గ్రేట్ క్రియేటర్స్

26 Aug, 2014 00:36 IST|Sakshi
గ్రేట్ క్రియేటర్స్

కల్మషం లేని ఆ పిల్లల నవ్వులు మర్యాదరామన్నను కట్టిపడేశాయి. మనసున మెదిలిన రూపాలను అందంగా తీర్చిదిద్దిన ఆ విద్యార్థులు భీమవరం బుల్లోడి మనసు దోచుకున్నారు. మానసిక వైకల్యాన్ని ఎదిరిస్తూ.. కళలో రాణిస్తున్న బేగంపేటలోని శ్రద్ధ సబూరి స్కూల్ విద్యార్థులతో హీరో సునీల్  సోమవారం సందడిగా గడిపారు. పాఠశాల మాతృ సంస్థ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమర్థ్ వొకేషనల్ స్కూల్‌లో శిక్షణ పొందిన 200 మంది విద్యార్థులు రూపొందించిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు సునీల్ హాజరయ్యారు. పేపర్ ప్రొడక్ట్స్, జూట్ బ్యాగ్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, జెల్లీ క్యాండిల్స్ వంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు.
 
నచ్చే కొంటున్నా...
విద్యార్థులు రూపొందించిన ప్రొడక్ట్స్ చూసి సునీల్ ముచ్చటపడ్డారు. అక్కడి ఐటెమ్స్ కొనుగోలు చేశారు. మానసిక వైకల్యాన్ని అధిగమిస్తూ ప్రతిభ చూపిన ఈ విద్యార్థులను చూసిన సునీల్ ఎమోషనల్ అయ్యారు. వాటిని ఎలా తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. ‘వీళ్ల సృజనాత్మకత గొప్పది. నవ్వులో ఎంత ప్యూరిటీ ఉందో.. పనిలోనూ అంతే క్వాలిటీ ఉంది. వారి మీద జాలితో ఈ వస్తువులు కొనలేదు.. ఆ ప్రొడక్ట్స్ నచ్చడంతోనే కొన్నాన’ని చెప్పాడు సునీల్. విద్యార్థులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతిమలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఎక్స్‌పో ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
-  సిరి

>
మరిన్ని వార్తలు