గురూపదేశం వల్లనే మన మనోనేత్రాలు తెరచుకుంటాయి

25 Jul, 2013 03:39 IST|Sakshi
గురూపదేశం వల్లనే మన మనోనేత్రాలు తెరచుకుంటాయి
 నక్షత్రాలన్నీ కలిపి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఏ మాదిరిగా ఇవ్వగలుగుతున్నాడో అదే మాదిరిగానే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. సద్గురువు చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధకాలు.
 
 మనిషి ఎన్ని తెలివితేటలు ఉన్నవాడైనా, ఎంత పుస్తకజ్ఞానం సంపాదించినా గురుకృప లేకపోతే అవన్నీ వ్యర్థమే. అందుకే యుగయుగాలు భారతీయ సంస్కృతిలో గురువుకున్న స్థానం ఎంతో ఉన్నతం.  వ్యాసుడు మహాభారత రచనతోపాటు అష్టాదశ పురాణాలను లోకానికి అందించాడు. అవే మన హైందవ ధర్మానికి పునాదులు. ఇక గజిబిజిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి ఆధ్యాత్మికంగా నిర్వర్తించాల్సిన విధులను తన శిష్యుల ద్వారా ప్రబోధించారాయన. 
 
 ఆదిశంకరాచార్యులవారు వైదిక ధర్మాలను గాడిలో పెట్టి అసమాన, అనుపమానమైన మంత్రపుష్పాలను అందించారు. ఈ క్రమంలో సాయిబాబా కూడా సకాలంలో షిర్డీ చేరారు. కట్టు తప్పిన మానవ ధర్మాన్ని ఆయన చక్కదిద్దారు.  మానవత్వమే అసలైన మతమని ఉపదేశించారు. భగవద్గీత, జ్ఞానేశ్వరి వంటి సద్గ్రంథాలలోని క్లిష్టమైన అంశాలను జనులకు అర్థమయ్యేలా సూటిగా, సరళంగా చెప్పారు.
 
 గురువు ద్వారానే మనం భగవంతుని దర్శించుకోగలం. గురూపదేశం వల్లనే మన మనోనేత్రాలు తెరచుకుంటాయి. అప్పుడవి సత్యాన్ని దర్శించగలుగుతాయి. ఈ పనులు చేయటానికే గురువులు అవతరిస్తారు. అవతార కార్యం పూర్తి కాగానే ఎంత నెమ్మదిగా వచ్చారో అంతే శాంతంగా వెళ్లిపోతారు. అందుకే గురువు మానవరూపంలో ఉన్న దైవం.
  
 జీవిత పరమావధి సాధించాలనే మన ధ్యేయం సత్వరమే ఫలించు మార్గం ఏమిటంటే, వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువులను సంపాదించటం.  నక్షత్రాలన్నీ కలిపి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఏ మాదిరిగా ఇవ్వగలుగుతున్నాడో అదే మాదిరిగానే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. సద్గురువు చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధకాలు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహాలను స్వాధీనంలో ఉంచుకోవటం, అహంకారం లేకుండటం తదితర శుభలక్షణాలను సద్గురువు ఆచరణలో ప్రత్యక్షంగా చూసి భక్తులు ఆ లక్షణాలనూ నేర్చుకోగలుగుతారు. సద్గురువుల పావన చరితలు భక్తుల మనస్సులకు ప్రబోధం కలుగ జేసి పారమార్థికంగా ఉద్ధరిస్తాయి. 
 
 నిజమైన గురువులు శిష్యులకు ఆసనాలు కానీ, యోగాభ్యాసాలు కానీ, మంత్రోపదేశాలు కానీ చేయరు. ఇష్టదైవ నామాన్ని నిత్యం స్మరించుకోవాలని మాత్రం చెబుతారు. అలా చే స్తే సర్వబంధాల నుంచి విముక్తులై, స్వాతంత్య్రం పొందుతారని భక్తులకు ఉపదేశిస్తారు. పంచాగ్నుల మధ్య కూర్చోవటం, యజ్ఞయాగాదులు చేయటం, మంత్రజపాలు చేయటం, అష్టాంగయోగాలు ఆచరించటం మొదలైనవి కొందరికి మాత్రమే వీలయ్యే పనులు. తక్కినవారు వాటిని ఆచరించటం సాధ్యం కాదు. వారికవి ఉపయక్తాలు కూడా కావు. ఆలోచించటమే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు. 
 
 మనసుకు ఇంద్రియ విషయం ఏదైనా గుర్తుకువస్తే దాని గురించే ఆలోచిస్తుంది. ఉదాహరణకు గురువు గురించే చింతిస్తే, గురువే జ్ఞప్తికి వస్తారు. ఇపుడు మనం గురువు యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని మననం చేసుకుంటున్నాం. గురులీలలను శ్రద్ధగా వింటున్నాం. గురువును నిత్యం గుర్తుంచుకోవాలంటే ఆయన నామస్మరణం చేయాలి. గురువు రూపాన్ని హృదయంలోనే ప్రతిష్ఠించుకోవటానికి అదే సహజమైన మార్గం. అదే మనం చేసే గురుపూజ. గురువును ఆశ్రయించటం మునుపటిరోజుల్లా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ మనకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో గురువులు ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు. 
 
మహాత్ములు ఉన్నారు. వారిని మనసులో ప్రతిష్ఠించుకోవటమే గురుపూజకు తొలి సోపానం. గురుకృప కావాలని తలచిన మరుక్షణమే గురుదర్శనం కలుగుతుందని శాస్త్రవచనం. ఎవరైనాసరే తమకు గల అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలంటే ముందుగా తమలో జ్ఞానదీపం వెలిగించే సద్గురువును ఆశ్రయించాలి. ఉదాహరణకు సాయిబాబా జీవితచరిత్ర మొత్తం సద్గురు చరిత్రే. ఆయన ఎన్నో మంచి విషయాలు బోధించారు. వాటన్నింటినీ ఆచరించి మానవత్వం బాటలో నడవటమే మనం ఆయనకు సమర్పించే గురుదక్షిణ.
 
 - డాక్టర్ కుమార్ అన్నవరపు
మరిన్ని వార్తలు