హైదరాబాద్.. కాలపాని

29 Jul, 2014 01:10 IST|Sakshi
హైదరాబాద్.. కాలపాని

కాలాపానీ.. అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన జైలు. నగరంలోనూ కాలాపానీ ఉంది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి చౌరస్తానుంచి సుమారు వందగజాల దూరంలో ఉందీ జైలు ప్రాంగణం. గాలికి రెపరెపలాడే జాతీయ పతాకంతో అటుగా వెళ్లేవారికి ప్రభుత్వ భవనంలా మాత్రమే కనిపించే ఈ జైలు గురించి.. జనానికి అంతగా తెలియదు. అండమాన్‌లోని కాలాపానీని చూడాలనుకునేవారు ఈ భవనాన్ని సందర్శిస్తే చాలు..
 
 సుమారు 150 సంవత్సరాల క్రితం1858లో ఆనాటి బ్రిటిష్ అధికారులు ఈ సెల్యూలార్ జైలును నిర్మించారు. తప్పుచేసిన బ్రిటిష్ సైనికుల్ని శిక్షించేందుకు సుమారు 20 వేల 344 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జైలుని నిర్మించారు. ఇదే నమూనాలో, ఈ జైలు కన్నా చిన్న సైజులో కాలాపానీ నిర్మాణం జరగడం విశేషం. ఈ వివరాలు ఇక్కడి ప్రాంగణంలో చాలా స్పష్టంగా ఒక ఫలకంపై రాసి వున్నాయి. గోతిక్ నిర్మాణ శైలిలో వున్న ఈ జైలు పైనుంచి చూస్తే శిలువ ఆకారంలో కన్పిస్తుంది.
 
 ప్రత్యేక కిటికీ...
 జైలు గది లోపల గోడకు గట్టి ఇనుప తాళ్లతో ఖైదీని కట్టి వుంచేలా ఏర్పాటు చేశారు. జైలుగదికి మూడు రకాల ఇనుప తలుపులున్నాయి. గదిలోనుంచి బయటికి చూసేందుకు చిన్న కిటికీని అమర్చారు. ఈ కిటికీకి ఓ ప్రత్యేకత వుంది. జైలు గదిలోని ఖైదీకి తనకెదురుగా ఏముందో అంత మాత్రమే కనపడుతుంది. తిరిగి అదే కిటికీ బయట నుంచి లోపలికి మనం చూస్తే ఆ గదిలోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపిస్తుంది. సెల్యులార్ జైలు  నిర్మాణశైలి  ఆనాటి బ్రిటిష్ సైన్యాధికాల కాఠిన్యానికి అద్దం పడుతుంది.
 
మూడో అంతస్తులో ఉరి..
 మూడో అంతస్తు, ఆ పైభాగాన ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే ఇనుప కప్పీల ఏర్పాటు ఉంది. శిక్ష అమలుకు ముందు ఖైదీకి తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం కోసం చిన్న ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ గదిలో అన్ని మతాల దేవుళ్ల చిత్రపటాలు ఉన్నాయి.  ఉరితీసే సమయంలో ఇనుప కప్పీలు సక్రమంగా పనిచేయకనో, లేదా మరేదైనా సాంకేతిక కారణం వల్లనైనా ఉరి గురి తప్పినా వ్యక్తి మరణించేలా సుమారు వంద అడుగుల లోతులో ఒక బావిలాంటి నిర్మాణం చేయడం ఇక్కడ మరో ఆసక్తికర విషయం. సుమారు పదిహేను దశాబ్దాల చరిత్ర పైబడిన ఈ బ్రిటిష్ నిర్మాణం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైలు శిఖ రాగ్రం నుంచి చూస్తే సికింద్రాబాద్ నగర పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
 
నూరేళ్ల సందర్భంగా...
 2006 మార్చి 10న అండమాన్ నికోబార్‌దీవుల్లోని కాలాపానీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జైలు ప్రాంగణాన్ని నేషనల్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం వేలమంది పర్యాటకులు కాలాపానీని సందర్శిస్తున్నారు. ఐతే తిరుమలగిరిలోని మిలిటరీ జైలు మాత్రం అధికారుల ముందస్తు అనుమతితో సందర్శించే వీలుంది. 1997లో ఇంటాక్ సంస్థ ఈ ప్రాంగణానికి హెరిటేజ్ అవార్డును ప్రకటించింది. గొప్ప చారిత్రక వారసత్వ ప్రాధాన్యత గల ఈ సెల్యులార్ జైలుపై రాష్ట్ర పర్యాటక శాఖ తగిన చొరవ చూపి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది.
 - మల్లాది కృష్ణానంద్

మరిన్ని వార్తలు