సొంతింటిలా ఫీలయ్యా..

18 Dec, 2014 00:16 IST|Sakshi

చిట్‌చాట్
 
దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన అందం.. దక్షిణభారతంలో నటిగా పరిచయమైంది. యమలీల 2లో హీరోయిన్‌గా మెప్పించిన దియా నికోలస్.. మోడలింగ్ ప్రాజెక్ట్ కోసం ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ ఎస్వీ కృష్ణారెడ్డి కళ్లల్లో పడి వెండితెరపై తళుక్కుమంది. టాలీవుడ్ సినిమా చాన్స్‌తో మొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ లుక్‌లోనే సిటీతో కనెక్ట్ అయిపోయానని చెబుతోన్న నికోలస్‌తో సిటీప్లస్ చిట్‌చాట్..
 ..:: శిరీష చల్లపల్లి
 
హాయ్..! నేను పుట్టిటంది, పెరిగింది సౌతాఫ్రికాలోనే. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ రంగం మీద ఆసక్తి. అందుకే అప్పుడప్పుడూ మోడలింగ్ చేసేదాన్ని. ఒకసారి ఓ మోడలింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబైకి వచ్చాను. అక్కడ ఫ్యాషన్ షోకు గెస్ట్‌గా వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి నా ఫొటో చూసి కాల్ చేసి యమలీల 2 సినిమా గురించి చెప్పారు. ముందుగా నాకేమీ అర్థం కాలేదు. ఏదో క్రేజ్ కోసం మోడలింగ్ చేసుకుంటున్న నాకు హీరోయిన్‌గా ఆఫర్ చేయడాన్ని ముందుగా నమ్మలేకపోయాను. అదొక సర్‌ప్రైజింగ్ మూమెంట్. వెంటనే ఒప్పుకున్నాను.
 
సంప్రదాయ పునాదులపై..

యమలీల 2 కోసం ఇక్కడికి వచ్చాను. మొదటి చూపులోనే భాగ్యనగరం నాకు నచ్చేసింది. ఇక్కడ స్టూడియోలు చూడటం ఎంతో సరదాగా అనిపిస్తోంది. చెప్పాలంటే ఈ సిటీ అందమైన హాలీవుడ్ సెట్‌లా ఉంది. ఇక హైదరాబాదీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ జనాలు ఎంత ప్లసెంట్‌గా మాట్లాడుతారో..! అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. ట్రెడిషనల్ పునాదులు మాత్రం పదిలంగా ఉండటం గొప్ప విషయం. హైదరాబాద్ జర్నీని ఒక పిక్నిక్‌లా ఫీలవ్వడం లేదు. సొంతింటికి వచ్చిట్టుంది. ఇక్కడ అడుగడుగునా చారిత్రక సంపద కనిపిస్తుంటుంది. బిర్లామందిర్, నెక్లెస్ రోడ్, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ ఎన్నో హిస్టారికల్ స్పాట్స్ సందర్శించాను.
 
ఆ పేరు చాలు..


నేను సినిమాలో నటిస్తానని ఎన్నడూ అనుకోలేదు. అనుకోకుండా అవకాశం వచ్చింది. నేను నటించడం ఇదే మొదటి సారి.. ఆఖరి సారి కూడా. మళ్లీ చదువు కంటిన్యూ చేస్తాను. ఈ ఫీల్డ్ నా ప్రొఫెషన్ కాదు. ఏదో క్రేజ్ వల్ల ఒక సినిమా చేశాను. బాగా యాక్ట్ చేశానన్న పేరొచ్చింది. ఆ పేరు చాలు నాకు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్న సిటీకి థ్యాంక్స్ చెబుతున్నాను. నా జీవితంలో మొమరబుల్ మూమెంట్స్ ఎక్కడున్నాయంటే తడుముకోకుండా హైదరాబాద్‌లో అని చెప్పగలను. నాకు అంత దగ్గరైంది ఈ సిటీ.
 
ఇల్లొకటే ప్రశాంతం..

సౌతాఫ్రికాలో ఇల్లొకటే ప్రశాంతంగా అనిపించేది. బయటకు రాగానే ఉరుకులు, పరుగులు వేరే దేశానికి వెళ్లినట్టు హడావుడిగా అనిపించేది. ఎవరి లోకం వాళ్లది. జనం దృష్టంతా డబ్బులు సంపాదించుకోవడంపైనే. ఒకరినొకరు పట్టించుకునే తీరికే కనిపించదు. అదే ఇండియాలో ఇప్పటికీ మానవీయ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మనిషి కోసం తపించే వారున్నారు. అందుకే ఈ దేశాన్ని కర్మభూమి అన్నారేమో. కాలంతో మార్పులు సహజం. అయితే ఇండియాలో నిజాయితీ ఇంకా బతికే ఉంది.
 

మరిన్ని వార్తలు