గేట్ వే ఆఫ్ టాలెంట్‌

9 Nov, 2014 23:12 IST|Sakshi
గేట్ వే ఆఫ్ టాలెంట్‌

సిటీలో సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణానగర్. రంగుల లోకంలో కాలుమోపడానికి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా ముందుగా వాలిపోయేది ఈ కృష్ణానగర్‌లోనే. ఒక్క చాన్స్ కోసం ఏళ్లకేళ్లు అక్కడే తిష్టవేస్తారు. కృష్ణానగర్ తర్వాత సిటీలో సినీమాయ చుట్టూ తిరిగే స్పాట్ ఇంకోటుంది. అదే గణపతి కాంప్లెక్స్. ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే ఔత్సాహికులతో గణపతి కాంప్లెక్స్ గేట్ వే ఆఫ్ టాలెంట్‌గా మారింది. శ్రీనగర్‌కాలనీలోని ఈ కాంప్లెక్స్ దగ్గరికి చేరిన అందరి లక్ష్యం సినిమాలో చాన్స్ కొట్టేయడమే.
 
రంగుల ప్రపంచంలో ఎంట్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరూ ఈ గణపతి కాంప్లెక్స్‌ను తమ కలలు తీర్చే కల్పతరువుగా భావిస్తుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆశావహులందరూ ఇక్కడికి చేరుకుంటారు. పాతవారితో పిచ్చాపాటీలు, కొత్తవారితో పరిచయాలు.. ప్రొడక్షన్ వారితో చేసే విన్నపాలు.. ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుందన్న ఆరాలు.. రోజంతా ఇలాగే సాగిపోతుంది. ఫలానా పనికి ఫలానా వ్యక్తి పక్కాగా పనికొస్తాడని బల్లగుద్ది మరీ రికమండ్ చేసేవాళ్లు కొందరుంటారు.
 
మస్తీ అడ్డా
గణపతి కాంప్లెక్స్ నిర్మించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. ప్రధానంగా పుష్కరకాలం నుంచి ఇది కేరాఫ్ సినిమాగా మారింది. సినిమా కేంద్రం ఇందిరానగర్‌కు దగ్గరగా ఉండటం. నీడనిచ్చే చెట్లు, కూర్చోవడానికి మెట్లు.. ఏ వేళలో అయినా వేడివేడిగా ఉపాహారం అందించే టిఫిన్ సెంటర్స్, బుర్ర వేడెక్కినప్పుడు గరం గరం చాయ్ అందించే కేఫ్‌లు ఇక్కడి విశేషాలు. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఇళ్ల అద్దెలు, బ్యాచిలర్స్‌కు కూడా గదులు లభించడం గణపతి కాంప్లెక్స్ ఏరియాను ఆకర్షణీయమైన అడ్డాగా మార్చేసింది.
 
కళల తీరం..
24 కళల సినిమాలో ఏ ఒక్క రంగంలో అయినా అవకాశం దొరక్కపోదా అని ఇక్కడ ఎందరో ఎదురుచూస్తుంటారు. దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్, డ్యాన్స్ తదితర విభాగాల్లో చాన్స్ కోసం వచ్చిన వారు గణపతి కాంప్లెక్స్‌నే నమ్ముకుంటారు. వీరిలో ఎక్కువ మంది తెర మీద కనిపించడం కన్నా.. తెర వెనుక సత్తాచాటే ల క్ష్యంతో వచ్చిన వారే. ఇక ఈ అడ్డా నుంచి అవకాశాలు పొంది సక్సెస్ కొట్టిన ఎందరో నటులు, సాంకేతిక నిపుణులు గణపతి కాంప్లెక్స్‌ను సొంత ఇంటిలా భావిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడ వాలిపోయి పాత మిత్రులతో ముచ్చట్లలో మునిగిపోతారు.
 
అలా మారింది..
కొత్త వారికి, సాంకేతిక నిపుణులకు ఒక కేంద్రం ఉంటే బాగుంటుందని భావించిన కొందరు సీనియర్లు తరచూ ఇక్కడకు వచ్చి కూర్చోవడంతో ఇది సినిమా వారి అడ్డాగా మారింది.  నేను ఇదే కాంప్లెక్స్ దగ్గర ఏళ్లకేళ్లు అవకాశాల కోసం ఎదురు చూశాను. అలా పరిచయాలు పెరిగి ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. నా సక్సెస్‌లో కాంప్లెక్స్ పాత్ర మరచిపోలేనిది.
 
కాంప్లెక్స్‌కు రావాల్సిందే..
నేను ప్రతి రోజూ ఇక్కడికి వస్తుంటాను. ఏ కంపెనీలో అవకాశాలు ఉన్నాయి.ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడి నుంచి అవకాశాలు పొందిన వారు ఉన్నంతలో.. ఇతరులను రికమండ్ కూడా చేస్తుంటారు.
 
- మురళీధర్, నటుడు

మరిన్ని వార్తలు