ఆరుగురు పోలీస్త్రీలు

11 Apr, 2015 22:33 IST|Sakshi
ఆరుగురు పోలీస్త్రీలు

అతివలు వంటింటి గడప దాటి చాలా కాలమైనా.. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వారి ప్రవేశం ప్రశ్నార్థకమే. కుసుమ కోమలంగా ఉంటే కొన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించలేరన్న భావన స్త్రీ శక్తికి అడ్డుగా నిలుస్తోంది. ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో తొలిసారిగా ఆరుగురు మహిళలు నియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫికర్‌ను కంట్రోల్ చేయడంతో సత్తా చాటుతున్న వారు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
-  సమీర నేలపూడి
 
మాదాపూర్.. సైబర్ టవర్స్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్... రెడ్‌లైట్ పడింది. పరుగులు తీస్తోన్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కానీ ఒక బైక్ మాత్రం ఆగినట్టే ఆగి మళ్లీ దూసుకుపోబోయింది. కానీ మరుక్షణంలో ఆగిపోయింది. ఎందుకంటే ఆ బైక్‌కి అడ్డుగా ఓ అమ్మాయి వచ్చి నిలబడింది. ఖాకీ ప్యాంటు, తెల్లని చొక్కా, నెత్తిమీద నీలిరంగు టోపీ.. ట్రాఫిక్ పోలీస్. ఆమెను చూస్తూనే అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. లేడీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారా అంటూ విస్మయం చెందారు. మాదాపూర్ పరిధిలోని ఆరు ప్రధాన కూడళ్ల దగ్గర ఆరుగురు మహిళా ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.  
 
ఇదే మొదటిసారి..
తెలంగాణ రాష్ట్రంలో మహిళా పోలీసులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ట్రాఫిక్ విభాగంలో ఒక్క మహిళా లేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ట్రాఫిక్‌ని నియంత్రించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా సిటీలో అది మరింత కష్టం. దానికి తోడు రోజంతా నిలబడి ఉండాలి. రకరకాల మనస్తత్వాలున్న వాహనదారులను ఓ దారికి తేగలగాలి.

ఇలాంటివి మగువలకు కష్టమనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగంలో ఇన్నాళ్లూ మహిళలకు నో ఎంట్రీ ఉంది. అంతరిక్షంలో అడుగుపెట్టగల మహిళ.. ట్రాఫిక్‌ను నియంత్రించలేదా అని అనుకున్న సైబరాబాద్ కమిషనల్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ విభాగంలో కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టారు. శకుంతల, అశ్విని, లావణ్య, శ్రీవాణి, వెంకటమ్మ, వరలక్ష్మిలను ట్రాఫిక్ పోలీసులుగా నియమించారు.
 
సవాళ్లను ఎదుర్కొంటూ...
మండుటెండలో ఆరేడు గంటలపాటు నిలబడి.. వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ... సిగ్నల్స్ ఉల్లంఘనులను అడ్డుకుంటూ.. ఫొటోలు తీస్తూ... చలానాలు రాస్తూ.. పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ... పై అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు ఈ ఆరుగురు ఇంతులు. అయితే వారు ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని నెలలు శ్రమించారు. రోడ్డు మధ్యన నిలబడటం.. వింత  చూపులను తట్టుకోవడం.. మొదట్లో మనస్తాపాన్ని కలిగించినా.. వాటిని అధిగమించాం అంటారు వీరు.

‘మేం పురుషులకు తీసిపోమని నమ్మి అధికారులు మమ్మల్ని తీసుకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి కదా’ అన్నారు ఆరుగురిలో ఒకరైన శకుంతల. ఇబ్బందులు అన్ని చోట్లా ఉంటాయి కదా! చేయలేం అనుకుంటే.. ఏమీ సాధించలేం’ అన్నారు శ్రీవాణి. ఈ ఇద్దరే కాదు. ఆరుగురిలోనూ ఒకటే  పట్టుదల. ఒకటే ధైర్యం. అవే వాళ్లను సవాళ్లతో నిండిన ఈ ఉద్యోగాన్ని సమర్థంగా చేసేందుకు తోడ్పడుతున్నాయి.
 
పాజిటివ్ రిజల్ట్స్..
సిటీలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ తక్కువేం కాదు. అయితే ఓ మహిళా పోలీస్ ఆపేసరికి అటువంటి వారంతా దారిలోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి కొన్ని పాజిటివ్ పరిణామాలు కనిపించడం, మహిళా పోలీసుల సామర్థ్యం కూడా నిరూపణ అవడంతో... త్వరలో మరికొంతమంది మహిళల్ని ట్రాఫిక్ పోలీసులుగా నియమించాలనుకుంటున్నారు అధికారులు. అదే జరిగితే.. త్వరలో తెలంగాణ రాష్ట్రమంతటా మహిళా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం ఖాయం.
 
ఎందులోనూ తీసిపోరు...
‘మా కమిషనర్‌గారి నమ్మకం నిలబడింది. ఆరుగురు అమ్మాయిలూ పురుషులకు తీసిపోకుండా పని చేస్తున్నారు. మేం కూడా వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. వాష్‌రూమ్స్ అందుబాటులో ఉండే కూడళ్ల వద్దే డ్యూటీ వేస్తున్నాం. అలాగే ఇద్దరిద్దరు డ్యూటీ చేయాల్సిన చోట ఒక మేల్ కానిస్టేబుల్‌తో పాటు వీరికి డ్యూటీ వేస్తున్నాం. దానివల్ల వారికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది కదా’ అన్నారు మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ టి.నర్సింగరావ్. మొదట్లో డ్యూటీ కష్టమనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది అంటున్నారు లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్ వరలక్ష్మి. ‘రాష్ట్రంలో మొదటిసారి తీసుకున్న మహిళా ట్రాఫిక్ పోలీసుల్లో నేనూ ఒకదాన్ని కావడం  సంతోషంగా ఉంది. వాహన చోదకులు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు’ అని చెప్పారామె.

మరిన్ని వార్తలు