హార్లీ.. జాలీ

30 Oct, 2014 02:31 IST|Sakshi
హార్లీ.. జాలీ

రెక్కలు విప్పి ఆకాశంలో విహరించే పక్షిలా... ప్రపంచాన్ని స్వేచ్ఛగా చుట్టి రాగలిగితే ఎలా ఉంటుంది! అంతటి అనుభూతి... ఆనందం... హార్లీ డేవిడ్‌సన్ బైక్స్‌పై దూసుకుపోతుంటే కలుగుతుంది. గంభీరమైన రూపం... నడిచేటప్పుడు గర్జించే శబ్దం... ఓహ్..! ఆ ఫీలే వేరు! ఈ ఫీల్‌ను ఆసాంతం ఆస్వాదిస్తున్నారు ‘హార్లీ డేవిడ్‌సన్ హైదరాబాద్ గ్రూప్’ సభ్యులు. మూడు తరాలుగా వీరు ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్‌పై రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
 
చాలా స్పోర్ట్స్ బైక్స్ వర్క్‌షాప్ నుంచి డెరైక్ట్‌గా వస్తాయి. వాటిని పెద్దగా మార్చడానికి అవకాశం ఉండదు. ప్రీ సెట్ చేసి ఉంటాయి. అదే హార్లీలో ఓనర్స్ ఎక్స్‌ప్రెషన్‌కి తగ్గట్టుగా ఏదైనా మార్చుకోవచ్చు. వీటి యజమానులను ఆకర్షించే ప్రధాన అంశాల్లో ఇదొకటి. ఇక దేశంలో ఏ మూలకు వెళ్లినా అక్కడ హార్లీ ఓనర్స్ ఉంటారు. కొత్తవారిని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు. హార్లీ ఓనర్ కొత్తగా ఏ ఊరుకి ట్రాన్స్‌ఫర్ అయినా... అతనికి హార్లీ బ్రదర్స్ సపోర్ట్ దొరుకుతుంది. కొత్త ఊర్లో హార్లీ కుటుంబ సభ్యులతో పరిచయం అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. గతంలో హార్లీ ఒక బైక్. కానీ ఇప్పుడు ఒక కుటుంబం. దేశ వ్యాప్తంగా నాలుగు జోన్లు, 13 చాప్టర్లున్న ఈ గ్రూప్‌ల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల వారూ కలుసుకొనే అవకాశం ‘హగ్ రైడ్స్’తో కలుగుతుంది. ఇది గ్రూప్ సభ్యుడైన శ్యామల్ జేత్వా అభిప్రాయం.  
 
ముప్ఫై ఏళ్లుగా...
 అన్ని రకాల బైక్స్ రైడ్ చేశా. రైడింగ్‌లో 30 ఏళ్ల అనుభవం. 68 దేశాలు చుట్టివచ్చా. ఒక హార్లీ పర్సన్ 100 మందిలో పాజిటివ్ ఆలోచన కలిగించే దిశగా పనిచేస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, వసతి ఇలా రకరకాల అంశాలలో. దీని కోసం ప్రతి రైడ్‌లో చారిటీ కోసమో, స్పెషల్ కాజ్ కోసమో ప్రయత్నిస్తుంటారు. హైదరాబాద్ హార్లీ గ్రూప్ నాలుగేళ్లుగా ఓ ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఓ పెద్ద కమ్యూనిటీగా పనిచేస్తోంది. ఇందులోని ఈతరం పిల్లలూ ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు. గర్ల్స్ కూడా ఇందులో ఎంతో చురుగ్గా, ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇది గ్రూప్‌లో సీనియర్ డాక్టర్ రాజగోపాల్ మాట.  
 
110 ఏళ్లు...
 110 ఏళ్ల క్రితం హార్లీ కార్పోరేషన్ చికాగో (అమెరికా)లో ప్రారంభమైంది. హార్లీ డీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా 5000, ఓనర్స్ మిలియన్ పైగా ఉన్నారు. ఈ బైక్స్ నాసా రాకెట్ సైన్స్ సాంకేతికతో రూపొందుతాయి. ఇంజన్, గేర్ బాక్స్, మెటీరియల్ అన్నీ ఆ స్థాయిలోనే ఉంటాయి. 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకూ హార్లీ బైక్ నడుపుతున్నారు. 16, 17 ఏళ్ల వారైతే హార్లీ స్కూల్స్‌కి వెళ్లి రైడింగ్ నేర్చుకొంటున్నారు. హార్లీ స్కూల్స్‌లో రైడింగ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉన్నాయి.
 
రయ్య్ రైడ్స్...  

 ఇంతకు ముందు ఈ గ్రూప్ లక్ష్యం చిన్నదే. ఇప్పుడు సేవ్ గర్ల్ చైల్డ్ లాంటి దేశవ్యాప్త సమస్యలతో పాటు అనేక సామాజిక అంశాల గురించి రైడ్స్ నిర్వహిస్తున్నారు. కర్నూలు, విజయవాడ, మహబూబ్‌నగర్... ఇలా ప్రతి ఆదివారం ఏదో ఒక రైడ్ ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు. వీటివల్ల జీవితంలో ఆశావహ దృక్ఫథం అలవడుతుందనేది సభ్యుల అభిప్రాయం. ఇదే వీరి ఆరోగ్య రహస్యం కూడానట.  ఈ గ్రూప్ సభ్యులు బర్మాలో జరుగనున్న ఏషియా బైక్ ఫెస్టివల్‌కు వెళుతున్నారు. దీనిలో హైదరాబాద్‌కు చెందిన 20 మంది రైడర్స్ పాల్గొంటున్నారు. పిల్లలు, ప్రపంచశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ  ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.  సిక్కిం, నేపాల్ నుంచి సింగపూర్ రోడ్డు మార్గంలో  ఇలాంటి రైడ్ నిర్వహించటం  ఇదే మొదటిసారి.    గతంలో ఈ గ్రూప్ 9 రీజినల్ కార్యక్రమాలు నిర్వహించారు. 15 వేల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 - ఓ మధు

మరిన్ని వార్తలు