కాదెవరూ ఫ్యాషన్‌కు అనర్హం

9 Nov, 2018 12:51 IST|Sakshi
ప్రిటీ లిటిల్‌థింగ్‌ సంస్థ ఎంపిక చేసిన మోడల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: మీరెప్పుడైనా లావుగా, బొద్దుగా ఉన్నవాళ్లు మోడల్స్‌గా ఉండటం చూశారా ? అన్నీ ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌లోనూ, ఈ-కామర్స్‌ సంస్థల్లోనూ కాస్త సన్నగా, నాజూకుగా ఉన్నవారినే మోడల్స్‌గా తీసుకొని తమ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ పద్దతికి మేము వ్యతిరేకం అంటోంది యునైటెడ్‌ కింగ్‌డామ్‌ (యూకే)కి చెందిన ‘ప్రిటీ లిటిల్‌థింగ్‌’ (పీఎల్‌టీ) అనే రిటైల్‌ సంస్థ. 

తమ ఉత్పత్తులను స్థూలకాయులకు చేరువ చేసేందుకు హెయిలీ బాల్డవిన్‌ అనే సంస్థతో ప్రిటీ లిటిల్‌థింగ్‌ జతకట్టింది. దీనికై నాజూకుగా ఉన్న మోడల్స్‌తో పాటు బొద్దుగా (ప్లస్‌ సైజ్‌) ఉన్న పలువురిని ఎంపిక చేసింది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో నెటిజన్లు ట్విటర్‌లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఆన్‌లైన్‌ సంస్థలు స్థూలకాయులకు సరిపడా సైజు దుస్తులను సరిగా చూపలేకపోవడంతో దుస్తుల ఎంపికలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా దొరికినప్పటికీ అవి అంతగా సంతృప్తిని ఇవ్వడం లేదని అంటున్నారు.

ఈ సందర్భంలో వెలుగులోకి వచ్చిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారికి కావాల్సిన దుస్తులను విభిన్న సైజుల్లో ఉన్న మోడల్స్‌ ద్వారా చేరువ చేస్తామని అంటోంది. అంటే ఇకపై లావుగా కనిపించే మోడల్స్‌ ఫోటోలు సైతం ఆ సంస్థ వెబ్‌సైట్లో కనిపించనున్నాయి. బొద్దుగా ఉన్నవారు ఏ బెరుకు లేకుండా తమకు సరిపడా దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. నెటిజన్లంతా ఈ మార్పును ఆహ్వానించడమే గాక, ఈ నిర్ణయం తీసుకున్న పీఎల్‌టీ సంస్థను ప్రశంసిస్తున్నారు. మహిళలు దీన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఇదో మంచి ఉద్యమమని అభిప్రాయపడుతున్నారు. 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు