అన్నుల మన్నుల

23 Mar, 2015 23:03 IST|Sakshi
అన్నుల మన్నుల

మెరిసేదంతా బంగారం కాదు.. అందరికీ తెలిసిన సామెత. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం మగువలను మురిపింపజేసేదంతా బంగారమే. పసిడితో ప్రాణం పోసుకుని నిగనిగలాడే నగలకు దీటుగా ధగధగలాడే ఆభరణాలు ఫ్యాషన్ సెక్టర్‌లో ఎన్నో ఉన్నాయి. వీనులను మెరిపించే దుద్దులైనా.. మెడను హత్తుకునే నెక్లెస్ అయినా.. మట్టితో తయారై మాణిక్యాల్లా మెరుస్తూ.. పుత్తడి ఆభరణాలను మరిపిస్తున్నాయి. అందుకే  మనసుకు నచ్చి.. తనువుకు నప్పే నగలైతే చాలు.. దాన్ని దేంతో చేశారన్నది  అప్రస్తుతం అంటున్న నారీమణులకు టైట జ్యువెలరీ వరంగా మారింది.
 
 మగువలకు జ్యువెలరీ కంటే ఇష్టమైంది మరొకటి ఉండదు. అందుకే స్వర్ణాభరణాలు ఎన్ని ఉన్నా.. మార్కెట్‌లోకి వచ్చే నయా ట్రెండ్ జ్యువెలరీని పక్కాగా ఫాలో అవుతుంటారు. నల్లపూసల హారం, చంద్రహారం, నెక్లెస్, వంకీలు, జుంకాలు.. బంగారంతో ఒక సెట్ చేయించుకోగలరు. కాస్త సిరిమంతుల ఇంతులైతే.. రెండు డిఫరెంట్ సెట్ల జ్యువెలరీ చేయించుకోగలరు. ఇన్ని ఉన్నా.. ట్రెండ్ మారిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా..! అందుకే 1 గ్రామ్ గోల్డ్ వైపో.. రోల్డ్‌గోల్డ్ వైపో మొగ్గుచూపుతారు. ఈ కేటగిరీ మహిళలను టార్గెట్ చేసిన జ్యువెలరీ డిజైనర్లు టైట టెంపుల్ జ్యువెలరీకి అదనపు సొబగులు అద్ది మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.
 
 మట్టితో మాణిక్యాలు..


ప్రజెంట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ.. ట్రెడిషనల్ లుక్ మిస్ కాకుండా మన ముందుకు వచ్చిన మోడల్ టైట టెంపుల్ జ్యువెలరీ. టైట బొమ్మల మాదిరి ఈ ఆభరణాలు కూడా మట్టితో తయారైనవే. మన్నుతో మన్నికైన ఆభరణాలు చేయడం అంటే మామూలా..! అందుకే బంగారు ఆభరణాలు చేసినంత జాగ్రత్తగా వీటిని తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవి వంటి దేవతా రూపాలు, విభిన్న డిజైన్లను లాకెట్లుగా మలిచి.. వాటికి రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, రకరకాల రత్నాలు పొందికగా అటాచ్ చేసి జ్యువెలరీ లుక్ తీసుకొస్తారు. మట్టితోనే జుంకాలు సైతం తయారు చేస్తున్నారు. ఇన్నోవేటివ్ లుక్ సొంతం చేసుకున్న ఈ మట్టి ఆభరణాలను యువతుల నుంచి అమ్మమ్మల వరకు అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
 
హ్యాండిల్ విత్ కేర్..
 
అన్ని రకాల సంప్రదాయ వస్త్రశైలులకూ ఈ జ్యువెలరీ అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్యాషన్ వేరింగ్‌కు నప్పుతుండటంతో యువతులు కూడా వీటిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. చీరకట్టులో, చుడీదార్‌లో, లంగాఓణి, గాగ్రాచోలీ ఇలా ఏ రకమైన డ్రెస్సింగ్ చేసుకున్నా వాటిపైకి ఇవి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. పైగా ధర తక్కువగా ఉండటంతో.. పండుగలకు, పబ్బాలకు తమ డ్రెస్సింగ్‌కు మ్యాచ్ అయ్యే మోడల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు ఎప్పుడూ బంగారంలో మెరిసి బోర్ కొట్టిన వారు కాస్త డిఫరెంట్‌గా కనిపించడానికి కూడా వీటికి తమ జ్యువెలరీ సెట్లలో చోటిస్తున్నారు. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డిజైనర్లు. మట్టితో చేసినవి కావడంతో ఏ మాత్రం చేజారినా.. పగిలే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్.. హ్యాపీ విత్ వేర్.         శిరీష చల్లపల్లి
 
 

మరిన్ని వార్తలు