన స్రష్ట శాస్త్రిగారు.

 సినీ ప్రస్థానం...

 1942 - 50 మధ్యలో మద్రాసులో జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుగారికి సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయ్యాడు. 1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకునిగా పరిచయం చేసినది శాస్త్రిగారే. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. టైటిల్స్ ఆయన పేరు ఎక్కడైనా వేశారో లేదో కూడా అనుమానమేనని ప్రముఖ రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘సీతారామకల్యాణం’ చిత్రంలో రావణుడు వీణవాయించే ఘట్టంలో, ప్లేబ్యాక్‌లో శంకరశాస్త్రి వీణ వాయించారు. ‘వెంకటేశ్వర మహాత్యం’ సినిమాలో వాచస్పతి రాగంలో వీణ వాయించారు.

 గాత్రం జోడిస్తూ...

 తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ, వీణ మీద అవే సంగతులు పలికించేవారు. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు, ‘ప్రజా’ వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా రెండు తీగెల మీద డబుల్ మీటు వేసేవారు. ఇక సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన తీగెలను కుడిచేత్తో మీటే పద్ధతి గొప్పగా ఉండేది. చేతి పొజిషన్‌ను నాలుగైదు రకాలుగా మార్చేవారు. అది అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ, మంద్ర, అనుమంద్ర స్థాయుల్లో వాయించేవారు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. తాను పూర్తిగా సంగీతంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని కూడా సంగీతంలో ఓలలాడించేవారు.

 ఇతర సంగీత వాద్యాలలా...

 హిందుస్తానీ కళాకారులతో జుగల్‌బందీ చేయడం ఆయనకు సులభసాధ్యం. కచేరీలో వీణ బుర్ర మీద జాజ్ శబ్దం వాయిస్తూ స్వరరచనలు చేసేవారు. మంద్రస్థాయిలో అచ్చు గిటార్ లాగే వినపడేది. కదనకుతూహల రాగంలో ‘రఘువంశ సుధాంబుధి చంద్ర’ కీర్తనను ద్వారం వెంకటస్వామినాయుడు గారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్స్ ఉపయోగించేవారు. వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు చేయవచ్చో సంపూర్ణంగా అర్థం చేసుకున్న కళాకారుడు శాస్త్రిగారు.

 కచేరీలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీతసాధన చేసేవారు. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇచ్చేవారు కాదు. అమలాపురం కోనసీమ బ్యాంక్ ఆవరణలో ఒకసారి చిట్టిబాబు, ఈమనిగారు కలిసి ఒక చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేశారు.

 సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్చికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు. ఇక తన వీణానాదాన్ని అమరలోకంలో దేవతలకు వినిపించాలనుకున్నారో ఏమో 1986, డిసెంబరు 23న వీణాగానం చేస్తూ నారదునితో సంచారం చేయడం ప్రారంభించారు.

 విమానం ఎక్కడమంటే ఆయనకు చాలా భయమట. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారట. చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు.  ‘కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ’ అని పత్రికలు ప్రశంసించాయట.

మరిన్ని వార్తలు