మనోడు

23 Sep, 2014 00:22 IST|Sakshi

ముఖానికి రంగులేయడానికి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ముంబైలో సెలబ్రిటీలకు హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యాడు. జన్నత్ 2, ఐయామ్.. తదితర బాలీవుడ్ సినిమాలు.. ఫ్యాషన్ షోలు, టాప్ బ్రాండ్‌ల యాడ్స్‌కు పనిచేస్తున్నాడు. వోగ్, ఎల్లె, గ్రాజియా, జిక్యు, కాండె నాస్ట్ ట్రావెలర్.. వంటి అంతర్జాతీయ మేగజైన్ల ఫ్యాషన్ ఎడిటోరియల్స్‌కు వన్నెలద్దాడు. పదేళ్లుగా సెలబ్రిటీ ఫ్యాషన్స్‌కు మెరుగులద్దుతున్న ఆయన పేరు ఎల్టన్ ఫెర్నాండెజ్.. పక్కా హైదరాబాదీ. యూట్యూబ్‌లో మన దేశపు తొలి ప్రొఫెషనల్ బ్యూటీ అండ్ మేకప్ చానల్ లాంచ్ చేసి ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా సిటీకి వచ్చిన ఆయన ‘సిటీ ప్లస్’తో ముచ్చటి ంచాడు. విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 నేను పుట్టింది సికింద్రాబాద్‌లో. భవన్స్‌లో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేసి హెచ్‌ఎస్‌బీసీలో జాబ్ లో చేరా. రెండేళ్ల తర్వాత ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీకి మారాను. కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్స్ వేసే నా హాబీని గమనించిన ఫ్రెండ్ సచిన్ డకొజి.. మనిషి ఫేస్‌ను కాన్వాస్ చేసుకోవడం ఎలాగో నేర్పించాడు. ఉద్యోగం చేస్తూనే.. వీకెండ్స్‌లో చిన్న చిన్న మేకప్ జాబ్స్ చేశాను. చివరికి నాకు శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తోంది మేకప్ రంగమే అని అర్థమయ్యాక... అందులోనే  భవిష్యత్తును వెతుక్కుంటూ.. గూగుల్‌లో యాడ్ వర్డ్స్‌లో చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పా. ‘అది ఆడవాళ్ల పని’ అని అమ్మ, ‘దాని వల్ల వచ్చేదేం లేదు’ అని నాన్న గట్టిగా వ్యతిరేకించారు. మెచ్చిన కెరీర్ కోసం వారి మాటల్ని కాదన్నాను. ముంబైకి పయనమయ్యాను.
 
అదంత ఈజీ కాదు..
ముంబై వె ళ్లాక కొన్ని రోజులకే ఎమ్‌ఏసీ కాస్మెటిక్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. అది సేల్స్ జాబ్ కావడంతో 9 నెలలకే మానేశాను. ఓ ఏడాది నిరుద్యోగిగా ఉన్నా. నా కెరీర్‌లో అత్యంత కష్టకాలం అది. ఆ టైంలో మేకప్ రంగాన్ని దగ్గరగా చూశాను. దానికి తగ్గట్టుగా నా కెరీర్ ఎలా మలచుకోవాలో అర్థమైంది. ఏడాది గ్యాప్ తర్వాత ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రస్థానం వెనుకడుగు లేకుండా సాగింది. క్రియేటివ్ పీపుల్ తమ ఆత్మ, హృదయాలను ఒకటి చేసి వర్క్ చేస్తారు. దానికి ప్రశంస లభించకపోతే డిజప్పాయింట్ అవుతారు. ఇందుకు నేనూ మినహాయింపు కాదు. సౌత్ నుంచి వెళ్లినవారు నార్త్‌లో.. అందునా ఫ్యాషన్ రంగంలో సక్సెస్ కావడం ఈజీ కాదు. కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను. మొదట్లో బాధపడ్డా, తర్వాత అందులో నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ప్రతి ప్రసిద్ధ భారతీయ మేగజైన్‌తో పనిచేశాను.
 
 మైల్ స్టోన్స్..
 2014 మార్చిలో వోగ్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ స్ప్రెడ్‌కు వర్క్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం. అమెరికన్ కాండె నాస్ట్ ట్రావెలర్ కవర్ ఫొటోకు వర్క్ చేయడం గర్వంగా భావిస్తున్నాను. దక్షిణాదిలోనే తొలి వాల్ట్ డిస్నీ ఫిల్మ్ కోసం లక్ష్మీ మంచుతో (అనగనగా ఓ ధీరుడు), ఐయామ్ సినిమా కోసం మనీషా కొయిరాలా, జుహీచావ్లా, సంజయ్ సూరి, నందితాదాస్‌తో పని చేశా. ప్యూమా, లేస్, ప్రొవోగ్, ఐడియా, వెల్లా, ఫాస్ట్రాక్, గ్లోబస్, సన్ సిల్క్, శామ్‌సంగ్, వివెల్.. మరెన్నో బ్రాండ్స్‌తో నా కొలాబరేషన్ కొనసాగుతోంది.  నా క్లోజ్ ఫ్రెండ్, మ్యుజీషియన్ మోనికాడోగ్రా తీసిన మ్యూజిక్ వీడియోకి పనిచేశాను. ఆమెతో కలసి ఆ వీడియోలో కనిపిస్తాను కూడా.
 
 పాఠాలు నేర్పే పనిలో..
 లోరియల్ కోసం మిస్ మాలినితో షూట్‌లో పాల్గొన్నప్పుడు వచ్చిన ఆలోచన యూట్యూబ్‌లో ప్రొఫెషనల్ బ్యూటీ చానల్ లాంచ్ చేసిన  తొలి మేకప్ ఆర్టిస్ట్‌గా నాకు పేరు తెచ్చింది. ఈ చానల్ ద్వారా మేకప్, హెయిర్ స్టైలింగ్‌పై దశల వారీగా ట్యుటోరియల్స్ అందిస్తున్నా. ఈ వీడియోల కోసం మోడల్స్‌ను ఎంపిక చేయడం, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్‌ను తేవడం.. దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ నేనే చూసుకుంటున్నా. ఈ  చానల్ 6 నెలల టైమ్‌లోనే 4 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు, 1.70 లక్షల మంది వీక్షకుల్ని సాధించింది.  స్కూలింగ్ టైమ్ నుంచి డిజైనింగ్ అంటే  ఇష్టం. ైడిజైనింగ్  గొప్ప చాలెంజ్. సోర్సింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ప్యాట్రన్ మేకింగ్ ప్రతిదీ వైవిధ్యంగా చేయాలి. గత ఏడాది ఫిబ్రవరిలో నా కలెక్షన్స్ లాంచ్ చేశాను. అయితే ఇది నా రెగ్యులర్ జాబ్‌కాదు.
 
 టాప్ బ్యూటీ టిప్
 ఫస్ట్... చర్మం మెత్తగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ సరిపడా ద్రవ పదార్థాలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. బ్లష్, మస్కరా, లిప్‌బామ్‌లు ఉపయోగించండి. మీ ఐబ్రోస్‌ను రైట్ షేప్ చేసుకోండి. ఎక్సెస్‌గా ఉన్న కలర్‌ను పెదాల మీద నుంచి చెంపలకు వేళ్లతో తీసుకెళ్లడం ద్వారా మీ లిప్‌స్టిక్‌ను ఒక బ్లషర్‌లా వాడండి.
 
 ఆత్మీయుల సిటీ..
 హైదరాబాద్ అంటే చాలా ఇష్టం.  మేకప్‌లో ఓనమాలు నే ర్పించిన సచిన్ సహా ఎందరో ఆత్మీయులు సిటీలో ఉన్నారు. ప్రొఫెషన్‌లో భాగంగా ఇక్కడికి వస్తూనే ఉన్నా. ఆ మధ్య తాజ్ హోటల్స్ క్యాలెండర్ షూట్ కోసం ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ ఉజ్వలారౌత్‌కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మేకప్ చేశాను. అలాగే అతుల్ కస్బేకర్‌తో కలసి పలు షూట్‌ల కోసం సిటీకి వచ్చాను.
 - ఎస్.సత్యబాబు

మరిన్ని వార్తలు