ఆన్‌లైన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో

11 Jul, 2013 02:53 IST|Sakshi
ఆన్‌లైన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో
 ఇంటర్నెట్ మాధ్యమంగా వీడియోలను వీక్షించడం ఎంతో సరదా, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడుకున్న వ్యవహారం. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వీడియోల్లో కేవలం టైమ్‌పాస్ కోసమే కాక విజ్ఞానాన్ని పెంపొందించేవి కూడా అనేకం ఉన్నాయి. అలాంటి వీడియోలన్నింటినీ కూర్చిన వెబ్‌సైట్‌లు చాలా ఉన్నాయి. ఆసక్తి ఉన్న, అవసరమైన సబ్జెక్ట్‌గురించి విస్తృతమైన విజ్ఞానాన్ని అందించడానికి ఈ సైట్లు   సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో పేరున్నవి, ప్రముఖమైనవి కొన్ని... 
 
 టీఈడీ.కామ్
 టెక్నాలజీ, ఎడ్యుకేషన్, డిజైన్.. ఈ మూడు సబ్జెక్టుల మిశ్రమమే.. టీఈడీ.కామ్ ఈ సబ్జెక్టులకు సంబంధించిన పూర్తిసమాచారంతో పాటు, తాజా పరిణామాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.www.ted.comలోని  వీడియోలు ఆయా రంగాల విద్యార్థులకు విస్తృతమైన ఆలోచనా పరిధిని పెంపొందించేలా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
 బ్రైట్ టాక్...
 ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల స్ఫూర్తివంతమైన ప్రసంగాల వీడియోలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. బిజినెస్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్ వంటి అంశాల గురించి మార్గదర్శకులైన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యానికి ఉపయోగపడేలా వీటిని అందుబాటులో ఉంచామని www.brighttalk.comను నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ కమ్యూనిటీస్’ వారు పేర్కొన్నారు. 
 
 సాల్వ్ ఫర్ ఎక్స్..
 ఇది గూగుల్ ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా మనుషులు సతమతమవుతున్న వివిధ సమస్యల గురించి ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారమార్గాల గురించి నవ్య ఆలోచనలను ఆవిష్కరిస్తోంది ఈ వెబ్‌సైట్. అటు విద్యార్థుల ఆలోచనల ఆవిష్కరణకు,  ప్రపంచ అవసరాల కోసం గూగుల్ చేస్తున్న గొప్ప ప్రయత్నమని విశ్లేషకులు అంటున్నారు. అదెలాగో తెలుసుకోవాలంటేwww.solveforx.comను క్లిక్ చేయాల్సిందే. 
 
 గ్రీన్.టీవీ..
 పేరుకు తగ్గట్టుగానే పచ్చదనం పరిశుభ్రతకు సంబంధించిన వీడియో సైట్ ఇది. ఐక్యరాజ్యసమితి అనుబంధ పర్యావరణ విభాగంవారు దీన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి సంబంధించిన సమాచారం కోసం, ఈ విషయంలో ఉన్న సవాళ్ల గురించి తెలుసుకోవాలనుకునేవారికి<http://green.tv/>  అపారమైన సమాచారం అందిస్తుంది.
 
మరిన్ని వార్తలు