-

చాంద్ స.. రోషన్ చెహరా..

17 Jul, 2014 00:37 IST|Sakshi
చాంద్ స.. రోషన్ చెహరా..

హైదరాబాదీ: షర్మిలా టాగోర్..
 సత్యజిత్ రే ఆమెను పరిచయం చేయకపోయి ఉంటే, వెండితెర కచ్చితంగా ఒక వెలుగును కోల్పోయి ఉండేది. ఇటు బాలీవుడ్‌ను, అటు బెంగాలీ చిత్రసీమను వెలిగించిన ఆ వెలుగు పేరు షర్మిలా టాగోర్. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. అప్పట్లో ఆమె తండ్రి గీతీంద్రనాథ్ టాగోర్ ఈస్టిండియా కంపెనీ యాజమాన్యంలోని ఎల్గిన్ మిల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. గీతీంద్రనాథ్ తాత గగనేంద్రనాథ్ టాగోర్ సుప్రసిద్ధ పెయింటర్. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌కు సమీప బంధువు కూడా.
 
 విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షర్మిలను సినీరంగంలోకి పంపడం ఆమె తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేదు. అయితే, సత్యజిత్ రే స్వయంగా అడగడంతో కాదనలేకపోయారు. అలా షర్మిలా పదిహేనేళ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసింది. సత్యజిత్ రే బెంగాలీలో రూపొందించిన ‘అపూర్ సంసార్’ ఆమె తొలి చిత్రం. వరుసగా నాలుగు బెంగాలీ చిత్రాలు చేశాక, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వైవిధ్యభరితమైన కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌ను ఏలింది. నాటి తరానికి చెందిన దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఉద్దండ దర్శకులందరి దర్శకత్వంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.
 
 సప్నోంకీ రానీ...
 ‘ఆరాధన’ చిత్రంలో ‘మేరే సప్నోంకీ రానీ...’ అంటూ రాజేశ్ ఖన్నా హుషారుగా జీపులో రైలును వెంబడిస్తుంటే, రైలులో పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్య ఓరచూపులు విసిరే షర్మిలా నటనకు నాటి యువతరం ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. శక్తి సామంతా దర్శకత్వంలో 1969లో విడుదలైన ఈ చిత్రం షర్మిలాకు ఉత్తమ నటిగా ‘ఫిలింఫేర్’ అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఆరాధన’ విడుదలకు ఐదేళ్ల ముందే ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిందీలో ఆమె తొలిచిత్రం... శక్తి సామంతా దర్శకత్వంలోని ‘కాశ్మీర్ కీ కలీ’. అందులో షమ్మీకపూర్ సరసన నటించి, అందరినీ ఆకట్టుకుంది. ‘యే చాంద్ స రోషన్ చెహరా...’ అంటూ షమ్మీకపూర్ మెలికలు తిరుగుతూ ముసిముసి నవ్వుల షర్మిలాను ‘తారీఫ్’ చేస్తే, ప్రేక్షకులూ ఆమెను తారీఫ్ చేశారు.
 
 అయితే, ‘ఆరాధన’ తర్వాతే ఆమె కెరీర్ ఊపందుకుంది. శక్తి సామంతా దర్శకత్వంలోనే ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’లో టూ పీస్ బికినీతో తెరపై కనిపించి, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది. ఒక భారతీయ నటి టూ పీస్ బికినీతో తెరపై కనిపించడం అదే తొలిసారి. ఆమె బికినీ ఫొటోను ‘ఫిలింఫేర్’ కవర్‌పేజీపై ముద్రించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న ఉదాత్త పాత్రల్లోనూ రాణించింది. సినీ కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని 1969లో పెళ్లాడింది.
 
మతం మారి, బేగం ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు గ్లామర్ తగ్గి, తెరమరుగవుతారు. షర్మిలా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. పెళ్లి తర్వాత చాలా సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ‘అమానుష్’, ‘అమర్‌ప్రేమ్’, ‘మౌసమ్’, ‘సఫర్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల మన్ననలు పొందింది. ‘మౌసమ్’ చిత్రంలో నటనకు ఉత్తమనటిగా 1976లో జాతీయ అవార్డు సాధించింది. భారత ప్రభుత్వం గత ఏడాది ఆమెకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చింది. సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలందించిన షర్మిలా టాగోర్, ఇప్పటికీ వయసుకు తగిన పాత్రల్లో రాణిస్తోంది. ఆమె కొడుకు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సినీ రంగంలో రాణిస్తున్నారు. మరో కూతురు సాబా అలీఖాన్ జ్యుయలరీ డిజైనర్‌గా కొనసాగుతోంది.
 
 ‘పారో’ పాత్ర... నెరవేరని కల
 ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినా, ‘పారో’ పాత్ర చేయలేకపోవడాన్ని షర్మిలా ఇప్పటికీ తీరని లోటుగానే భావిస్తుంది. ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో ‘దేవదాస్’ సినిమాను మళ్లీ తెరకెక్కించాలని దర్శక, రచయిత గుల్జార్ సంకల్పించాడు. ధర్మేంద్రను దేవదాసుగా, షర్మిలాను పారోగా (పార్వతి), హేమమాలినిని ‘చంద్రముఖి’గా పెట్టి తీయాలనుకున్నాడు. ఎందువల్లనో అది కార్యరూపం దాల్చలేదు. ‘పారో’ పాత్ర షర్మిలాకు నెరవేరని కలగానే మిగిలిపోయింది.
- పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు