నెట్ కేఫ్ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు...

29 Jul, 2013 03:34 IST|Sakshi
నెట్ కేఫ్ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు...
 సొంతంగా కంప్యూటర్ కూడా లేకుండానే  వెబ్‌సైట్ పెట్టి కంపెనీ ప్రారంభించాడు. సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకముందే వందడాలర్ల ఆదాయం సంపాదించాడు. పద్నాలుగు సంవత్సరాల వయసుకే కంపెనీ సీఈవో అయ్యాడు. 12 ఏళ్లు గడిచేసరికి ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్రముఖ పారిశ్రామికవేత్తల సరసన నిలిచాడు. అతడే బెంగళూరుకి చెందిన సుహాస్ గోపీనాథ్. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ...
 
 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులను ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2008-2009) గా ఎంపిక చేసింది. ఇందులో లూసియనా గవర్నర్ బాబీ జిందాల్, హాలీవుడ్ స్టార్ లియొనార్డో డి కాప్రియో, సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్, బ్రూనై ప్రిన్స్ తదితరులున్నారు. ఈ స్థాయి వ్యక్తులు సభ్యులుగా ఉన్న ‘గ్లోబల్ లీడర్స్’లో ఒక భారతీయ యువకుడి పేరు అందరి దృష్టినీ ఆక ర్షించింది. ఆ యువకుడే... 22 ఏళ్ల వయసులో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చరిత్రలో అతి పిన్న వయసు సభ్యునిగా ఎన్నికైన సుహాస్. 
 
 సుహాస్ మధ్యతర గతి కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి ఇండియన్ ఆర్మీలో సైంటిస్ట్. సుహాస్ బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌లో చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి వెటర్నరీ సైన్స్ పట్ల సుహాస్‌కు ఆసక్తి ఉండేది. సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడే విస్తృతం అవుతున్న ఇంటర్నెట్ గురించి స్నేహితుల మధ్య జరిగే చర్చ సుహాస్‌లో దానిపై ఆసక్తిని రేకెత్తించింది. దాని కథేంటో తెలుసుకుందామంటే.. ఇంట్లో కంప్యూటర్ లేదు. బయట నెట్‌కేఫ్‌కు వెళ్లి గంటగంటకూ సొమ్ము చెల్లించి నెట్ బ్రౌజ్ చేద్దామంటే పాకెట్ మనీ ఆ స్థాయిలో ఉండేది కాదు. 
 
ఈ సమయంలో ఒక నెట్ సెంటర్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌కు కుదిరాడు. అది సుహాస్‌కు ఒక వరంగా మారింది. ఈ సమయంలో సొంత ఆసక్తితో వెబ్‌సైట్ బిల్డింగ్‌పై పట్టు సంపాదించాడు సుహాస్. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు గ్లోబల్స్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఆన్‌లైన్ మార్గంలో వెబ్‌సైట్లను క్రియేట్‌చేసే అవకాశాలను సంపాదించుకున్నాడు. అలా 14ఏళ్ల వయసులో ‘గ్లోబల్స్ ఐఎన్‌సీ’ సీఈవో హోదాలో సుహాస్ వందడాలర్ల సొమ్మును సంపాదించాడు. అప్పటికి సుహాస్‌కు సొంతంగా బ్యాంక్ అకౌంట్ కూడా లేదట! ఆ తొలి సంపాదనతో సుహాస్ ఒక కంప్యూటర్ కొనుక్కొన్నాడు. అమెరికాకు చెందిన ఒక సంస్థ సుహాస్ ప్రతిభను మెచ్చి జాబ్ ఆఫర్ కూడా ఇచ్చింది. 
 
అయితే దాన్ని తిరస్కరించి సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డాడు. సుహాస్‌కు 17 ఏళ్ల వయసున్నప్పుడు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఒక స్పానిష్ కంపెనీతో ఒప్పందం కోసం ప్రయత్నించాడు. అయితే తనకు స్పానిష్ రాకపోవటంతో ఆ కంపెనీ వెనక్కు తగ్గింది. దీంతో సుహాస్ స్పానిష్ లాంగ్వేజిపై పట్టున్న ఐదుగురు గ్రాడ్యుయేట్లను హైర్ చేసి తన కంపెనీని విస్తరించాడు. అలా మొదలైంది గ్లోబల్స్ ఐఎన్‌సీ ప్రస్థానం. ఇప్పుడు ఈ కంపెనీ కార్యకలాపాలు అమెరికా, ఇండియా, కెనడా, జర్మనీ, ఇటలీ, యూకే, స్పెయిన్, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా మధ్యప్రాచ్య దేశాల వరకు విస్తరించాయి. ఇలా సుహాస్ అతి పిన్నవయసులో ఒక కంపెనీ సీఈవోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాన్ని అత్యున్నతస్థాయికి చేర్చాడు. 
 
 నెట్‌కేఫ్ నుంచి కంపెనీ కార్యకలాపాలు నడిపిన రోజుల్లో  అది పెద్ద టర్నోవర్ స్థాయికి ఎదుగుతుందని ఊహించలేదని సుహాస్ అంటాడు. ఈ 26 ఏళ్ల యువకుడు ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఐసీడీ అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యుడి హోదాలో ఉన్నాడు. 2007లో యూరోపియన్ పార్లమెంట్ అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ఇతడికి ‘యంగ్ అచీవర్ అవార్డు’ను ఇచ్చింది. అబ్దుల్‌కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయనను కలిసే అవకాశం వచ్చింది సుహాస్‌కు. సుహాస్ గురించి తెలుసుకున్న కలాం ఆ యువకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
 
 అతి పిన్నవయసులో ఒక కంపెనీ సీఈవోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాన్ని అత్యున్నతస్థాయికి చేర్చాడు. నెట్‌కేఫ్ నుంచి కంపెనీ కార్యకలాపాలు నడిపిన రోజుల్లో  అది పెద్ద టర్నోవర్ స్థాయికి ఎదుగుతుందని ఊహించలేదని సుహాస్ అంటాడు. 
 
మరిన్ని వార్తలు