అతిథి మర్యాద

5 Dec, 2014 01:36 IST|Sakshi
అతిథి మర్యాద

పూర్వకాలంలో మానవులమధ్య సత్సంబంధాలు, ఆప్యాయత, ప్రేమానురాగాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు లేవనికాదు, గతంతో పోల్చుకుంటే సన్నగిల్లా యి. ఆ రోజుల్లో ఎవరైనా అతిథి వస్తే సంతోషించేవారు. ఆప్యాయంగా స్వాగతం పలికేవారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం వారి కోసం కేటాయించేవారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.

 అతిథి మర్యాద ఇస్లామియ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. ఒకసారి దైవప్రవక్త ముహ మ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘అయ్యా! నేను నిరుపేదను. ఆకలి దహించివేస్తోంది’ అని అభ్యర్థిం చాడు. ఆ రోజు ప్రవక్త వారి ఇంట కూడా పచ్చి మంచి నీళ్లు తప్ప మరేమీలేదు. అందుకని, ప్రవక్త మహనీ యులు అక్కడున్న సహచరులతో, ‘ఈ పూట ఇతని కెవరైనా ఆతిథ్యం ఇవ్వగలరా?’ అని అడిగారు. ఓ సహ చరుడు స్పందించి, ‘దైవ ప్రవక్తా! నేనిస్తాను’ అన్నాడు. అతిథిని వెంట బెట్టుకొని ఇంటికి వెళ్లాడు. ‘ఈ రోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’ అని శ్రీమతిని సంప్రదించారు. ‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. అది కూడా వచ్చిన అతిథి ఒక్కరికైతేనే సరిపోతుందేమో!’ అని బదులిచ్చారామె. ‘అతిథిని గౌర వించడం మన విధి. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోగానే భోజనం వడ్డించు. మేము భోజనానికి కూర్చున్న తరువాత, వడ్డన సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్టు నటించి, ఆర్పి వెయ్యి. చీకట్లో అతిథితోపాటు మనం కూడా తింటున్నట్లే నటిద్దాం’ అని చెప్పారాయన.

 అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్ర పుచ్చి, భోజనం వడ్డించింది. అందరూ కూర్చున్నారు గాని, అతిథి మాత్రమే భోజనం చేశాడు. తాము కూడా తింటున్నట్లే నటించిన ఆ దంపతులిద్దరూ, పిల్లలతో సహా పస్తులే ఉన్నారు.

 మరునాడుదయం ఆతిథ్యం ఇచ్చిన సహచరుడు ప్రవక్త మహనీయుల వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త వారు ‘అబూతల్హా’ అంటూ ఆయన పేరును, ఆయన సతీమణి పేరునూ ఉచ్ఛరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమి తంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు.

 ‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమ కంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది. తమ అవస రాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నత పుణ్యకార్యాలు. కాని ఈనాడు అతిథి పట్ల మొహమాటపు పలకరింతలే కాని, ఆప్యాయత ఉట్టి పడటంలేదు. ఈ ఉరుకులు, పరుగుల మధ్య ఒకర్ని గురించి ఒకరు పట్టించుకునేంత తీరిక లభించడం లేదు. ఇలాంటి సుగుణాలు లోపించబట్టే శాంతి లేకుండా పోతోంది. అందుకని సాధ్యమైనంత ఎక్కువగా సత్సంబంధాలు నెరపడానికి, స్నేహధర్మా న్ని, అతిథి మర్యాదను గౌరవించడానికి ప్రాధాన్యతని వ్వాలి. అప్పుడే  దైవ ప్రసన్నతా భాగ్యం కలుగుతుంది.

- యం.డి.ఉస్మాన్‌ఖాన్

మరిన్ని వార్తలు