అస్పృశ్యత ఇంకెంత కాలం?

25 Dec, 2014 00:08 IST|Sakshi
మల్లెపల్లి లక్ష్మయ్య

విశ్లేషణ

 అంటరానితనం దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలవుతోందని ఎన్‌సీఏఈఆర్ తాజా సర్వేలో వెల్లడైంది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న అస్పృశ్యత ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. దళిత కులాలతో సామరస్యంగా వ్యవహరించకపోవడం, వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే.  వారి వెనుకబాటుకు కారణాలే. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజమే.

 ఆరున్నర దశాబ్దాలుగా భారత రాజ్యాంగం అమలులో ఉన్నా, నేటికీ అంటరానితనాన్ని  పాటిస్తున్నామని బహిరంగంగా అంగీకరించే వారు చాలా మందే ఉన్నారు. దాదాపు అన్ని కులాల వారు తర తమ స్థాయిల్లో అంటరానితనాన్ని పాటిస్తున్నామని తమదైన భాషలో ఆ విషయాన్ని చెబుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎస్.సి.ఎ.ఈ.ఆర్.) సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత మానవ అభివృద్ధి సర్వే’ పేరిట ఈ సంస్థ దేశవ్యాప్తంగా 42 వేల ఇళ్లను సర్వే చేసింది. 2015లో సర్వే పూర్తి వివరాలను వెల్లడిస్తారు. 2011-12లో నిర్వహించిన ఈ సర్వేకు డాక్టర్ అమిత్ థోరాట్ ప్రధాన పరిశోధకులు. బ్రాహ్మణులు, అగ్రకులాలు, ఓబీసీలను విడివిడిగా వారి అభిప్రాయాలను అడిగారు. ఇందులో 52 శాతం బ్రాహ్మణులు, 24 శాతం అగ్రకులాల వారు, 33 శాతం ఓబీసీలు అంటరానితనాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. మతాల వారీగా, హిందువులు 35 శాతం, జైనులు 30 శాతం, సిక్కులు 23 శాతం, ముస్లింలు 18 శాతం, క్రైస్తవులు 5 శాతం, బౌద్ధులు ఒక శాతం అంటరానితనాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. ఈ లెక్కలు అంటరానితనం అమలవుతున్న తీరును, దాని తీవ్రతను మాత్రమే తెలియజేస్తాయి. నిజానికి అంటరానినాన్ని పాటిస్తున్నా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోని వారు ఇంతకంటే ఎక్కువగానే ఉంటారు.

 ‘‘తప్పు అంటరాని కులాలది కాదు’’
 అంటరానితనాన్ని, కులాల అంతరాలను సమసిపోయేట్టు చేయాలని ఇప్పటికే చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. స్వాతంత్య్రం పొందిన అనంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించే నిబంధనను కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా నాటి నాయకులు ఆశించిన ఫలితాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకపోవడం విచారకరం. 1949 నవంబర్, 29వ తేదీన భారతదేశం ఒక చరిత్రను సృష్టించింది. అప్పటి వరకు అంటరానితనంపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. పైగా అందుకు ధర్మశాస్త్రాల ఆమోదం ఉండేది. అయితే చరిత్రాత్మకమైన ఆ రోజు హేయమైన, సిగ్గుచేటైన ఈ దురాచారానికి చట్టపరంగా ముగింపు పలికింది. ఆనాటి చర్చలో పాల్గొన్న నజీరుద్దీన్ అహ్మద్, వి.ఎల్.మునిస్వామి పిళ్లై, డాక్టర్ మన్మోహన్ దాస్, శ్రీమతి దాక్షాయణి వేలాయుథన్, కె.టి.షా, శంతన్ కుమార్ దాస్ తదితరులు అంటరానితనం నిర్మూలనను చరిత్రాత్మక బాధ్యతగా పేర్కొన్నారు. మన్మోహన్ దాస్ మాట్లాడుతూ... ఇంతవరకూ అంటరాని వారిగా ఉన్న వారికి 1949 నవంబర్, 29 ఎన్నటికీ మరువలేని రోజు అని అభివర్ణించారు. రాజ్యాంగ నిర్ణాయక సభకు ైచైర్మన్‌గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చర్చను నడిపించిన తీరును ప్రత్యేకించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన అంటరానితనాన్ని పాటిస్తున్న కులాలకు, సమూహాలకే సభలో ఎక్కువగా మాట్లాడే అవకాశమిచ్చారు. అంబేద్కర్ సభాధ్యక్ష పాత్రకే పరిమితమయ్యారు. వాదనా పటిమతో కూడిన గంభీరోపన్యాసాలు చేసే ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే, అంటరానితనం నిర్మూలన బాధ్యత హిందూ సమాజ నాయకులదేనని ఆయన భావించారు. అంటరాని కులాలు మాత్రమే ఆ దురాచారాన్ని నిర్మూలించాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయం. 1946లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్ సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు: ‘‘అంటరాని కులాలు మొదటి నుంచి ఈ సమాజంలో భాగం కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ హిందూ కులాలే అందుకు అంగీకరించడం లేదు. చాలా మంది భ్రమపడుతున్నట్టు ఇది అంటరాని కులాల తప్పు కాదు. అంటరాని వాళ్లుగా ఉండాలనే కోరిక వారికి లేదు. హిందూ కులాల మనసుల్లో పరివర్తన కలగాలి. అప్పుడే వారు సమా జంలో కలసిపోవడం సాధ్యమవుతుంది. అంతవరకు ఇది ఒక స్వప్నంగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం, దాని సంప్రదాయాలే అంటరానితనానికి మూలం’’ అని స్పష్టం చేశారు.

 దళితేతర సమాజానిదే బాధ్యత
 ఇంకా హిందూ సమాజం కులాన్ని, అంటరానితనాన్ని పాటిస్తున్నందువల్లనే ఎన్.సి.ఎ.ఈ.ఆర్. సర్వేలో అంటరానితనం విస్తృతంగా ఉన్నట్టు తేలింది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్నట్టు తెలుస్తున్న అంటరానితనం ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. కుల భేదాలు ఉన్నప్పటికీ విభిన్న కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు క్రూరంగా ఉండవు. కానీ మొత్తం సమాజానికి, అంటరాని కులాలకు మధ్య ఉన్న భేదం పూర్తిగా శత్రుపూరితంగా మారింది. దీనికి రాజకీయ సామాజిక కారణాలున్నాయి. బౌద్ధాన్ని అనుసరించే వాళ్లను ఆనాటి హిందుత్వ శక్తులు క్రూరంగా అణచివేశారని, మిగిలిన కొద్ది మందిని సమాజం నుంచి వెలివేశారని, వాళ్లే అంటరాని కులాలుగా ఉన్న వాళ్లనే విషయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ‘‘అంటరానివారెవరు?’’ అనే తన పరిశోధనల్లో వెల్లడించారు. అయితే ఈ రోజు అది మరింత పెద్ద మానసిక సమస్యగా తయారైంది. ఆర్థిక భేదాలను తొలగించడం ఒక రకంగా సులువు. ప్రభుత్వాలు తలచుకుంటే బలవంతంగానైనా ఆస్తులున్న వారి నుంచి లాక్కొని, అందరికీ సమానంగా పంపిణీ చేయవచ్చు. కానీ కులాన్ని నిర్మూలించాలంటే చట్టాలు, రాజ్యాంగ రక్షణలు మాత్రమే సరిపోవు. సామాజిక పరివర్తన, మానసిక సంసిద్ధత కావాలి.

 అయితే, హిందూ సమాజం, ఇతర మతాలు పాటిస్తున్న అంటరానితనం  వలన అంటరాని కులాలుగా గుర్తింపు పొందుతున్న దళితులు తరతరాలుగా సామాజిక  వెలివేతకు, ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణచివేతకు గురవుతూ ఉనారు. ముందుగా దీనికి పరిష్కారాలు వెతకాలి. ఇక్కడ హిందూ సమాజంతో పాటు ఇతర మతాల, వర్గాల పాత్ర కూడా చర్చనీయాంశం  అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రక్షణలు, సంక్షేమ పథకాలు, అమలులో ఉన్నాయి. కానీ అవి అనుకున్నంతగా అమలు జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం దళితేతర సమాజంలో ఉన్న వ్యతిరేకతా భావమే. ఇది పోవాలి. దళిత సమాజం తన పోరాటాలతో ఆ సమస్యలను ఏ మేరకు వెలుగులోకి తెస్తుందనేదే దాని ముందున్న సమస్య. అయితే వాటిని పరిష్కరించే బాధ్యత దళితేతర సమాజానిది మాత్రమేనని గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు, అత్యాచారాల నిరోధక చట్టం ఇవన్నీ దళితుల రక్షణకు గాక, ఇతరులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయనే వాదనలు తరచుగా వినిపిస్తుంటాయి. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్న కూడా పదే పదే ముందుకొస్తుంటుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది కేవలం దళితులు కాదు... హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజం. ఎవరైతే ఈ దేశం, ఈ జాతి అంతా ఒక్కటని భావిస్తున్నారో వాళ్లే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంటరాని కులాలతో సామరస్యంగా వ్యవహరించక పోవడం, కనీసం వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, అడుగడుగునా వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే. దళితుల వెనుకబాటుకు ఇవే కారణాలు.

 దళిత  జనాభివృద్ధితోనే దేశాభివృద్ధి
 అంబేద్కర్ తర్వాత కుల సమస్యపై అంత తీవ్రంగా స్పందించిన వారిలో రామ్ మనోహర్ లోహియా ముఖ్యులు. దళిత, బడుగు కులాలకు అవకాశాల కల్పన వల్లనే కుల సమాజంలోని అంతరాలు కొంత మేరకైనా తగ్గుతాయని ఆయన చెప్పారని   గమనించాలి. ఇటీవల అన్ని రాజకీయ వర్గాల నుంచి, ముఖ్యంగా హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తుల నుంచి ఈ అంశంపై కొంత సానుకూల స్పందన వస్తున్నది. ఇది ఆచరణ రూపంలో మరింత శక్తివంతంగా ముందుకు రావాలి. ముఖ్యంగా దళిత యువతలో,  విద్యార్థుల్లో నైరాశ్యం నెల కొని ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా అందిన చదువు వారికి ఎలాంటి బతుకుతెరువును చూపడం లేదు. పైగా భూమి లాంటి ఆర్థిక వనరులు  రోజు రోజుకీ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుండటంతో సెంటు భూమి కూడా వారికి మిగలడం లేదు. దాదాపు నూటికి తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయిన తర్వాత ఉద్యోగ రిజర్వేషన్లు నామ్‌కే వాస్తేగా తయారయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో కులాలకు అతీతంగా అంతా ఐక్యంగా ముందుకు పోవాలనుకునే శక్తులు... జనాభాలో 20 శాతంగా ఉన్న అంటరాని కులాల బాగోగులను పట్టించుకోకపోతే, దేశాభివృద్ధి మిథ్యగానే మిగిలిపోక తప్పదు. ప్రపంచంలోని అన్ని దేశాలకు దీటుగా మన దేశాన్ని నిలబెట్టాలనుకునే కల దళితులు అభివృద్ధి చెందనిదే నెరవేరదు. అందుకే అంటరానితనాన్ని, కులాల అంతరాలను నిర్మూలించడాన్ని అత్యవసరమైన, ప్రథమశ్రేణి ప్రాధాన్యాలలో ఒకటిగా తీసుకుని దృఢ సంకల్పంతో కృషి చేస్తే తప్ప భారతదేశం ప్రపంచంలో తల ఎత్తుకొని నిలబడలేదు.
  (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-మొబైల్ నం: 9705566213)

మరిన్ని వార్తలు