ఆటో డ్రైవర్‌కు హ్యాట్సాఫ్

16 Sep, 2014 03:04 IST|Sakshi
ఆటో డ్రైవర్‌కు హ్యాట్సాఫ్

గచ్చిబౌలిలో ఆఫీసు. డ్యూటీ ముగిసే సరికి రాత్రి అయింది. ఓ పక్క వర్షం. ఆటో ఎక్కి మాదాపూర్‌లో ఇంటికి వెళ్లా. లోపలికి వెళ్లి చూసుకుంటే నా ఐ ఫోన్ లేదు. దార్లో క్లయింట్ ఆఫీసులో ఆగినప్పుడు అక్కడే మరిచిపోయూననేది నా ఫీలింగ్. తెల్లారి వెళితే.. అక్కడ ఎవరూ ఫోన్ చూడలేదన్నారు. ఖరీదు సంగతటుంచితే... బిజినెస్ కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. మైండ్ బ్లాంక్... గజిబిజి. అయితే ఫోన్ పోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశా. తరువాతి రోజు పొద్దున్నే ఎఫ్‌బీ ఓపెన్ చేస్తే... ఫ్రెండ్స్, రిలేటివ్స్ మెసేజ్‌లు. నా ఫోన్ ఒకరి వద్ద ఉందని.. అందులోని కాంటాక్ట్స్ సాయంతో దాన్ని మా అన్నయ్యకు చేర్చాడనేది మెసేజ్‌ల సారాంశం. ఆ క్షణం నన్ను నేను నమ్మలేకపోయా. నాలో దిగులంతా పోయింది. పట్టరాని ఆనందం.

ఇంతకీ ఎవరని వాకబు చేస్తే... అతనో ఆటో డ్రైవర్. పేరు సతీష్. నా ఫోన్ నాకు చేరేలా చేయడానికి అతడు పడిన శ్రమ ఆశ్చర్యం కలిగించింది. వెంటనే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉండే అతడి ఇంటికి వెళ్లా. ఆటో ఎక్కినప్పుడు నా బ్యాగ్‌లో మొబైల్ కింద పడిందట. తరువాత దాన్ని చూసిన సతీష్... ఓ చార్జర్ కొన్నాడు. అందులో కాంటాక్ట్స్‌కు వరుసగా కాల్ చేసి, చివరకు మా అన్నయ్యను పట్టుకున్నాడు. చాలామంది అమ్మి సొమ్ము చేసుకోమని సలహా ఇచ్చినా వినలేదట. కారణం... మొబైల్ వాల్‌పేపర్‌పై నా మేనకోడలు ఫొటో. దాన్ని చూసిన సతీష్‌కు తన కవల కూతుళ్లు గుర్తొచ్చారట. అందుకే ఫోన్ ఎలాగైనా తిరిగి నాకు చేర్చాలని తాపత్రయపడ్డానని చెబుతుంటే అతడిపై గౌరవం పెరిగింది. ఓ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చా. థాంక్యూ సతీష్... నీ సిన్సియూరిటీకి హ్యాట్సాఫ్.
 - జైభారతి, కార్పొరేట్ ఉద్యోగిని
 సేకరణ: ఎస్.సత్యబాబు  
 
 థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా?
 మనదో మహానగరం. ఇక్కడ ప్రతి ఒక్కరిదీ...ఉరుకులు పరుగులే తప్ప... తోటి మనిషి తిప్పలు పట్టని జీవన సమరం. కావల్సిన అడ్రస్ చెప్పడానికి కూడా ‘ఖాళీగా లేం’ అన్నట్టు కనిపించేవారిని చూసి చూసి అలవాటు పడిపోయాం. ఇంత వేగంలోనూ అరుదుగా మనకు  కొందరు తారస పడతుంటారు. మరబొమ్మలే కాదు మన మధ్య ‘మనుషులూ’ మిగిలి ఉన్నారని నిరూపిస్తుంటారు. అలాంటి వారి వల్ల మీరు పొందింది కొండంత చేయూత కావచ్చు, మాట సాయం కావచ్చు. అయితేనేం ఎన్నిమార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా ఇంకా ఏదో చెప్పాలని, అందరికీ ఆ మనిషి గొప్పతనం తెలియాలని, తద్వారా మరెందరికో మార్గదర్శనం చేయాలని అనిపిస్తుంటే... మాకు రాయండి. మీకు సాయం అందిన వైనం, అది మీకు చేసిన మేలుతో పాటు సదరు వ్యక్తి ఫొటో మీ ఫొటోతో సహా మాకు పంపండి. ప్రచురిస్తాం.           
- సిటీప్లస్
 
 అభాస్ యా భాస్

కూడు, గూడు, గుడ్డ వంటి కనీస వసతులకు కూడా నోచుకోని వీధి బాలల సమస్యలను ప్రతిబింబించే హిందీ నాటకం ఇది. అలీ అహ్మద్ నటించి, దర్శకత్వం వహించారు. రాహుల్ కమ్లేకర్ మరో నటుడు. జీవించడమే ప్రశ్నార్థకమైనప్పుడు ఆ వీధి బాలలు ఎలా స్పందించారనేది ఈ నాటకంలో ఆసక్తికర అంశం. ఈ నెల 20 రాత్రి 7.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో ప్రదర్శన.

మరిన్ని వార్తలు