ఏకకాలంలో స్వపక్షం, విపక్షమూ అయిన పవార్‌తో జగన్ నెగ్గుకొస్తారా?

25 Nov, 2013 08:22 IST|Sakshi
ఏకకాలంలో స్వపక్షం, విపక్షమూ అయిన పవార్‌తో జగన్ నెగ్గుకొస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి, రాష్ట్రాల విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ దుర్వినియోగం చేయకుండా చూడటానికి జాతీయస్థాయిలో పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (సోమవారం) నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ని ముంబైలో కలవనున్నారు.

వామపక్ష, బీజేపీ పార్టీ నేతలు,  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సహా ముఖ్యమైన నాయకుల్ని కలవడం ఒక ఎత్తైతే, శరద్ పవార్‌ని కలవడం ఒక్కటే మరో ఎత్తని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఎవరికి ఎప్పుడు మిత్రపక్షమో, ఎప్పుడు విపక్షమో అంతుచిక్కని శరద్ పవార్‌ని కలవడం నిజంగా అత్యంత కీలకమే. కేవలం 9 మంది ఎంపీల మద్దతుతో యుపిఏలో ముఖ్య భాగస్వామిగా కొనసాగుతున్న పవార్ కాంగ్రెస్కి పక్కలో బల్లెంగానే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరు పడిన ఆయన, ఆ పార్టీనే ఎదిరించి నిలదొక్కుకుని మహారాష్ట్రలో మహాశక్తిగా ఎదిగారు.

సోనియా విదేశీ వనిత అన్న ప్రధానమైన వాదనతో కాంగ్రెస్‌లో తిరుగుబాటు చేసి సొంత కుంపటి పెట్టుకున్న మరాఠా యోధుడిని చేరదీయడం కాంగ్రెస్‌కి తప్పలేదు. అయితే, మహారాష్ట్రలో తమ ఎన్సీపిని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, అలాగే ఐపిఎల్ వివాదంలో ఇరికించి కావాలనే తనను ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయంతో పవార్ కాంగ్రెసు మీద ప్రచ్ఛన్న యుద్ధానికి దిగారు ఒక సమయంలో. ప్రధాని పీఠం మీద కన్నేసి మరో రకం రాజకీయ నడిపారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ తరఫున బరిలోకి దిగినప్పుడు పవార్ కాంగ్రెసు పార్టీని తన డిమాండ్లతో చెమటలు కక్కించారు.

కాంగ్రెసు ఒంటెత్తు పోకడ లు మానుకోవాలని, యుపిఏలోని భాగస్వామ్య పక్షాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాలని మరొక సందర్భంలో ఘాటైన విమర్శలు చేశారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో రాజకీయ అస్త్రం అని కామెంట్ చేయడంతో,  కుటిల యంత్రాంగంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీయే  ఆయన స్వపక్షమో, విపక్షమో అంతుపట్టక జుట్టు పీక్కొంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమనే ఏకైక ఎజండాతో కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తున్న నేపథ్యంలో, రాహుల్ అనుభవ శూన్యుడని వ్యాఖ్యానించి పవార్ మరోసారి తన మార్కు చాటుకున్నారు.

ఇక ప్రత్యేక తెలంగాణ విషయానికొస్తే, ఆయన తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టాలని భావిస్తున్న జాతీయ పార్టీలకి ఎవరి వ్యూహాలు వారికున్నాయి. కాంగ్రెస్సుకి సదా తలనొప్పిగా ఉండే పవార్ తెలంగాణాకి పూర్తి మద్దతునివ్వడం ఆశ్చర్య పరిచింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం అవసరంలేదంటూ వస్తున్నారు పవార్. శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు గానీ, ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం లేదంటారాయన. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆయన ధీమాగా ప్రకటిస్తూ, కాంగ్రెస్ అడ్డగోలు విభజన ప్రక్రియని గట్టిగా సమర్థిస్తున్నారు.

అయితే, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఒక పథకం వేస్తే, దానిని పవార్ మరోలా వాడుకోవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకుల అంచనా. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భను ఎజెండాగా చేసుకునేందుకు ఎన్సీపి సమాయత్తమైందని, అందుకే పవార్ ప్రత్యేక తెలంగాణాని అంతలా సమర్ధిస్తున్నారని భావిస్తున్నారు. పరస్పర విరుద్ధంగా అనిపించే అస్త్రాలని కూడా తన అమ్ములపొదిలో దాచుకుంటారని పేరున్న శరద్ పవార్‌తో జరిగే భేటీలో జగన్ ఏ వ్యూహం అనుసరిస్తారో, ఆయనుంచి అటువంటి హామీలు పొందుతారోనని రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు