కౌగిలింతలు.. శాపనార్థాలు!!

6 Oct, 2014 14:53 IST|Sakshi
కౌగిలింతలు.. శాపనార్థాలు!!

ఒకవైపు కౌగిలింతలు.. మరోవైపు శాపనార్థాలు! ఇదీ ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలుసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కొద్దిగా తటపటాయించినా దత్తాత్రేయ చొరవతో ముఖ్యమంత్రులిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అది చూసినవాళ్లంతా ఇంకేముంది, చంద్రులిద్దరూ కలిసిపోయారు.. ఇక రెండు రాష్ట్రాలకు మధ్య గొడవలు ఏమీ లేవన్నట్లే అనుకున్నారు.

అయితే.. గట్టిగా కొన్ని గంటలు కూడా గడవక ముందే మళ్లీ ముసలం పుట్టింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకుంటున్న కర్కోటకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కొరతకు కారణమని విమర్శించారు. మన కరెంటు మనకు రాకుండా చేసిన కర్కోటకుడు చంద్రబాబేనని, కృష్ణపట్నం రాకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రశ్నించకుండా కొందరు ఆ పార్టీ నాయకులు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

దీంతో మళ్లీ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకుముందు కూడా గవర్నర్ సమక్షంలోను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు చేతులు కలుపుకొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. అయినా వ్యవహారం మామూలుగానే ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఏమాత్రం తగ్గలేదన్న విషయం మరోసారి రుజువైపోయింది.

>
మరిన్ని వార్తలు