గృహమే కదా కళాసీమ

17 Mar, 2015 23:47 IST|Sakshi
గృహమే కదా కళాసీమ

ద్వార ‘బంధాన్ని' పటిష్టపరిచే రెండు తలుపులు,  ఓవైపు గొళ్లేనికి వేలాడుతున్న తాళం, వాటి ఎదురుగా ఇద్దరు మహిళలు... పాల క్యాన్లు... ఓరగా తెరచి ఉన్న తలుపులో నుంచి  కనపడే తులసి మొక్క... ఇదంతా చూస్తే మన కళ్లకి మామూలుగానే అనిపించవచ్చు కానీ... ‘కళ'లు ‘కనే' కళ్లకు మాత్రం అద్భుతమైన ఆలోచనలను అందిస్తుంది. ఆ స్ఫూర్తి నుంచి రూపం దాల్చిన తలుపులు, మరెన్నో అపు‘రూపాలు’ బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌కు వచ్చే కళాభిమానులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
  ఎస్.సత్యబాబు/ శ్రావణ్‌జయ  
 
‘చెన్నైలో ఉండగా  మా వీధిలో నుంచి వెళుతుంటే దారిలో కనపడే ఇళ్లకు ఉన్న తలుపుల అందాలు నాలో సరికొత్త తలపులు పుట్టించేవి’ అంటారు శాంతనా కృష్ణన్. బహుశా అందుకేనేమో ఇప్పుడు ఆయన్ని డోర్‌మ్యాన్ అని సన్నిహితులు సరదాగా ఆట పట్టిస్తుంటారు. గత 18 సంవత్సరాలుగా ఆయన తలుపుల మీద తనకున్న ఇష్టాన్ని కాన్వాస్ సాక్షిగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన కేవలం తలుపుల తలపుల్నే తన కుంచె కదలికలకు ప్రాణంగా భావిస్తుంటే... ఇంటిలో వినియోగించే పలు వస్తువుల నుంచి స్ఫూర్తి పొందే చిత్రకారులు ఇంకా చాలా మందే ఉన్నారు. ‘అబ్జెక్ట్స్ మీద  సిటీలో జరుగుతున్న తొలి చిత్రకళా ప్రదర్శన ఇది’ అని  గ్యాలరీ స్పేస్ నిర్వాహకుడు టి.హనుమంతరావు చెప్పారు.
   
కాదేదీ అనర్హం...
మిక్స్‌డ్ మీడియాలో పురుడు పోసుకున్న ‘ది డోర్’ గ్యాలరీ గోడల మీద వైవిధ్యంగా కొలువుదీరితే... గణేషుడు-హనుమాన్ థీమ్‌తో రాచఠీవి ఒలకబోసే రాయల్ చైర్స్‌ను నగర చిత్రకారుడు రమేష్ గొర్జాల తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. బెడ్‌ల్యాంప్‌లో వెలగాల్సిన లైట్‌కు బదులు పెయింటింగ్‌ను ఉంచిన మరో సిటీ ఆర్టిస్ట్ ఫవాద్ తమాకాంత్ ల్యాంప్‌షేడ్...  చిత్రాలు లిఖించడానికి ప్రతిసారీ కాన్వాస్ మాత్రమే వేదిక కానక్కర్లేదని నిరూపిస్తుంది. చెక్కతో తయారైన పాత్రల తరహాలో పాతకాలం నాటి వంటిళ్లలో ఉండే ‘ఉర్లి' (గుజరాత్, మహారాష్ట్ర పల్లెల్లో) ఆర్టిస్ట్ జయాబహేతికి స్ఫూర్తినిచ్చింది. ‘వంటింటికీ పెయింటింగ్‌కి... ఒక మహిళగా, చిత్రకారిణిగా సేవలు అందించడం
 
నాకు సంతోషాన్నిస్తుంది’ అంటారామె.  
నగరానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారులు, తండ్రీ కూతుర్లయిన లక్ష్మణ్ ఏలె, ప్రియాంక ఏలె... మహిళనే థీమ్‌గా తీసుకుని చిత్రాలు ఆవిష్కరించారు. గ్రామాల్లో మహిళలు ముద్దుగా పిలుచుకునే ‘బొట్టుపెట్టె’ (సిటీలో డ్రెస్సింగ్ టేబుల్) లక్ష్మణ్ ఏలె కుంచె తగిలి ‘చిత్ర’మైన అపురూపంగా మారిన వైనం మనసుకు హత్తుకుంటుంది. ‘క్లోజెట్’ పేరుతో తాను గీసిన చిత్రాల గురించి చెబుతూ... ‘కొబ్బరినూనె, దువ్వెన, పౌడరు... వంటి వస్తువుల్ని ఉంచుకునేందుకు గ్రామీణ మహిళలు వినియోగించే మేకప్ వార్డ్‌రోబ్’ అంటూ బొట్టుపెట్టె విశేషాల్ని వివరిస్తారు.

ఈ చిత్రంలో గ్లాస్ డోర్స్ మిర్రర్స్ పాత్ర పోషించాయి. చల్లని నీటికి నిలయమైన కుండ మీద అంతే చల్లని మనసున్న దేవతలు దుర్గ, సరస్వతి రూపాలతో తాను అందించిన పెయింటింగ్ పర్యావరణానికి, మహిళకు జరుగుతున్న అన్యాయాల్ని సరిపోల్చుతుందని  అంటారు ప్రియాంక. ముంబయికి చెందిన గౌతమ్ ముఖర్జీ పాత కాలం నాటి గ్రామ్‌ఫోన్ రికార్డ్‌తో పాటు అప్పటి ‘పాట’ జ్ఞాపకాలను కూడా మనకు గుర్తుకు తెస్తారు.

ఇంకా చిప్పా సుధాకర్ చైర్స్, ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్‌తో భాస్కరావు టేబుల్... ఇంట్లో వినియోగించే ఇలాంటి వస్తువులనెన్నింటినో కళారూపాలుగా మన ముందుకు మోసుకొచ్చిన ఈ ‘ఈస్థటిక్స్ అండ్ యుటిలిటీ’ ప్రదర్శన ఆద్యంతం వైవిధ్యంగా అనిపిస్తుంది. హైదరాబాద్‌తో పాటుగా విభిన్న నగరాలకు చెందిన ఆర్టిస్ట్‌లు పాల్గొన్న ఈ ప్రదర్శన ఈ నెల 25 వరకూ కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు