ఆయనకు ఎన్నాళ్లీ ఖైదు?

9 May, 2015 01:53 IST|Sakshi
పి. వరలక్ష్మి

 సందర్భం
 ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను  సరిగ్గా ఏడాది క్రితం మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ యంలో దారికడ్డంపడి కళ్ళకు గంతలు కట్టి ఎత్త్తుకుపోయి నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘అండా సెల్’ అని పిలిచే గాలీ వెలుతురు సోకని ఇరుకు గదిలో నిర్బంధించారు. మావోయిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్త్తున్నాడని ఆరోపణ చేసి అత్యంత అమానవీయ పరిస్థితుల్లో నాగపూర్ సెంట్రల్ జైల్లో పడవేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్లు రాజకీయ విశ్వాసాలను, అస మ్మతిని నేరంగా పరిగణిస్తాయి. నేరం నిరూపించి ముద్దాయికి శిక్ష నిర్ణయించడం కాకుండా, నేరారోపణకు గురైన వ్యక్తే తాను నిర్దోషినని నిరూపించుకునేవరకూ శిక్షను అమలు చేయవచ్చు. ఆ శిక్ష కూడా ఎంత అమా నుషంగా ఉంటుందో సాయిబాబా కేసే ఉదాహరణ. ఆయనకు శారీరక వైకల్య సమాన అవకాశాల చట్టం ప్రకారం చక్రాల కుర్చీ కదలికలకు కావల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు. మనిషి సహకారం లేనిదే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పట్టించుకోకుండా ఒంటరి ఖైదులో ఉంచారు. ఆయనకు 90 శాతం అంగ వైకల్యంతో పాటు తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజాల నరాల క్షీణత, వెన్నెముక నొప్పి ఉన్నాయి. జైల్లో మందులు, ఆహారం నామమాత్రంగా కూడా లేవు. బైటి నుండి కుటుంబ సభ్యులు, మిత్రులు పంపించినా నిరాకరిస్త్తున్నారు. ఆయన ప్రత్యేక పరిస్థితి దృష్టిలో పెట్టుకునైనా బెయిల్ ఇవ్వమని న్యాయవాదులు  పలుమార్లు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి వల్ల హైకోర్టు కూడా నిరాకరించింది. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ స్థితిలో సాయిబాబా, ఆయ నకు చట్టపరంగా అందవలసిన కనీస సౌకర్యాలు, మం దులు, వైద్యం కోసం ఏప్రిల్ 11న జైల్లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. 14 నాటికి రెండుసార్లు స్పృహ కోల్పోయాడు. చివరికి 16వ తేదీ రాత్రి 11 గంటలకు మళ్ళీ స్పృహ కోల్పోయి పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఆయనకు బలవంతంగా సెలైన్ ఎక్కించి భారీ బందోబస్తు నడుమ నాగపూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. కోర్టు ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించింది. ఏప్రిల్ 17న ఆసుపత్రిలో దీక్ష విరమించాక ఒక్క రోజు తిరక్కుండానే మళ్ళీ ఆయన్ని అండా సెల్‌లో నిర్బంధించారు.

 పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబాకు అయిదేళ్ళ వయసు నుండే పోరాటం మొదలయ్యింది. పోలియో తన శరీరంపై దాడిచేసి ఆయన నడుము కింది భాగమంతా చచ్చుబడేలా చేసింది. అమలాపురం దగ్గర పల్లెటూరులో మట్టి రోడ్లపై తన రెండు చేతులతో దేహాన్ని ఈడ్చుకుంటూ మొదలు పెట్టిన ప్రయాణం కాలేజీ చదువు నాటికి మలుపు తిరిగింది. తన శారీరక అనారోగ్యంకన్నా దేశాన్ని పట్టి పీడించే దోపిడీ అసమా నతలు ఎన్నో రెట్లు తీవ్రమైనవని అర్థం చేసుకున్నందుకే ఆయన చక్రాల కుర్చీలో దేశమంతా పీడితుల వెంట తిరిగాడు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో  ఎన్నో రచనలు చేశాడు. ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా ఆ తర్వాత జాతీయ కార్య దర్శిగా ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా అవి శ్రాంతంగా పనిచేశాడు. అంతర్జాతీయ వేదికల్లో పోరాడే ప్రజలకు బాసటగా నిలిచాడు. ఆయన కష్టాలను లెక్క చేయ లేదు. నిర్బంధాలకు వెరవలేదు. ఆ చక్రాల కుర్చీని చూసి బంగారపు కుర్చీ భయపడుతోందని ఒక హిందీ కవి రాశాడు.

 అక్రమ అరెస్టు, తప్పుడు కేసులు మోపడమే కాక విచారణ ైఖదీగా ఉన్న మనిషి పట్ల, అదీ తీవ్రమైన అనారోగ్యమూ, శారీరక వైకల్యమూ ఉన్న మనిషి పట్ల చట్టాలనూ, కోర్టు ఆదేశాలనూ ఉల్లంఘించి, హింసకు గురిచేస్తున్న రాజ్య దుర్మార్గాన్ని ఖండిస్తూ, ఆయన విడుదల కోసం ప్రజాసంఘాలు డా.జి.ఎన్.సాయి బాబా విడుదల పోరాట కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రజాస్వామిక నిరసనను ఏ మాత్రం భరించలేని తెలంగాణ రాష్ర్టప్రభుత్వం మే 9న జరుపతలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించింది. చివరికి ఇందిరా పార్క్ వద్ద పరిమిత ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అనుమతించారు.

 సాయిబాబాను జైల్లోనే అంతం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం ప్రజాసంఘాలకు కలుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం ఎట్లాగు ప్రధాన దోషి అవుతుంది, అయితే ఆ పాపంలో ప్రశ్నించని సభ్య సామా జానికీ భాగస్వామ్యం ఉండదా?

 (వ్యాసకర్త విరసం కార్యదర్శి) ఫోన్: 8179913123

మరిన్ని వార్తలు