3బ్రదర్స్ కార్పొరేట్‌కి కత్తెరేశారు...

19 Feb, 2015 23:13 IST|Sakshi
3బ్రదర్స్ కార్పొరేట్‌కి కత్తెరేశారు...

సూపర్‌మార్కెట్స్ దెబ్బకి కిరాణా కొట్లు... డిజైనర్స్ రాకతో దర్జీలు...  వరుసపెట్టి కొత్త ఆటంబాంబులు పోటీకొస్తుంటే తట్టుకోలేక పాత సీమటపాకాయలు  అల్లల్లాడిపోయాయి. బరిలో నిలవలేక తుస్సుమనేశాయి.  కొన్ని ముందే దాసోహమైపోయి ‘పెద్ద’ నీడలో జేరిపోయాయి. కొన్ని మాత్రం గ్లోబలైజేషన్  తెచ్చిన ముప్పును తెలివిగా అందిపుచ్చుకుని తమ ఎదుగుదలకి పైకప్పుగా మార్చుకున్నాయి.

ఇప్పుడు తాముసైతం ఆటంబాంబులై మోతమోగిస్తున్నాయి. హైస్కూల్ చదువు దాటని
ముగ్గురు అన్నదమ్ములు... ఆటంబాంబులై సాధించిన సక్సెస్ అలాంటిదే.
- ఎస్.సత్యబాబు
 
‘మాది కరీంనగరన్నా. నాయీబ్రాహ్మలం. నాన్న చిన్నగున్నప్పుడే సిటీకి వచ్చేసి షాపులో కటింగ్ పనిల జేరిండు. చిన్నంగా.. ఎట్లనో చేసి కొత్తపేట మారుతీనగ ర్ల సొంతంగా షాపు పెట్టిండు. అయినా ఆదాయం చాలక మా చిన్నతనంలో మస్తు కష్టాలు పడుతుండె’’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు అలియాస్ శ్యామ్. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎన్‌ఆర్ బీ హెయిర్ అండ్ బ్యూటీ పేరుతో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆ ఆధునిక పార్లర్‌లో కూర్చుని మాట్లాడుతున్న ఆ పాతికేళ్ల కుర్రాడిని చూస్తే.. సిటీలో అలాంటివి మరో 3 పార్లర్‌లతో పాటు ఏకంగా ఒక హెయిర్ స్టైల్స్ ట్రైనింగ్ అకాడమీ సైతం సొంతంగా నిర్వహిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరని చెబితే వెంటనే నమ్మడం కష్టం. ‘ఈ స్టేజికి రానీకి చేయని కష్టం లేదన్న’ అంటూ చెప్పుకొచ్చాడు నందు.
 
చిన్న షాప్... చింతలు తీర్చలేదు...

మారుతీనగర్‌లో షాప్ మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత పార్లర్‌ల ధాటికి  పాతకాలపు క్షవరం కొట్టుకు ఆదరణ తగ్గిపోయింది. కుటుంబం నడపడం కష్టమైపోయింది.  నందు తండ్రికి సొంత చెల్లెళ్ల పెళ్లి బాధ్యతలు కూడా మీదపడ టంతో.. నందు, రాజు, బబ్లూ (అన్నదమ్ములు)లు చిన్న వయసులోనే సంపాదన కోసం రోడ్డెక్కక తప్పలేదు. ‘నేను సెలూన్‌లో, తమ్ముళ్లలో ఒకడేమో కార్లు తుడిచి, మరొకడేమో కోఠిలో డాంబర్ గోళీలు (బొద్దింకల మందు) అమ్ముతుండె’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు.

ఈ పనుల కారణంగా ముగ్గురి చదువూ హైస్కూల్ దాటలేదు. ఈ పరిస్థితుల్లో.. సిటీలోని బంజారాహిల్స్‌లో ఉన్న జావెద్‌హబీబ్ సెలూన్‌లో రాజుకి పని దొరికింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే.. పార్లర్స్‌కి, బార్బర్‌షాప్‌లకు తేడా ఏమిటి? అక్కడ ఉంటున్నవేమిటి? తాము ఇవ్వలేకపోతున్నవేమిటి అనేది అర్థమైంది. అది అయ్యాక... ఎలాగైనా తాము కూడా అందాలను మెరిపించే పనిలో ఆధునిక విపణి అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకున్నారు.
అప్పుచేసి.. హెయిర్ స్టైలింగ్ కోర్స్..
ఇల్లు గడవడమే చాలా కష్టం. ముంబై వెళ్లి హెయిర్‌స్టైల్ కోర్స్ చేయాలంటే వేలకు వేలు ఎలా తేవాలి? ‘ఆడ్నించి ఈడ్నించి తెచ్చినం. అమ్మ పుస్తెలు, కమ్మలు అమ్మినం. దొరికిన కాడ అప్పులు చేసినం. ఎట్టయితేనేం... ముంబైలో కోర్సులో జేరినం. వాళ్ల సెలూన్ల జీతానికి జేస్తమని రాసిచ్చి.. ఒక్కరికి కట్టిన ఫీజుతో ఇద్దరం కోర్సు పూర్తి జేసినం’ అంటూ వివరించాడు నందు. ముంబై వెళ్లడం, హెయిర్‌స్టైల్స్ కోర్స్ పూర్తి చేయడం.. ఇవన్నీ ఈ అన్నదమ్ముల ఆలోచనాధోరణిని సమూలంగా మార్చేశాయి. కోర్స్ అనంతరం సిటీలో పేరున్న సెలూన్‌లో జీతానికి చేరి నాలుగేళ్లపాటు మరింత అనుభవాన్ని సంపాదించారు.  

అదే సమయంలో జావేద్ హబీబ్ ఫ్రాంఛైజీ ఆఫర్ వీరిని కోరి వచ్చింది. అయితే ఆ బ్రాండ్ పార్లర్ పెట్టాలంటే లక్షలతో పని. కానీ ఈ అన్నదమ్ముల పనితీరు అప్పటికే తెలుసు కాబట్టి... రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తామన్నారు జావేద్‌హబీబ్ బ్రాండ్ వాళ్లు. మంచి అవకాశం అనుకున్నారీ బ్రదర్స్. వద్దు వద్దంటూ వారిస్తున్న కుటుంబ సభ్యుల్ని అతి కష్టమ్మీద ఒప్పించి... దిల్‌సుఖ్‌నగర్ రోడ్, మూసారాంబాగ్‌లోని ఆండాల్ బిల్డింగ్ పక్కన, లెజెండ్ బిల్డింగ్‌లో ఫ్రాంఛైజీ స్టార్ట్ చేశారు.

మూడేళ్లు గడిచాక.. ఫ్రాంఛైజీగా చెల్లిస్తున్న 20 శాతం మొత్తం గాని మిగిల్చగలిగితే.. తమ కస్టమర్స్‌కి మరింత తక్కువ ధరలకే సేవలు అందించవచ్చునని అనిపించింది. దాంతో మరోసారి ధైర్యం చేశారు. ఫ్రాంఛైజీని వదులుకుని తమ ముగ్గురి పేర్లూ కలిపి ఎన్‌ఆర్‌బీ బ్రాండ్ నేమ్‌ని స్టార్ట్ చేశారు. తక్కువ ధరలకే పార్లర్ సర్వీసెస్ ఆఫర్ చేశారు. దీంతో షార్ట్‌టైమ్‌లోనే పార్లర్‌కు మంచి పేరొచ్చింది.
 
కెరీర్ గైడ్స్..
ఒక విజయం మరిన్ని సంకల్పాలకు నాంది అన్నట్టు అదే ఊపులో కొత్తపేట, ఉప్పల్, ఐడీపీఎల్... ప్రాంతాల్లోనూ బ్రాంచీలు నెలకొల్పారు. రెండేళ్ల క్రితమే జావేద్ హబీబ్ ట్రైనింగ్ అకాడమీకి ఫ్రాంఛైజీ తీసుకుని పార్లర్‌లో కెరీర్‌ను వెతుక్కుంటున్న వారికి ఆశాదీపంలా మారారు. సర్టిఫికెట్ కోర్సు చేయడానికి తాము పడిన కష్టాలు బాగా గుర్తుంచుకున్న ఈ అన్నదమ్ములు ఆ పరిస్థితిని కొంతమందికైనా తప్పించాలని, తక్కువ ఫీజులతో శిక్షణ అందిస్తున్నారు.

కులమతాలకు అతీతంగా ఇప్పటికే వందల మంది బ్యూటీ ఇండస్ట్రీలో కెరీర్ అవకాశాలు అందుకునేలా చేశారు. కేవలం వీరి రిఫరెన్స్‌తో మరెంతో మందికి ఉద్యోగాలొచ్చాయి.  ఆర్థికంగా స్థోమత లేని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా కూడా శిక్షణనిస్తున్నారు. ఆసక్తి కలవారు 9908512905 ఫోన్‌నంబర్‌ను సంప్రదించవచ్చు.  ‘‘ఇంకా పార్లర్‌లు ఓపెన్ జేసి, స్టేట్‌లెవల్లో మస్తు పేరు సాధించాలె’’ అంటూ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న ఈ సోదర త్రయం ఆత్మవిశ్వాసం చూస్తుంటే అనుకున్నది సాధించడానికే పుట్టారా అనిపించకమానదు.

మరిన్ని వార్తలు