పసి హృదయాలపై గాయం

6 Feb, 2015 23:53 IST|Sakshi
పసి హృదయాలపై గాయం

నేటి బాలికలే రేపటి మహిళలు. మరి ఆ రేపటి మహిళలు ఇప్పుడెంత సేఫ్‌గా ఉన్నారు? ఇంట్లోనో, స్కూల్లోనో, ఆట స్థలాల్లోనో ఎక్కడో ఓ చోట... ఏదో ఓ సమయంలో వేధింపులకు గురవుతున్నారు. బంధువులో, ఇరుగుపొరుగు వారో... ఎవరైతేనేం మృగాళ్లు... ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారులను మొగ్గలోనే చిదిమేస్తున్నారు. మన నగరమూ అందుకు మినహాయింపేమీ కాదు. దేశం మొత్తం బేటీ బచావో అంటోంది? మరి హైదరాబాద్ మాటేమిటి? రానున్న మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారుల స్థితిగతులపై వరుస కథనాలు..
 ..:: సరస్వతి రమ
 
నగరంలోని పాతబస్తీ... షాహీన్ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్. మధ్యాహ్న సమయం... ఓ పదేళ్ల అమ్మాయి చాపమీద ఓ పుస్తకాన్ని పరుచుకుని, వంగి తదేకంగా పెన్సిల్‌తో డ్రాయింగ్ వేస్తోంది. పక్కనే మరో అమ్మాయి ఈ లిటిల్ ఆర్టిస్ట్‌కి సలహాలిస్తోంది. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు. ఒక అమ్మాయి పేరు సనా. పన్నెండేళ్లున్న వాళ్లక్క పేరు నేహ. ఇక్కడెందుకున్నారు? అనేగా సందేహం. నేహ, సనా మెహమూదా బేగం పిల్లలు. పాతబస్తీలోని తలాబ్‌కట్టలో ఉంటుందీ కుటుంబం. ఎనిమిదేళ్ల కిందట నేహ, సనా తండ్రి చనిపోయాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది మెహమూదా బేగం. ఆ ఇద్దరికీ ఓ పాప. జీవితం సాఫీగా సాగిపోతే వాళ్ల ప్రస్తావనే ఇక్కడ వచ్చేది కాదు.
 
ఏమైంది?

కొన్నాళ్లకి సవతి తండ్రి ఇస్మాయిల్ అంటేనే నేహ, సనాలిద్దరూ వణికిపోసాగారు. కారణం నేహతో సవతి తండ్రి ఇస్మాయిల్ ప్రవర్తన. ‘అబ్బా(నాన్న) సిగరెట్ కాల్చి అక్క చేతులు, నుదుటిమీద వాతలు పెట్టేవాడు. ఓ సారైతే అక్క బట్టలు చించి తననేదో చేయబోయాడు’ అని ఆ భయంకరమైన ఘటనను వణుకుతూ గుర్తు చేసుకుంది సనా. భర్త ప్రవర్తన చూసిన మెహమూదా, షాహీన్ సంస్థ సహాయంతో పిల్లలిద్దరినీ హాస్టల్‌లో వేసి చదివించాలనుకుంది.

విషయం పసిగట్టిన ఇస్మాయిల్ ఎత్తువేసి తన కూతురితోపాటు సనాని తీసుకుని బీజాపూర్ వెళ్లాడు. తను చెప్పినట్లు వినకపోతే సనా జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అంతేకాదు పెద్ద కూతురు నేహ పట్ల తనకున్న కోరికను చెప్పాడు. అసలు మెహమూదాను పెళ్లి చేసుకుందే నే హ కోసమని మనసులో ఉన్న దురుద్దేశాన్ని వెళ్లగక్కాడు. భర్త దురాలోచన విన్న మెహమూదాకు వెన్నులోంచి వణుకొచ్చింది. ఎలాగైనా తన పిల్లలను రక్షించుకోవాలనుకుంది.

భర్తతో పోరాటానికి సిద్ధమైంది. షాహీన్ నిర్వాహకురాలు జమీలా నిషాత్ సహకారంతో భవానీ నగర్ పోలీస్ స్టేషన్‌లోభర్త మీద కిడ్నాప్ కేసు పెట్టింది. మూడు రోజుల తరువాత పోలీసులు ఇస్మాయిల్‌ను రప్పించారు పిల్లలతో సహా. అయితే పోలీసుల కన్నుగప్పి భార్యా, పిల్లలను తీసుకొని తలాబ్‌కట్టనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు ఇస్మాయిల్. అతనితో ఎప్పటికైనా ప్రమాదమేననుకున్న నేహ, సనాలిద్దరిని తీసుకుని షాహీన్ సంస్థ గడప తొక్కింది.
 
ఇప్పుడు...

గతం తాలూకు భయం వీడి నేహ, సనాలిద్దరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. హాయిగా చదువుకుంటున్నారు.‘బాగా చదువుకుని పెద్దయ్యాక టీచర్‌నవుతాను. నాలాంటి పిల్లలకు చదువు చెప్తాను. ఆడపిల్లగా పుట్టినందుకు ప్రౌడ్‌గా ఫీలవమని చెప్తాను’ అని అంటుంది నేహ. ‘అబ్బా.. రోజూ తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. ఇంట్లోకి డబ్బులిచ్చేవాడు కాదు. ఎప్పడూ గొడవలే. భయంభయంగా గడిపేవాళ్లం. ఇప్పుడు మాకు బాగుంది. నచ్చిన పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను నాకు నచ్చిన బొమ్మలేసుకుంటున్నాను. పెద్దయ్యాక మంచి ఆర్టిస్టు కావాలనుకుంటున్నా’ అని చెబుతుంది సనా... వేసే బొమ్మ మీద నుంచి దృష్టి మరల్చకుండానే!

>
మరిన్ని వార్తలు