విచ్చలవిడిగా వాడేస్తున్నారు

28 Mar, 2018 09:04 IST|Sakshi

లండన్‌ : యాంటీబయాటిక్స్‌ వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతుండటంతో ఇవి నిరుపయోగంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో సంపన్నదేశాల్లో అధికంగా వాడే యాంటీబయాటిక్స్‌ను ఇప్పుడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారని 76 దేశాల్లో చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. 2015లో రోజుకు ప్రపంచవ్యాప్తంగా 3500 కోట్ల డోసులు వాడారని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో తేలింది.

గత 15 ఏళ్లలో యాంటీబయాటిక్స్‌ వాడకం 40 శాతం పెరిగింది. స్పెయిన్‌, గ్రీస్‌ దేశాల్లో యాంటీబయాటిక్స్‌ వాడకం ఎక్కువగా ఉండగా, భారత్‌, పాకిస్తాన్‌ వంటి ఆసియా దేశాల్లోనూ వీటి వాడకం గత 15 ఏళ్లలో విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. స్పెయిన్‌, గ్రీస్‌ దేశాల్లో ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే యాంటీబయాటిక్స్‌ ఇచ్చేస్తున్నారని పరిశోధన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

బ్యాక్టీరియాతో తలెత్తే ఇన్‌ఫెక్షన్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి ఉండగా, వైరస్‌ వల్ల వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటికి సైతం అనవసరంగా యాంటీబయాటిక్స్‌ను ప్రిస్క్రైబ్‌ చేస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను పరిమితుల మేరకే వాడాలని, అనవసరంగా వీటిని తీసుకుంటే అవి పనిచేయకపోగా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ అంట్‌వెర్ప్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హెర్మన్‌ గూసెన్స్‌ చెప్పారు.

యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించేందుకు మార్గాలను అన్వేషించాలని, తప్పని పరిస్థితుల్లోనే వీటిని వాడేలా మార్గదర్శకాలు రూపొందించాలని అథ్యయన నివేదిక రూపొందించిన అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ ప్రతినిధి డాక్టర్‌ ఎలి క్లెన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు